భోగాపురం, న్యూస్‌లైన్ : దీక్ష పట్టుదల ఉంటే సాధించలేనిదేదీ లేదని అంటున్నాడు తమిళనాడుకు చెందిన 32 ఏళ్ల ఆర్.తంగరాజు. పుట్టు వికలాంగుడైన అతను కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు మూడు చక్రాల సైకిల్‌పై వెళ్తూ.. ఆదివారం భోగాపురం చేరుకున్నాడు. ఈ సందర్భంగా రాత్రి అతనికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తన స్వగృహంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో తంగరాజు మాట్లాడాడు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సంస్థలో తన తల్లి 25 సంవత్సరాలుగా పని చేస్తుందని చెప్పారు. తాను అక్కడే ఇంజినీరింగ్ చదివానని, స్వామి వివేకానందుని ప్రవచనాలపై ఆసక్తితో సంఘ సేవకునిగా మారానని తెలిపారు. జనవరి 12, 2013 నుంచి 12 జనవరి 2014 వరకు వివేకానందుని కేంద్రం, కన్యాకుమారి ఆధ్వర్యంలో 150వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వివేకానందుని జన్మస్థలం కోల్‌కతాలో నుంచి బేలూరు మఠం నుంచి ఆయన తపస్సు చేసిన కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేపట్టానని అన్నారు.
జూలై 22న ఈ యాత్ర ప్రారంభించానని తెలిపారు. సెప్టెంబరు 11నాటికి అంటే 536 రోజుల్లో 2,400 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 800 కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెప్పారు. రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ.. దారిపొడువునా విద్యార్థులకు, యువతకు వివేకానందుని జీవిత చరిత్ర, సంఘం కోసం అతని సూచించిన మార్గాన్ని తెలుపుతున్నానని చెప్పారు. తనను చూసి కొంతమందైనా ఆయన మార్గం అవలంబిస్తే తన ఆశయం నెరవేరుతుందని అన్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఫిబ్రవరి 6 వరకు కోల్‌కతా నుంచి వివేకానందుడు సంచరించిన వివిధ ప్రదేశాల్లో 995 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశానని, ఇది రెండోయాత్ర అని పేర్కొన్నారు. కృషి, పట్టుదల, ఒక దృఢ సంకల్పంతో ప్రయాణిస్తున్న తనకు అంగవైకల్యం అడ్డుకాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద 150వ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి శ్రీధర్, బాలాజీ పాణిగ్రహి, కె.ఉమామహేశ్వరరావు, కన్వీనరు జీఎస్‌ఏ నరసింహం, ఉమాశ్రీనివాస్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా లీ గల్ సెల్ అధ్యక్షుడు వరుపుల సుధాకర్, శిరుగుడు గోవిందరావు పాల్గొన్నారు.
కోల్‌కతా టు కన్యాకుమారి
Published Mon, Aug 12 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement