మదుసూధన్ గుప్తా బైండోవర్ (వృత్తంలోని వ్యక్తి)
సాక్షి, అనంతపురం: జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన గుప్తాను బైండోవర్ చేశారు. 21, 23న జరిగే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ముందస్తు చర్యల్లో భాగంగా గుంతకల్లు మధుసూదన్ గుప్తాని శుక్రవారం పోలీసులు బైండోవర్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుత్తి పట్టణం కర్నూలు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు. అప్పడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు గుత్తి పోలీసులు పాత కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ని బైండోవర్ చేశారు. రూ.లక్ష సొంత పూచికత్తు తీసుకుని తహసీల్దార్ బ్రహ్మయ్య ఎదుట బైండోవర్ చేశారు. (చదవండి: ఇది ఫెవికాల్ బంధం)
కాగా, గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, ఆయన కుమారుడిని ఉద్దేశించి మధుసూదన గుప్తా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘మర్డర్లు చేయడం నాకు కొత్తకాదు, గతంలో టీడీపీ వారి ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే అది రాజకీయంలో భాగమేన’ని వ్యాఖ్యానించి కలకలం రేపారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు)
పలువురి నామినేషన్ల తిరస్కరణ
జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ)లో రెండేసి సెట్లు వేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక సెట్టును తిరస్కరించారు. అలాగే వివిధ కారణాల వల్ల మరో 8 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. 1995 తర్వాత మూడో సంతానం కల్గిన కారణంగా కదిరి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.కమలాబాయి నామినేషన్‌ను, కుల ధ్రువీకరణ పత్రం జత చేయని కారణంగా విడపనకల్లు వైఎస్సార్‌సీపీ తరుఫున దాఖలు చేసిన మేకల పంపాపతి నామినేషన్‌ను, డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం చేయని కారణంగా అగళి బీజేపీ అభ్యర్థి ఇ.చిక్కప్ప నామినేషన్‌ను, అనంతపురం నగరంలో ఓటరుగా నమోదైన కారణంగా గోరంట్ల బీజేపీ అభ్యర్థి కె.భాస్కర్ నాయక్ నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి తనకల్లు అభ్యర్థి వై. ఈశ్వరమ్మ, రొళ్ల అభ్యర్థి ఎస్.గౌడప్ప, పరిగి అభ్యర్థి కె.లక్ష్మీదేవమ్మ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేసుకున్నారు.
నేటితో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల అంకం తుదిదశకు చేరుకుంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా గురువారం రాత్రి 428 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపిన జెడ్పీ అధికారులు శుక్రవారం ఉదయానికి 409 నామినేషన్లను ధ్రువీకరించారు. ఇందులో 9 బీఎస్పీ, 40 బీజేపీ, సీపీఐ 5, సీపీఎం 7, కాంగ్రెస్ 33, వైఎస్సార్‌సీపీ 138, టీడీపీ 132, జనసేన 16, ఇండిపెండెంట్లు 29 నామినేషన్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment