కిరణ్ రోడ్ షోపై నిరుత్సాహం
- పార్టీ గుర్తును ప్రస్తావించని కిరణ్
- మదనపల్లెలో వెనుదిరిగిన జనం
మదనపల్లె/వాల్మీకిపురం, న్యూస్‌లైన్: జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మదనపల్లెలో చేపట్టిన రోడ్ షో ప్రజల కు నిరాశ, నిరుత్సాహాన్ని కలిగించింది. సాయంత్రం ఐదు గంటలకు రోడ్ షో ప్రారంభంకావాల్సి ఉంది. రెండు గంటలు ఆలస్యమయింది. రాత్రి 7గంటలకు అంబేద్కర్ సర్కిల్‌లో రోడ్ షో ప్రారంభమయింది. అప్పటిదాకా వేచి ఉండలేక జనం వెనుదిరిగి వెళ్లిపోయూరు.
అంతేగాకుండా జైసమైక్యాంధ్ర పార్టీ గుర్తు పాదరక్షలు గురించి ఏ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సభికుల్లో చర్చనీయాంశమైంది. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నరేష్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని మాత్రం కోరిన కిరణ్ ఏ గుర్తుకు ఓటు వేయా లో చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కిరణ్ అరగంట ప్రసంగంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీపై తీవ్ర విమర్శనాస్త్రాలు గుప్పించాడానికే ఎక్కువ సమయం కేటాయించారు.
బీజేపీతో జతకట్టి మదనపల్లె టికెట్టును కేటాయించడం చంద్రబాబు అనాలోచిత నిర్ణయానికి తార్కాణమన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని, ఓటు మాత్రం మనస్సాక్షికి వేయాలన్నారు. కార్యక్రమంలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ అభ్యర్థి బి.నరేష్‌కుమార్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు ముజీబ్ హుస్సేన్ పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో 3 గంటలు ఆలస్యం
వాల్మీకిపురంలో సాయంత్రం ఆరు గంటలకు రోడ్‌షో ప్రారంభించాల్సిన కిరణ్ రాత్రి 9 గంటలకు ప్రారంభించారు. ఈ రోడ్ షోలో కిరణ్ మాట్లాడుతూ మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చరిత్ర కెక్కారని విమర్శించారు. ఈ సారి ప్రజలు మంచి నాయకున్ని ఎన్నుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లారి కిషోర్ రె డ్డి, నిరంజన్ రెడ్డి, సర్పంచ్ రాజేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.