చికున్‌గున్యాతో మంచంపట్టిన కూచిపూడి గ్రామం | Kuchipudi Village being affected with Chikungunya | Sakshi
Sakshi News home page

చికున్‌గున్యాతో మంచంపట్టిన కూచిపూడి గ్రామం

Published Sun, Sep 29 2013 3:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

Kuchipudi Village being affected with Chikungunya

కూచిపూడి (మర్రిపూడి), న్యూస్‌లైన్ : మండలంలోని కూచిపూడిలో వ్యాధులు విజృంభించాయి. గ్రామంలోని ఏ ఇంట్లో చూసినా చికున్‌గున్యా బాధితులు కనిపిస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 1724 మంది జనాభా ఉన్నారు. పారిశుధ్యలోపం కారణంగా వారంతా నిత్యం వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇటీవల ఈ గ్రామంపై డెంగీవ్యాధి పంజా విసిరింది. ఈ నెల 10వ తేదీ గ్రామానికి చెందిన మాచేపల్లి శిరీష (9) డెంగీతో మరణించింది. ప్రస్తుతం చికున్‌గున్యాతో గ్రామస్తులు నరకం చవిచూస్తున్నారు. కాళ్లు, చేతులు వేళ్లతో సహా పట్టకపోవడంతో అల్లాడుతున్నారు. కనీసం నడవడానికి కూడా ఇబ్బందిపడుతూ మంచానికే పరిమితమవుతున్నారు. ముందుగా విపరీతమైన జ్వరం, అనంతరం భరించలేని విధంగా కీళ్లనొప్పులు వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ప్రతి ఇంట్లో ఒకరిద్దరు బాధితులు దర్శనమిస్తున్నారు. తాజాగా కర్ణాటి పిచ్చమ్మ (65), బీమనాథి గౌతమ్ (9)లకు శనివారం జ్వరం రావడంతో మర్రిపూడిలోని ఆర్ ఎంపీని ఆశ్రయించారు. ఇప్పటికే తాళ్ల మాలకొండయ్య, నరాల కోటిరెడ్డి, ఉస్తెలమూరి కొండారెడ్డిలు జ్వరంతో పాటు కీళ్లనొప్పులతో బాధపడుతూ పలు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఈర్ల నాగమణి, ఈర్ల వెంకటేశ్వర్లు, ఈర్ల తిరుపాలు కనిగిరిలోని ఆస్పత్రిలో చేరారు. వీరితో పాటు పలువురు గ్రామస్తులు చికున్ గున్యా బారినపడి రోజులతరబడి కీళ్లనొప్పులు తగ్గక విలవిల్లాడుతున్నారు.గ్రామంలో లోపించి న పారిశుధ్యమే వ్యాధులకు కారణంగా తెలుస్తోంది. వీధులన్నీ మురుగునీరు, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా డెంగీతో ఒక బాలిక మృతిచెందినప్పటికీ పంచాయతీ, వైద్యాధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలని వారు కోరుతున్నారు.
 
మర్లపాడును చుట్టుముట్టిన జ్వరాలు...
మర్లపాడు (టంగుటూరు), న్యూస్‌లైన్ : టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామాన్ని జ్వరాలు వేధిస్తున్నాయి. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గ్రామంలోని రెండు ఎస్సీకాలనీలను రెండువారాలుగా జ్వరాలు చుట్టుముట్టాయి. సాధారణ జ్వరాలతో పాటు చికున్‌గున్యా జ్వరాలు ప్రబలుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా పారిశుధ్య లోపం, కలుషిత నీటి కారణంగా చర్మవ్యాధులతో అవస్థపడుతున్నారు. శరీరంపై దద్దుర్లు వచ్చి దురద పుడుతుండటంతో పాటు జ్వరాలు, ఒళ్లు నొప్పులతో స్థానికులు పడకేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో బాధితులకు ఆర్‌ఎంపీలే దిక్కయ్యారు. గ్రామంలో ఉన్న ఇద్దరు ఆర్‌ఎంపీల ఆస్పత్రులూ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.
 
 అయితే, ఆర్‌ఎంపీలు అందజేసే హైపవర్ మాత్రల కారణంగా తాత్కాలికంగా జ్వరం తగ్గుతున్నప్పటికీ మళ్లీ పునరావృతమవుతోంది. అంతేగాకుండా వ్యాధి నయమైనప్పటికీ హైపవర్ మందుల కారణంగా నీరసంగా ఉంటోంది. గ్రామంలోని ఎస్సీకాలనీలకు చెందిన రావిపాటి లక్ష్మయ్య, కొమ్ము కోటేశ్వరరావు, బందెల నవీన్, కొమ్ము సౌమ్య, వెంకటేశ్వర్లు, దార్ల వెంకట్రావు, దార్ల తిరుపతిస్వామి, చూడాబత్తిన అంకమ్మ తదితరులు విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు. కొమ్ము వెంకట్రావు, చిన్నారి గంగోత్రిలు చర్మవ్యాధుల బారినపడ్డారు. రెండు కాలనీల్లో సుమారు 100 మంది వరకూ జ్వరపీడితులున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఒక్క అధికారి కూడా గ్రామంవైపు కన్నెత్తిచూడలేదు. సమ్మె కారణంగా వైద్య సిబ్బంది కూడా గ్రామానికి రావడం మానేశారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటో అర్థంగాక రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నవారు పట్టణాలు, నగరాలకు వెళ్లి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుండగా, లేనివారు మాత్రం ఆర్‌ఎంపీలనే నమ్ముకుంటున్నారు. ఉన్నతాధికారులైనా తమ గురించి పట్టించుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement