ఆ 400 కోట్లు ఏమయ్యాయి ? | Kurnool ZP PD Account Emptied, Where is 400 Crores | Sakshi
Sakshi News home page

ఆ 400 కోట్లు ఏమయ్యాయి ?

Published Wed, Apr 24 2019 10:28 AM | Last Updated on Wed, Apr 24 2019 1:14 PM

Kurnool ZP PD Account Emptied, Where is 400 Crores - Sakshi

కర్నూలు జిల్లా పరిషత్‌ భవనం

కర్నూలు (అర్బన్‌) : కర్నూలు జిల్లా పరిషత్‌ పరిధిలోని దాదాపు 9,021 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతభత్యాల్లోంచి నెలనెలా దాచుకున్న కోట్లాది రూపాయలు పీడీ ఖాతానుంచి మాయమైపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ‘స్వప్రయోజనం’ కోసం ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు  ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్‌ విభాగాలకు సంబంధించి జెడ్పీ అధికారులు, ఉద్యోగులతో పాటు  మండల పరిషత్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లోని మినిస్టీరియల్‌ ఉద్యోగులు, జెడ్పీ, మండల పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయులు, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి ప్రతినెలా దాచుకున్న సొమ్ము దాదాపు రూ.400 కోట్లు జెడ్పీ పీడీ ( పర్సనల్‌ డిపాజిట్స్‌) ఖాతాలో భద్రంగా ఉన్నట్లు మార్చి 31వ తేదీ వరకు  సీఎఫ్‌ఎంఎస్‌లో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌లో జెడ్పీ పీడీ ఖాతాలో  రూ.400 కోట్లు ఉన్నట్లు కనిపించడం లేదు.  తాజాగా జిల్లాలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దాచుకున్న రూ.3 కోట్లు మాత్రమే సీఎఫ్‌ఎంఎస్‌లో కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే  ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్మును వేరే కార్యక్రమాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. గతంలో ఫ్రీజింగ్‌ పేరుతో పలు పద్దుల విడుదలలో కొంత జాప్యం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌లోనే జీరో చూపించడం చరిత్రలో ఫస్ట్‌ టైం అనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.  

పీడీ ఖాతాలో సొమ్ము లేక ఆగిన రూ.7 కోట్ల పీఎఫ్‌ రుణాలు..  
జెడ్పీ పీడీ ఖాతాలో సొమ్ము లేకపోవడం వల్ల దాదాపు 300 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పీఎఫ్‌ రుణం పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. నెల రోజులుగా ఒక్క ఉద్యోగికి కూడా రుణం మంజూరైన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పీఎఫ్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దాదాపు రూ.7 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.  

జెడ్పీ సాధారణ నిధులు రూ.15 కోట్లు ‘ గాయబ్‌’
జిల్లా పరిషత్‌ సాధారణ నిధులు రూ.15 కోట్లు కూడా ఈ నెల 1 నుంచి సీఎఫ్‌ఎంఎస్‌లో కనిపించడం లేదు. జెడ్పీ సాధారణ నిధులు లేకపోవడం వల్ల ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని దీన స్థితికి జెడ్పీ చేరుకుంది. 2018–19 ఆర్థిక ఏడాదికి ఎస్‌ఎఫ్‌సీ, 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి జెడ్పీ సాధారణ నిధుల ఖాతాలో రూ.15 కోట్ల వరకు జమయ్యాయి. ప్రస్తుతం ఆ నిధులు కూడా కనిపించకపోవడంతో జెడ్పీలో ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ..  
జెడ్పీ పీడీ ఖాతాలో రూ. 400 కోట్లు  ఉన్నట్లు కనిపించకపోవడం వాస్తవమే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఎఫ్‌ రుణాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అప్‌లోడ్‌ చేస్తున్నాం. గత నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కొంత ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. పీఎఫ్‌ రుణాలను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– ఎం.విశ్వేశ్వరనాయుడు, జెడ్పీ సీఈవో

పీఎఫ్‌ డబ్బును వాడుకోవడం దారుణం..  
ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యనిధిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర  కార్యక్రమాలకు వినియోగించుకోవడం దారుణం. పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, పిల్లల వివాహాలు, ఇతరత్రా కార్యక్రమాల కోసం తమ అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పొదుపు చేసుకుంటే ఆ సొమ్మును కూడా ప్రభుత్వం వాడుకోవడం మంచి పద్ధతి కాదు. దీనిపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమీక్ష నిర్వహించి ఆందోళనా కార్యక్రమాలు చేపడతాం.
– హెచ్‌ తిమ్మన్న, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement