పరిచయస్తులే కీచకులు
కామపిశాచులు రెచ్చిపోతుండటంతో బాలికలతో పాటు మహిళలకు రక్షణ కొరవడుతోంది. కీచకులు అభం శుభం ఎరుగని చిన్నారులనూ బలితీసుకొంటున్నారు. నిర్భయ, పోక్సాయాక్ట్ వంటి చట్టాలు ఉన్నా.. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీంతో ఒంటరిగా వెళ్లడానికి మహిళలే కాదు బాలికలూ భయపడుతున్నారు. పరిచయస్తులు తమ శరీరాన్ని తడమడం, ఏదో చేయడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నగరంలో కొన్నేళ్లుగా ఈ విష సంస్కృతి క్రమంగా పెరుగుతోంది.
నెల్లూరు (క్రైమ్) : జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో సుమారు 38 లైంగిక దాడులు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మరోవైపు అనేక మంది లైంగిక వేధింపులకు గురవుతున్నా పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసుల వరకు రావడం లేదు. ఇలా అనేక ఘటనలు బాహ్య ప్రపంచంలోకి రాకుండానే మరుగునపడి పోతున్నాయి. కన్నతండ్రులే కడుపున పుట్టిన బిడ్డలపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలు సభ్య సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. బాలల రక్షణ, సంరక్షణ కోసం పని చేయాల్సిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు సంఘటన జరిగిన అనంతరం హడావుడితోనే సరిపెట్టుకుటున్నారు.
పలు సంఘటనలు..
ఈ ఏడాది జనవరి 27న నగరంలోని చాణుక్యపురి వద్ద ఐదేళ్ల చిన్నారిపై శ్రీనివాసులు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఫిబ్రవరి 4న వెంకటాచలం మండలంలో గిరిజన బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది.
ఫిబ్రవరి 6న నగరంలోని సిఆర్‌పిడొంకలో మూడేళ్ల చిన్నారిపై శేఖర్ అనే వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు.
ఫిబ్రవరి 8న కొండాపురం మండలంలోని ఓ గ్రామంలో గడ్డికోసుకొనేందుకు వెళ్లిన బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది.
జూలై 7న వెంగళరావనగర్ ఎన్‌సీసీ కాలనీకి చెందిన ఓ బాలికను ప్రేమపేరిట సాజిద్ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఆగస్టు 13న నగరంలోని నక్కలోళ్ల సెంటర్‌కు చెందిన నక్కల కన్నా తన అక్క కుమార్తె 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసి గర్భవతిని చేశాడు.
గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో, వెంకటాచలం మండలంలో కన్నతండ్రులే కడుపున పుట్టిన బిడ్డలపై లైంగికదాడి చేశారు.
చిన్నారులపైనే ఎందుకు...
ఐదేళ్ల వయస్సున్న పిల్లలకు తమను ఇతరులు వేరే భావంతో తాకుతున్నారున్న ఆలోచన రాదు. తల్లిదండ్రులు స్నానం చేయిస్తున్నప్పుడు తాకినట్లుగా ఉందన్న భావనతో వారు మిన్నకుండిపోతున్నారు. ఆరేళ్ల నుంచి ఎనిమిదేళ్ల పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు సెల్‌ఫోన్‌లో గేమ్‌లు చూపిస్తే చాలు పరిసరాలనే మర్చిపోతున్నారు. ఆ సమయంలో దుర్మార్గులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అర్థం చేసుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల్లో కొందరు టీచర్లు, ఇంటిపక్కన ఉన్నవారు శరీరాన్ని గట్టిగా వత్తినప్పుడు మాత్రమే ఏడుస్తున్నారు. ఈవిషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం లేదు.
పదేళ్ల నుంచి పన్నెండేళ్ల పిల్లపై టీచర్లు, పరిచయస్తులు, ఆటోడ్రైవర్లు మీదపడినా వారు పొరపాటున పడి ఉంటారన్న భావనతో పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. లైంగికదాడికి గురైన కొందరు చిన్నారులు 40 శాతం మంది మాత్రమే తీవ్రంగా భయపడిపోతున్నారు. మిగిలిన వారు ఈ విషయాన్ని కన్నవారికి వివరిస్తున్నారు. పదమూడు, పద్నాలుగేళ్ల విద్యార్థినులు పరిచయస్తులు, టీచర్లు, ఇతరులు తమను లైంగికంగా వేధించే ఉద్దేశంతో తాకినప్పుడు జాగ్రత్త పడుతున్నారు. వారికి ఎవరి స్పర్శ ఎలా ఉంటుందో అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుంది.
ఫోక్సాయాక్ట్ ఏం చెబుతోందంటే..
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ (ఫోక్సా) చట్టం ఉంది. నిర్భయ చట్టం కంటే ఇది కఠినమైనది. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2012లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం కింద కేసు నమోదు అయితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. సామాన్యులకన్నా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వారికి మరింత ఎక్కువ శిక్షపడేలా ఈ చట్టాన్ని రూపొందించారు. బాలికలు లైంగిక వేధింపులకు గురైతే ఈ కేసులను ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేస్తారు. 18 ఏళ్ల పైబడిన బాధితులకు అండగా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ సెక్షన్ 376తో పాటు ఇతర సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేస్తారు.