
వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతా : బుట్టా రేణుక
న్యూఢిల్లీ : తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఆమె మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాను వైఎస్ఆర్ సీపీలోనే ఉన్నానని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు బుట్టా రేణుక పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే బాబును కలిసినట్లు చెప్పారు.
రాజకీయంగా తనకు ఎలాంటి అనుభవం లేనందువల్లనే కొంత గందరగోళానికి గురైన మాట వాస్తవమని బుట్టా రేణుక అంగీకరించారు. అందువల్లే ఇటువంటి పరిణామాలు జరిగాయని ఆమె తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని బుట్టా రేణుక తెలిపారు. ఈ ఎపిసోడ్కు ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ఆమె చెప్పారు. భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాదని బుట్టా రేణుక తెలిపారు.