సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారంలోకి వచ్చాక 14 నెలల కాలంలో 17 రోజులపాటు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సందర్భంలోనూ అన్ని ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలను టీడీపీకి ఇచ్చిన పచ్చని జిల్లాకు ఏమిచ్చి రుణం తీర్చుకోనంటూ బీరాలు పోతుంటారు. ‘పశ్చిమ’కు పదేపదే వస్తూ ఏం చేసేందుకైనా సిద్ధమని బహిరంగ ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటివరకు జిల్లా ప్రగతి రూపురేఖలు మార్చే ఒక్క ప్రాజెక్టు కూడా టీడీపీ ప్రజాప్రతి నిధులు చంద్రబాబుతో మాట్లాడి సాధించలేకపోయారు. చివరకు నిట్ వంటి జాతీయ ప్రాజెక్టు ఏలూరు దరికి వచ్చినా ఏకతాటిపై నిలవని నేతలు చేజేతులా వదులుకున్నారు.
ఇదే సందర్భంలో బీజేపీకి చెందిన ఏకైక ప్రజాప్రతి నిధి, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అహర్నిశలు శ్రమించి నిట్‌ను తాడేపల్లిగూడెం తీసుకువెళ్లగలిగారు. ఎవరెన్ని చేసినా నిట్ ఏలూరుకే వస్తుందంటూ ఇన్నాళ్లూ గొప్పలు పోయిన టీడీపీ నేతలు గురువారం తాడేపల్లిగూడెంలో నిట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ‘నిట్ ఎక్కడికి పోయింది.. మన జిల్లాకే కదా వచ్చింది’ అంటూ సర్దుకుపోతున్నారు. ముగ్గురు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఇప్పటివరకు జిల్లాకు ఏం చేశారంటే.. ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొం దంటూ టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. ఇదే సందర్భంలో కమలనాథుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. అందుకే నిట్ భవనాల భూమి పూజను వేలాదిమంది సమక్షంలో ఓ వేడుకలా భారీగా చేపట్టాలని మంత్రి మాణిక్యాలరావు భావిస్తున్నారు.
మాగంటి పోకడలతో కలసిరాని ఎమ్మెల్యేలు
వాస్తవానికి సీఎం చంద్రబాబు శాసనసభ సాక్షిగా నిట్‌ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ పార్టీలోని బల మైన సామాజికవర్గ నేతల ప్రభావంతో ఆ హామీ నుంచి నెమ్మదిగా వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలో (నిట్) ఏలూరుకే వస్తుందంటూ ఎంపీ మాగంటి బాబు కొంతకాలం హడావుడి చేశారు. సీఎం కూడా నిట్‌ను వట్లూరులోని పెద్దచెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అన్ని సాంకేతిక పనులు చకచకా సాగా యి. సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక తరగతుల ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేశారు. ఈ సందర్భంలోనే మాగంటి బాబు ఏకస్వామ్యం ఎమ్మెల్యేలను దూరం చేసింది. తన ఒక్కడి వల్లనే నిట్ వస్తోందంటూ మిగిలిన నేతలను మాగంటి లెక్కలేనట్టు చూశారు. దీంతో ఆ నేతలు, ఎమ్మెల్యేలు నిట్ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. చివరికి నిట్ పోరాటంలో టీడీపీ తరఫున మాట్లాడేందుకు ఎవరూలేక మాగంటి చివరకు చేతులెత్తేశారు.
పైడికొండల ఒంటరి పోరాటం
ఇదే సమయంలో మంత్రి మాణిక్యాలరావు ఒం టరి పోరాటం చేశారు. పదేపదే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలసి వచ్చారు. సామాజికవర్గ నేతల ఒత్తిడితో నిట్‌ను ఏలూరుకు తీసుకువెళ్తున్నారంటూ బీజేపీ నేతలకు వివరించారు. ఇదే విషయాన్ని ఆంతరంగిక చర్చల్లో ఆధారాలతో సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద ఉం చారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాం తానికి నిట్ తీసుకువెళ్తున్నారంటూ బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీకి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలసిరావడంతో పైడికొండల చకచకా పావులు కదిపారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను ఎప్పటికప్పుడు సంప్రదించి నిట్ గూడెంలోనే అంటూ ప్రకటన చేయించగలిగారు. సీఎంను కూడా ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయించారు. వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తాత్కాలిక తరగతులు నిర్వహించే విధంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నెల 20న సీఎం చేతుల మీదుగానే నిట్ శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే దిశగా ఫలితం సాధించారు.
నిట్ సరే.. నియోజకవర్గ అభివృద్ధి మాటేంటి
కొంతకాలంగా నిట్ జపం చేస్తూ ఎట్టకేలకు సాధించిన మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ముద్ర వేయలేకపోయారన్న విమర్శలనూ మూటగట్టుకుంటున్నారు. స్థానిక సెంటిమెంట్‌తో నిట్ సాధించిన మంత్రిగా మార్కులు పడుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా కనీసం మాత్రంగా కూడా పనులు చేయలేకపోయారన్న వాదనలు బలంగా ఉన్నాయి. రోడ్లు, ప్రాథమిక సౌకర్యాల కల్పనలో జిల్లాలోని ఇతర పట్టణాలతో పోలిస్తే తాడేపల్లిగూడెం బాగా వెనుకపడి ఉందన్నది వాస్తవం. ఇక జిల్లా ప్రొటోకాల్ మంత్రిగా వరుసగా రెండుసార్లు పంద్రాగస్టు నాడు గౌరవ వందనం స్వీకరించిన పైడికొండల కేవలం తాడేపల్లిగూడెంకే పరిమితమవుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. మంత్రిగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటివరకు తిరిగిన దాఖలాల్లేవు. కేవలం తాడేపల్లిగూడెంకే మంత్రి అన్న అపప్రద నుంచి మాణిక్యాలరావు ఎప్పుడు.. ఎలా బయటపడతారో చూడాలి.
నిట్ తెచ్చి.. తమ్ముళ్లకు షాకిచ్చి..
Published Wed, Aug 19 2015 1:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement