సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు శుభవార్త అందించారు. ఉపాధి హమీ పథకాన్ని కొబ్బరి తోటల పెంపకానికి అనుసంధానం చేశామని కన్నబాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా కొబ్బరికి 75 శాతం బీమా ప్రీమియంను కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కలిసి ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. వేజ్ కాంపొనెంట్ కింద రూ.1,73,591, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.1,06,179లు కలిపి మూడు ఏళ్లకు హెక్టారుకు రూ.2,79,770లు కొబ్బరి రైతుకు ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా కొబ్బరి తోటలు పెంపకం చేయాలనుకునే రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కొబ్బరి ధరలు పడిపోయిన నేపథ్యంలో నాఫెడ్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నెల రోజుల్లోనే మిల్లింగ్ కోప్రాకి రూ. రెండు వేలు రేటు పెరిగిందని గుర్తుచేశారు. సీపీసీఆర్‌ఐ నిర్ణయం ప్రకారం త్వరలోనే సామర్లకోట వద్ద కొబ్బరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. రైతు తోటలోనే శాస్త్రజ్ఞులు పరిశోధన చేసేలా 'ఆన్ ఫార్మింగ్ రిసెర్చ్ స్టేషన్'ను కోనసీమలో ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment