
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లంకా వెంకట సుబ్రహ్మణ్యం (ఎల్వీ సుబ్రహ్మణ్యం) శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం ఒకటో బ్లాక్‌లోని సీఎస్ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఉ.10.30 గంటలకు వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతపై కొత్త సీఎస్ అధికారులతో సమీక్షించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు.
చదవండి....(ఏపీ సీఎస్ పునేఠపై సీఈసీ వేటు)