ఉల్లి లొల్లికి పరిష్కారం
Published Mon, Aug 26 2013 4:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్రయ విక్రయాల్లో ఏర్పడిన ప్రతిష్టంబన ఎట్టకేలకు తొలగిపోయింది. మార్కెట్‌కు భారీగా ఉల్లి రావడంతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం కూడా వేలం పాట నిర్వహించారు. జాతీయంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు కూడా వేలం పాటల్లో చురుగ్గా పాల్గొన్నారు. లారీ అసోసియేషన్ ఉల్లి రవాణాకు సరైన సమయంలో లారీలు పెట్టడం లేదనే ఆరోపణలపై వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపేశారు. మార్కెట్ కమిటీ అధికారులెవ్వరూ లేకపోవడంతో రైతులు గొడవకు దిగారు. చివరికి కమిటీ పాలక వర్గ సభ్యులు ఫరూక్ అహ్మద్, శేషగిరి శెట్టి తదితరులు జోక్యం చేసుకుని కొనుగోలుదారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. అసోసియేషన్ ప్రతినిధి ఒకరు మార్కెట్ కమిటీ కార్యాలయంలోనే ఉండి అడిగిన గంటలోపే లారీని పంపే ఏర్పాటు చేశారు.
మార్కెట్‌లో భారీగా ఉల్లి నిల్వలు..
మార్కెట్ యార్డు నిండా ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. శనివారం వేలంపాట నిర్వహించకపోవడం, ఆదివారం మరింత సరుకు విక్రయానికి రావడంతో మార్కెట్‌లో ఎటు చూసినా ఉల్లి నిల్వలే కనిపించాయి. సుమారు 20 వేల క్వింటాళ్ల నిల్వలుండిపోయాయి. వీటిని వేలంపాట ద్వారా కొనాలంటే రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ మేరకు రైతులు మార్కెట్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గ్రేడింగ్ భూతం..
గ్రేడింగ్ చేయకుండానే ఉల్లిని కొనాల్సిన వ్యాపారులు ఒకటికి రెండుసార్లు గ్రేడింగ్ చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యత లేదనే కారణంతో గ్రేడింగ్ సాకుతో వేరుచేసిన ఉల్లిని రైతులు పారబోయాల్సి వస్తోంది. గ్రేడింగ్‌కు అవకాశం లేకపోయినా మార్కెట్ కమిటీ ఒకసారికి అవకాశం ఇచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు రెండోసారి కూడా చేయిస్తూ రైతులను దెబ్బతీస్తున్నారు.
Advertisement
Advertisement