అటానమస్ వాహనం తయారు చేసిన కౌశిక్ వర్మ
మామిడికుదురు (పి.గన్నవరం): అమెరికాలోని ఏఆర్‌ఎం యూనివర్సిటీ, టీవీఎస్ కంపెనీ ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన ఏఆర్‌ఎం డిజైన్ ఛాలెంజ్ పోటీలో పాశర్లపూడికి చెందిన రుద్రరాజు కౌశిక్ వర్మ తయారు చేసిన అటానమస్ వాహనానికి మొదటి బహుమతి లభించింది. ఇతడి తండ్రి, టీవీ నటుడు రుద్రరాజు ప్రసాదరాజు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చెన్నై శకుంతల అమ్మాళ్ (ఎస్‌ఏ) ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న కౌషిక్ వర్మ సొంత అలోచనతో అటానమస్ వాహనం రూపొందించాడని చెప్పారు. డ్రైవర్ లేకుండా నిర్దే శించిన ప్రాంతానికి చేరుకోవడం ఈ వాహనం ప్రత్యేకత. మూడు స్టేజిల్లో సెన్సార్స్ సహాయంతో ఈ వాహనం నడుస్తుందన్నారు.
సోలార్ ఎనర్జీతో కూడా పని చేయడం దీనిలో ఉన్న మరో ప్రత్యేకత అన్నారు. ఈ ప్రయోగం అనుకున్న విధంగా పనిచేసి నిర్వాహకుల ప్రశంసలు అందుకుందని చెప్పారు. దీంతో అతడికి అవుట్ స్టాండింగ్ వ్యక్తిగత ప్రతిభ అవార్డు రూపేణా రూ.25 వేల ప్రోత్సాహకం, షీల్డు అందజేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 200 టీములు ఈ పోటీల్లో తలపడగా తుది పోరులో 17 టీములు నిలిచాయన్నారు. వీటిలో కౌశిక్ వర్మ వాహనం విజేతగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన అతడిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కౌశిక్ సొంత ఊరు అల్లవరం మండలం గోడిపాలెం కాగా పాశర్లపూడిలోని తాతయ్య ఇంట్లో ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment