
ఎర్రదొంగల కట్టడికి ప్రధానిని కలుస్తా
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
తిరుమల: శేషాచలం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎర్రచందనం అక్రమ నరికివేతకు వ్యతిరేకంగా గతంలోనే తాను శేషాచల అడవుల్లో పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అంతర్ రాష్ట్రాల మధ్య సాగుతోందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకుంటే పరిష్కారమవుతుందని చెప్పారు. వాటికన్ సిటీలో క్రైస్తవేతర మతాలు ప్రచారం చేసేందుకు తాను విరుద్ధమని, అలాగే తిరుమలలో కూడా హిందూయేతర మత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సున్నితమైన అంశంతో కూడిన అన్యమత ప్రచారం అడ్డుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలోని పేరూరు వద్ద అక్రమ మైనింగ్ మాఫియా కారణంగా వకుళమాత ఆలయం కూలే స్థితికి చేరుకుందన్నారు. దేవాలయ పునర్ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషిచేయాలని, దాతలు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
సర్వ దర్శనానికి 6 గంటలు..
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండారు. వీరికి 16 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 6 గంటల తర్వాత దర్శనం లభించనుంది.