'జగన్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి'
హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందని మంత్రి కొండ్రు మురళి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అన్నా రావాలి లేదా... ఇంకో కొత్త ప్రభుత్వం అన్నా రావాలని కొండ్రు వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని విభజించమని కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రకు న్యాయం జరగలేదని ముసలి కన్నీరు కారుస్తున్నారని కొండ్రు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ, పోలవరంకు జాతీయ హోదా ఇవ్వడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొండ్రు మురళి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ నాయకత్వ లక్షణాలు కూడా లేవని ఆయన విమర్శించారు. కిరణ్ తో అన్ని అంశాలు చర్చించిన తర్వాతే హైకమాండ్ విభజనపై నిర్ణయం తీసుకుందన్నారు. సీఎం మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమైక్య సెంటిమెంట్ రెచ్చగొట్టారని కొండ్రు మురళి అన్నారు. కాంగ్రెస్ను వీడామంటున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను నేరుకు స్పీకర్కు లేదా పీసీసీకి కానీ ఇవ్వాలన్నారు. దొంగ రాజీనామాలు చేసి కాంగ్రెస్ను టార్గెట్ చేయవద్దని హితవు పలికారు.