నంద్యాల, న్యూస్‌లైన్: సీమాంధ్రకు రాజధానిగా కర్నూలు నగరాన్ని ఎంపిక చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరినట్లు కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి నంద్యాల పట్టణంలో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర కు రాజధానిగా కర్నూలు అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు. త్వరలో రాజధాని కమిటీని నియమిస్తుందని అందులో కూడా కర్నూలు ఎంపికయ్యే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు విలేకరులు అడుగగా కిరణ్‌కుమార్‌రెడ్డికే కాదు పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉందన్నారు.
పార్టీలు వస్తుంటాయి.. పోతుం టాయి ప్రజల అభిమానం పొం దేవి కొన్నే ఉంటాయన్నారు. అలాగే కేంద్ర మంత్రి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడాన్ని కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదవులను అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దూరం కావడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు, కార్యకర్తలు బయటకు పోవడం లేదని నాయకులు మాత్రం వెళ్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించినట్లు కోట్ల వివరించారు.
‘కాంగ్రెస్ ద్రోహి శిల్పా’
పదవులు అనుభవించి ఎన్నికల సమయంలో పార్టీ మారుతున్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి.. కాంగ్రెస్ ద్రోహిగా మిగిలారని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో శిల్పాను, ఆయన అనుచరగణాన్ని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శోభా హోటల్‌లో గురువారం కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గతంలో దివంగత నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని శిల్పా వ్యతిరేకించారని, అయినా విధిలేని పరిస్థితుల్లో నంద్యాల అభ్యర్థిగా నియమించాల్సి వచ్చిందన్నారు. ఇక పై ఈ సమస్య స్థానిక నాయకులకు ఉండదన్నారు. త్వరలోనే నంద్యాలకు ఇన్‌చార్జి ప్రకటిస్తామని చెప్పారు. శిల్పా మోహన్ రెడ్డికి నిజంగా బలముంటే సొంత జిల్లా అయిన కడపలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలువాలని సవాల్ విసిరారు. ఆయన ఆటలు నంద్యాలలో సాగనివ్వబోమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తదితరులు మాట్లాడారు.
సీమాంధ్రకు కర్నూలే రాజధాని : కోట్ల
Published Fri, Mar 7 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement