సాక్షి, నరసరావుపేట(గుంటూరు): కోడెల కుటుంబానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే, ఇచ్చిన సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే కాళ్లావేళ్లా పడాల్సిందే.. వాళ్ల బెదిరింపులకు లొంగి ఉండాల్సిందే.. అలా కాదని ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో జైలుకు వెళతారు. లేదంటే భౌతిక దాడులకు గురవుతారు. ఇదంతా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో కోడెల కుటుంబం సాగించిన దందా. అయితే ఇప్పుడు రోజులు మారాయి. పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగింది. అధికార అహంకారంతో నెత్తికెక్కిన కళ్లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఏదైనా గేటు అవతల ఉండి మాట్లాడమని గద్దించిన నోళ్లు మూతబడ్డాయి. రాజీకి రండంటూ బాధితులను వేడుకుంటున్నాయి. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మి వ్యవహారంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. ఆనాడు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో ప్రభుత్వం మారిన తర్వాత కేట్యాక్స్ బాధితులంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కోడెల కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదవటంతో కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి పరారయ్యారు. వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం సైతం బెయిల్‌ను నిరాకరించింది.
దీంతో బాధితుల వద్ద నొక్కేసిన సొమ్మును వెనక్కి ఇచ్చి రాజీలు చేసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ అక్రమ తరలింపు వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడెల కుటుంబం నవ్వులపాలైంది. చివరకు ఆ పార్టీ నాయకులు, సొంత సామాజికవర్గం సైతం చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పోలీసులు కూడా అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో సర్జికల్ వ్యాపారికి ఇవ్వాల్సిన నగదుకు ఎగనామం పెట్టిన కోడెల కుమార్తె తాజాగా ఆ వ్యాపారిని పిలిచి మరీ నగదు చెల్లించడం గమనార్హం.
తిన్నది కక్కించారు
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చల్లా రవీంద్రరెడ్డి ఆ గ్రామంలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సర్జికల్ కాటన్‌ను కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీకి సరఫరా చేశారు. అందుకుగాను సుమారు రూ.15 లక్షలు రవీంద్రరెడ్డికి కోడెల కుమార్తె కంపెనీ నుంచి రావాల్సి ఉంది. నగదు కోసం పలుమార్లు ఆమెను కలిసి అడగ్గా బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు మూడు రోజుల క్రితం గుంటూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం సైతం కేట్యాక్స్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తుండటంతో మరో దారి లేక ఆయనకు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి విజయలక్ష్మి సంతకం చేసిన రూ.14.40 లక్షల రూపాయల విలువైన రెండు చెక్కులను శుక్రవారం సేఫ్ కంపెనీ మేనేజర్ అందజేశారు.
తండ్రి బాటలోనే తనయ
అక్రమాలు చేయటం, వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిదిద్దుకోవటంలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది అందె వేసిన చేయిగా చెప్పుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం బయట పడగానే.. తీసుకున్న ఫర్నిచర్‌కు డబ్బులు చెల్లిస్తానని బుకాయించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మి వెంకటేశ్వర సర్జికల్ కాటన్ యజమాని రవీంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు ముట్టచెప్పి కేసు మాఫీకి యత్నించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment