'దొరికిపోవడం వల్లే సెక్షన్ - 8 తెరపైకి'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోవడం వల్లే సెక్షన్ - 8 ను తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్షన్ - 8 గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా విషయం ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటుకు రూ.5 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాల్లేవు. ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిన చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏపీలో మరోసారి ఓటుకు రూ.కోట్లు వ్యవహారానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరలేపబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే బలం లేని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో పెట్టారని విమర్శించారు. 'ప్రశ్నిస్తా..' అన్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అన్నాహజారే తమ్ముడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించడానికి సిద్ధమవుతున్నారన్నారు. ఏపీలో ఎన్టీవీ ప్రసారాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోటంరెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు చంద్రబాబుకు లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు.