అమ్మా...అమ్మా....
గాదెనబోయిన సంతోష రోజువారికూలీ. భర్తేమో లారీ డ్రైవర్. వారి కుమారుడు జశ్వంత్(4), కూతురు శరణ్య(2). రోజు మాదిరిగానే సాయంత్రానికి ఇంటికి చేరే తల్లి ఎంతకీ రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పాపం ఆ పిల్లలకు తెలియదు తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని. అయితే సంతోష రెండు రోజుల క్రితమే పౌల్ట్రీ ఫామ్‌లోకి పని కుదిరింది. జనవరి ఫస్ట్‌న పనికి వెళ్లలేదు. కూలికి వెళ్లిన రెండోరోజే లారీ సంతోషను పొట్టనపెట్టుకుంది.
వారంతా కూలీలు.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. భర్తలు వివిధ పనులు చేస్తుండగా ఇంటి బండి లాగడానికి తమవంతు కష్టపడుతున్నారు. కానీ వారి జీవితాల్లో లారీ చీకటి నింపింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న వారిని చిదిమేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు.
- న్యూస్‌లైన్, కట్టంగూర్
కట్టంగూర్, న్యూస్‌లైన్ : నార్కట్‌పల్లి మండల పరిధిలోని ఏపీలింగో టం వద్ద జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మం డలంలోని ముత్యాలమ్మగూడానికి చెందిన నలుగురు కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెరుకు వెంకమ్మ(50), కట్టెకుంట్ల ధనమ్మ(30), గాదెనబోయిన సంతోష(28), కట్టెకుంట్ల ముత్తమ్మ(50) మృతి చెందారనే వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో అత్తాకోడళ్లు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బంధువుల, గ్రామస్తుల రోదనలతో గ్రామం శోకసంద్రంగా మారింది.
పొట్టకూటి కోసం వెళ్లిన తొలిరోజే మృత్యుఒడికి చేరిన అత్తాకోడళ్లు
గ్రామానికి చెందిన కట్టెకుంట్ల ముత్తమ్మ, కట్టెకుంట్ల ధనమ్మలు అత్తాకోడళ్లు. డిసెంబర్ 31న నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫాంలో కూలి పనికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో పనికి వెళ్లలేదు. దీంతో గురువారం పనుల్లోకి వెళ్లిన తొలిరోజునే మృత్యువాత పడడంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. మృతురాలు ముత్తమ్మకు ఒక్కడే కొడుకు. కాగా ధనమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అత్తాకోడళ్లు ఇద్దరు వృత్తిరీత్యా కూలీలు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో పంటపొలాలు, పత్తి పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో కూలీ పనులు దొరకపోవటంతో పౌల్ట్రీ ఫాంలో పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రహదారిపై ఉండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది.
రె క్కాడితే డొక్కాడని కుటుంబం వెంకమ్మది
చెరుకు వెంకమ్మ వృత్తిరీత్యా కూలీ. గతంలోనే భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూలినాలీ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెల వివాహం చేసింది. కొడుకు కుమార్‌ను ఇంటర్ చదివిస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది.
కూలీ బతుకులు ఛిద్రం
Published Fri, Jan 3 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement