ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
పుష్కరాల నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
సాక్షి, విజయవాడ బ్యూరో: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నట్లు ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా పుష్కరాల కోసం నూతనంగా 280 ఘాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అమరావతిలో ఘాట్ల నిర్మాణంతో పాటు కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గోదావరి, కృష్ణా సంగమంలో ఘాట్ల నిర్మాణంపై మార్చి 15న మరోసారి సమీక్ష నిర్వహిస్తానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు.
కాగా, గోదావరి పుష్కరాల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా చూడాలని సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సంకల్పం తీసుకున్నట్లు వివరించారు. అలాగే కృష్ణా పుష్కరాలను కూడా నదుల అనుసంధానికి సంకల్పంగా స్వీకరించాలన్నారు. పూణె ఎంఐటీ(మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రతినిధి బృందం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. యువతకు నాయకత్వ లక్షణాల్లో శిక్షణ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రికి సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ విశ్వనాథ్ కరాడ్ తెలిపారు.