- అటవీ అధికారుల హత్య కేసు విచారణ
- కోర్టుకు 346 మంది నిందితుల హాజరు
- కన్నీటి పర్యంతమైన నిందితుల బంధువులు
తిరుపతిలీగల్ : ఇద్దరు అటవీ అధికారుల హత్య కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న 346 మందిని పోలీసులు సోమవారం తిరుపతి కోర్టుకు తీసుకువచ్చారు. గత ఏడాది డిసెంబర్ 15న శేషాచల అడవుల్లో తిరుమల డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్.రామచంద్రశ్రీధర్, తిమ్మినాయుడుపాళెం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్‌కరుణాకర్ ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల చేతిలో హత్యకు గురయ్యారు. దీనిపై ఎస్వీ నేషనల్ పార్కు ఎఫ్‌ఆర్‌వో బి.రామలానాయక్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు 349 మందిపై ఐపీసీ 147, 148, 341, 302, 307, 332, 333, 120బి, 396, 397, 225ఆర్225(బి)రెడ్‌విత్ 149 సెక్షన్లతోపాటు ఫారెస్టు చట్టం 1967 కింద కేసు నమోదు చేశా రు. వీరిలో ఇద్దరు బాలనేరస్తులు కా గా ఒక నిందితుడు సబ్‌జైల్లో మరణిం చాడు. దీంతో 346 మందిలో కడప జైలుకు 101 మంది, నెల్లూరు జైలుకు 225 మంది, తిరుపతి జైలుకు 10మందిని జ్యుడిషియల్ కస్టడీకింద తరలిం చారు.
నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయడంతో తిరుపతి ఐదవ అదనపు జూనియర్ జడ్జి ఈ ఏడాది జూలై 31న 346 మందిని తిరుపతిలో విచారించి జిల్లా కోర్టుకు మేడ్‌ఓవర్ చేశారు. జిల్లా కోర్టు కేసు వివరాలను పరిశీలించి తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు పంపిం ది. సోమవారం తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి బి.రవీంద్రబాబు 346 మందిని వారిపేర్లను పరిశీలించా రు. న్యాయవాదిని నియమించుకోలే ని నిందితులు ప్రభుత్వ సహాయంతో న్యాయవాదిని నియమించుకోవచ్చునని సూచించారు. కేసును సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు.
కట్టుదిట్టమైన భద్రత
346 మంది నిందితులను పోలీసులు కడప, నెల్లూరు, తిరుపతి జైళ్ల నుంచి కట్టుదిట్టమైన భద్రతతో ఆరు బస్సుల్లో కోర్టుకు తీసుకువచ్చారు. వారికి రక్షణగా సుమారు 700 మంది పోలీసులు ఉన్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జట్టి నిందితులను, భద్రతా ఏర్పాట్లను కోర్టు ఆవరణలో పరిశీలించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్, తిరుపతి క్రైమ్ డీఎస్పీ తిప్పిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ బాషా, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ నరసప్ప, ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ అభిషేకం, సీఐలు రామచంద్రారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నరసింహులుతోపాటు పలువురు పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కన్నీటి పర్యంతమైన మహిళలు
ఎర్రకూలీల కుటుంబ సభ్యులు సోమవారం కోర్టు ఆవరణలో కన్నీటి పర్యంతమయ్యారు. చాలా రోజులుగా జైళ్లల్లో ఉన్న వారిని చూసి మహిళలు రోదించడం కనబడింది. కొద్దిమంది చంటిబిడ్డలతో హాజరై, తమ బిడ్డలను నిందితులుగా వచ్చిన తమ వారికి చూపించడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని మాట్లాడడానికి అనుమతించకపోవడంతో వారి వేదన మరింత పెరిగింది. కాగా 346 మంది నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరచడానికి సుమారు 3 లక్షలకు పైగా ఖర్చు అయినట్టు తెలిసింది.