కిరణ్.. ఆరోపణలు చేయించొద్దు: కొండ్రు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత మీడియా పెట్టుకొని తమపై వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్నారని.. ఈ పద్ధతి వీడకపోతే తామూ చాలా విషయాలు బయటపెట్టాల్సి ఉంటుందని మంత్రి కొండ్రు మురళీమోహన్ హెచ్చరించారు. ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్‌నే కిరణ్ నేడు దూషించడం సిగ్గుచేటన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి ఐ న్యూస్ ఛానెల్‌లో రూ. 25 కోట్లు పెట్టుబడి పెట్టారు. దాని నిర్వహణ బాధ్యతలు ఆయన తమ్ముడు సంతోష్‌కుమార్‌రెడ్డి చూస్తున్నారు. ఆ చానెల్‌లో నాపై, బొత్స, ఆనం, రఘువీరా, కన్నా లక్ష్మీనారాయణ, బాలరాజుపై రోజుకో రకమైన ఆరోపణలతో కథనాలు వేయిస్తున్నారు. ఇది మంచి పద ్ధతి కాదు. ఇదే కొనసాగితే మేము కూడా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో నాయకత్వ లక్షణాలున్నాయని.. కిరణ్‌లో అవి కూడా లేవన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ సీమాంధ్ర ప్రజల్ని కిరణ్ మోసగించారని ఆరోపించారు. సీమాంధ్ర సమస్యలు చెప్పేందుకు అవకాశం లేకుండా తమ గొంతునొక్కేశారని దుయ్యబట్టారు.