సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని భవిష్యత్తులో మరింత పటిష్టం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్తగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు(రైతు భరోసా), ఇతర అనుబంధ శాఖల అధికారులతో మంత్రి కన్నబాబు బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొత్త యాప్ ద్వారా రైతు ఎప్పటికప్పుడు పంటల వివరాలు నమోదు చేయ వచ్చని తెలిపారు. 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్లను నియమించామని తెలిపారు.
మే 30 నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రజా ప్రతినిధులు సందర్శిస్తారని మంత్రి కన్నబాబు తెలిపారు. జూన్ 1 నుంచి వ్యవసాయానికి సంబంధించిన పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. పలు పథకాలతో సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేశారని తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధ రహితమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment