గుంటూరు క్రైమ్: కేసుల నమోదు, సీడీ, చార్జిషీట్, అరెస్ట్ వివరాలతో పాటు నిందితుల ఫొటోలు, వేలిముద్రలు తదితరాలను అధికారులు ఇక నుంచి క్షణాల్లో తెలుసుకోవచ్చు. వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఈ కాప్స్ పేరుతో ప్రతి ఆన్‌లైన్‌లో ఒక్కొక్క కానిస్టేబుల్‌కు శిక్షణ ఇచ్చారు. పోలీస్ శాఖలో ఆధునికమైన క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకొని సీసీటీఎన్‌ఎస్ అమలుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది.
టీసీఎస్ కంపెనీ నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో రూరల్ జిల్లాకు 64, అర్బన్ జిల్లాకు 20 మందిని కేటాయించారు. వీరికి మూడు రోజుల శిక్షణ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సీసీటీఎన్‌ఎస్ విభాగంలో ప్రారంభించారు. శిక్షణ అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఒక్కొక్కరిని కేటాయిస్తారు. వీరు పోలీస్ స్టేషన్‌లో ఈకాప్స్‌కు సహకారంగా ఉంటూ పనిచేస్తారు. ఈనెల 26వ తేదీలోగా ఎఫ్‌ఐఆర్, కేస్‌డైరీ(సీడీ), చార్జిషీట్, అరెస్టులు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులు, నిందితులు తదితర వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారి పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
26న సీసీటీఎన్‌ఎస్ సేవలు అధికారికంగా ప్రారంభమౌతాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఆరు నెలలపాటు ఆయా సిబ్బంది స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆన్‌లైన్‌లో కేసుల వివరాలు, నిందితుల సమాచారం అధికారులు క్షణాల్లో తెలుసుకొని తదుపరి చర్యలు చేపట్టేందుకు సమయం కలసివస్తుంది. ఇదిలా ఉంటే పోలీస్‌శాఖతో సంబంధం లేని వ్యక్తుల తో ఈ వివరాలను నమోదు చేయిస్తే రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా తెలుసుకోండి..
అర్బన్, రూరల్ జిల్లాల సిబ్బందికి విడివిడిగా శిక్షణ ఏర్పాటు చేశారు. అర్బన్ సిబ్బంది శిక్షణను అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ , రూరల్ సిబ్బందికి రూరల్ జిల్లా అదనపు ఎస్పీ డి. కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ సమయంలో అధికారులు తెలియజేసే జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలు ఉంటే వెంటనే అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. సమాచారం నమోదులో ఎలాంటి సందేహాలు వచ్చినా సంబంధిత అధికారులకు తెలియచేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. రికార్డుల్లో పొందు పరచిన రహస్య సమాచారం బయటకు వెళ్లితే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇక కేసుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో..
Published Sun, Aug 17 2014 1:21 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
Advertisement
Advertisement