కర్నూలు(అగ్రికల్చర్): సంచార రైతు బజార్ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతుబజార్ల ముఖ్య కార్య నిర్వహణాధికారి మురుగేష్ కుమార్ సింగ్(ఎం.కె.సింగ్) జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన సి.క్యాంపు రైతు బజారును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ కర్నూలులో 2, నంద్యాల 1 ప్రకారం సంచార రైతు బజార్లు నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్నామని, వీటికి కూరగాయలు సరఫరా చేసే రైతులను గుర్తించాలన్నారు.
కర్నూలు, విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడల్లోని రైతు బజార్లలో కొత్తగా ఈ-వైద్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని రైతు బజారులో పరిశీలించారు. రైతులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే ఈ-వైద్యం లక్ష్యమన్నారు. రైతులకు వీడియో కాన్ఫరెన్స్ తరహాలో హైదరాబాద్ నుంచి వైద్య సేవలు అందిస్తారన్నారు. ఇక్కడ ఒక కన్సల్టెంట్‌ను నియమిస్తామని, రైతు బజారుకు వచ్చే రైతులు, వినియోగదారులు వివిధ వ్యాధుల నివారణకు కన్సల్టెంట్‌ను సంప్రదిస్తే వారిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యులు పరిశీలించి వైద్యం సూచిస్తారన్నారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు. ప్రధాన పట్టణాల్లో వినియోగదారులకు తాజా కూరగాయలు తక్కువ దరకు అందేలా సంచార రైతు బజార్ల వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు, నంద్యాల్లో సంచార రైతుబజార్లు
Published Fri, Dec 19 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement