- 5.30నుంచి మొదలై 9.30 వరకు స్తంభిస్తున్న ట్రాఫిక్
- ప్రహసనంలా ముఖ్యమంత్రి ప్రసంగం
-రోజూ అదే ప్రసంగం
గాంధీనగర్ (విజయవాడ)
సాయంత్రం 6 గంటలు అవుతోందంటే ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంత వాసులు వణికిపోతున్నారు. నదుల అనుసంధానంతో తమ ప్రాంతం ఖ్యాతికెక్కిందన్న ఆనందం పుష్కరాల పుణ్యమాని ఆవిరైపోయింది. ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఫెర్రి వద్ద పవిత్ర సంగమం ఘాట్ ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించింది. పుష్కరుడికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హారతి ఇచ్చి స్వాగతించారు. స్వయానా ముఖ్యమంత్రి నదుల అనుసంధానం చేశామన్న విషయాన్ని ప్రజలకు చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం 7గంటలకు జరిగే నవదుర్గల హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారు.
ఇదే సమయంలో 12రోజులపాటు పన్నెండు కీలక శాఖలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు సంగమం వద్దే నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యమంత్రి నిత్యం సాయంత్రం సమయంలో ఘాట్ వద్దకు వచ్చి గంటన్నరకు పైగా సంగమం వద్ద ఉంటున్నారు. ఆ సమయంలో పోలీసుల ఆంక్షలు మీతిమీరిపోతున్నాయి. సాయంత్రం 5గంటల నుంచే పోలీసులు ఘాట్ వద్ద బస్సులు, ద్విచక్రవాహనాలు అనుమతించడం లేదు. హారతి సమయానికి రెండు గంటల ముందు ఘాట్‌కు చేరుకోకపోతే తర్వాత వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ సాహసించి వెళ్లాలనుకుంటే ఇబ్రహీంపట్నం రింగు వద్ద నుంచి రెండు కిలోమీటర్లు నడిచివెళ్లాల్సిందే. నడిచే వారిపైనా పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారు. ఎటువెళ్లాలని భక్తులు అడిగితే మాకేమి తెలియదు.. మేం కొత్త అటుగా వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో నదీ తీరంలో దీపాలు వెలగగానే భక్తులు నమస్కరించుకుని ఘాట్‌నుంచి జారుకుంటున్నారు.
ప్రహసనంలా సీఎం ప్రసంగం..
ఇదంతా ఒక ఎత్తై ముఖ్యమంత్రి ఘాట్ వద్ద ఉన్న సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అటు..ఇటు అంటూ పవిత్ర హారతి కార్యక్రమాన్ని వీక్షించకుండా చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. హారతి సమయంలో ఘాట్ వద్ద జనం లేక ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తుంటే , పోలీసులు వారిని అనుమతించకుండా దూరంగా పంపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి ప్రసంగం ఓ ప్రసహనంలా మారింది. రోజూ రావడం..గతేడాది గోదావరిలో సంకల్పం చేశాను. ఏడాదిలో గోదావరిని కృష్ణమ్మతో కలిపాను.. మరో ఏడాదిలో కృష్ణను పెన్నా నదితో కలుపుతాను.. చేతులు ముందుకు చాచి సంకల్పం చేయడంటూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి పక్కన వస్తున్న మంత్రులు చేయి చాచి సంకల్పం చేసిన పాపాన పోవడం లేదు. ఇదీ తంతు. సీఎం చంద్రబాబు ఏవైనా కొత్త విషయాలు చెబుతారని ఆశించిన భక్తులు భంగపడాల్సిన పరిస్థితి.
ఆ నాలుగు గంటలు నరకమే...
ఈ తంతు కోసం రోజూ సాయంత్రం 5.30 గంటలనుంచి 9.30, ఒక్కో రోజు పది గంటల వరకు ఇబ్రహీంపట్నం రింగు వద్ద ట్రాఫిక్ భారీగా స్తంభించి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ స్తంభించిన విషయాన్ని డ్రోన్లతో చిత్రీకిరిస్తున్నా ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోతున్నారు. పిల్లలు, వృద్దులతో దూరప్రాంతాలనుంచి హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆగచాట్లు పడుతున్నారు. పుణ్యానికి వస్తే పాపాం ఎదురైందన్నట్లు ఉందని ప్రజలు నిట్టూర్చుతున్నారు. దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తులతోపాటు, స్థానికులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రోజు వచ్చి ‘ నదులు అనుసంధానం చేశామని చెప్పుకోవడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. రద్దీగా ఉండేచోట్లకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి గంటల తరబడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి రాకకుముందే ఘాట్‌నుంచి బయటకు వద్దామనుకుంటే అప్పటి వరకు ఉచితంగా తిప్పిన బస్సులను దూరంగా నిలిపివేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి వెళితే మంచిదని స్థానికులు భావిస్తున్నారు.
నాలుగు రోడ్లలో నలిగిపోతున్నారు...
రింగ్‌నుంచి కొండపల్లి వైపు..., విజయవాడ రోడ్డులో గుంటుపల్లి వరకు,హైదరాబాద్ రోడ్డులో జూపూడి వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. స్థానికంగా ఉండే వీధులు వాహనాల రణగొణధ్వనులతో మార్మోగిపోతోంది.