విద్యార్థినులపై లైంగిక వేధింపులు
శ్రీచైతన్య టెక్నో స్కూల్ అధ్యాపకుడిపై ‘నిర్భయ’ కేసు
హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తప్పుదారి పట్టాడు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ, చివరకు క్రిమినల్ కేసులో చిక్కుకున్నాడు. ఇలాంటి అఘాయిత్యాల నిరోధానికి ఇటీవల తీసుకొచ్చిన నిర్భయ చట్టం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్సార్ నగర్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన 31ఏళ్ల భుజంగరావు అనే వ్యక్తి నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ సమీపంలోని లక్ష్మీనరసింహనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే అతనికి వివాహమైంది. ఎస్సార్ నగర్‌లోని శ్రీై చెతన్య టెక్నో స్కూల్‌లో గణితం ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులపై అతని కన్నుపడింది. తరగతులు ముగిశాక ఒక్కొక్కర్నీ తన వద్దకు రమ్మనేవాడు. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు. లైంగికంగా వేధించేవాడు.
దీంతో బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. వారు గురువారం ఉదయం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ ఉషాదేవికి ఫిర్యాదు చేశారు. తరువాత ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడైన భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నిర్భయ చట్టంలోని 354డి సెక్షన్‌తో పాటు ఐపీసీ 509, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం 9ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విద్యార్థి సంఘాల ఆందోళన...
విద్యార్థినులపై లైంగిక వేధింపులు దురదృష్టకరమని, ఇందుకు బాధ్యులుగా ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. టీఆర్‌ఎస్‌వీ, ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బాబా ఫసియుద్ధీన్, ధర్మేంద్ర, రంజిత్‌ల ఆధ్వర్యంలో పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. కార్పోరేట్ పాఠశాలల్లోనూ విద్యార్థులకు రక్షణ లేకపోవడం అత్యంత దారుణమని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఆందోళన వ్యక్తం చేశారు.