కూలీ బతుకులపై ‘పెద్ద’ దెబ్బ
రోడ్డున పడిన రెండు లక్షల మంది
కుదేలైన శ్రామిక జీవనం
వలసబాటలో పలు గ్రామాలు
నల్లధనమంటే తెలియదు...నల్ల కుబేరులంటేఅంతకన్నా తెలియదు...పెద్ద నోటు ఎందుకు రద్దు చేశారో... కూలీ డబ్బులు ఎందుకివ్వడం లేదో... పనిలోకి రావొద్దని ఎందుకంటున్నారో... ఉన్న ఉపాధి కాస్తా దూరమవుతున్నదెందుకో... పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిపోడానికి కారణాలేమిటో... ఆ బడుగు మనసుల్లో ఎన్నో ప్రశ్నలు... పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా ఎన్నాళ్లిలా... ఎన్నేళ్లిలా...దిన‘ధన’గండం...
ఇదీ.. ‘తూర్పు’ శ్రామిక శక్తి..
భవన నిర్మాణ కార్మికులు లక్షా 10 వేల మంది ఒక్క రవాణా రంగంపై ఆధారపడి 75 వేల మంది
ఆక్వా రంగంపై 35 వేల మంది
హమాలీలు 30 వేల మంది
జీడిపిక్కల ఫ్యాక్టరీల్లో 15 వేల మంది
కాకినాడ పోర్టులో బోటు వర్కర్లు 10 వేల మంది
62 రూరల్ మండలాల్లోని 1,075 పంచాయ తీల పరిధిలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులున్నవారు 7,82,847 మంది నమోదైన 44,538 కూలీల గ్రూపుల్లో ఉన్న కూలీలు 7,54,230 మంది
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో పని పొందుతున్నవారు 30 వేల మంది మాత్రమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల బతుకుల్లో పెద్ద నోటు రద్దు పెద్ద దెబ్బే వేసింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి 40 రోజులు దాటుతున్నా వీరి జీవన విధానం కుదుటపడడం లేదు. ప్రధానంగా అసంఘటిత రంగంపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు పనుల్లేక నానా యాతనా పడుతున్నారు. తాపీ మేస్రీ్తలు, హమాలీలు, ఆక్వా, రవాణా, భవన నిర్మాణం, జీడి పిక్కలు, పోర్టు వర్కర్స్.. ఇలా జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న రెండు లక్షల మంది కార్మికులు పనులు లేక పొట్ట గడవని దీనావస్థలోకి వెళ్లిపోతున్నారు. జిల్లాలో నిర్మాణ రంగం దాదాపుగా చతికిలపడింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు పొద్దస్తమానం కష్టపడితే ఉపాధికి ఢోకా
ఉండేది కాదు. ఇప్పుడు కష్టపడదామంటే అసలు పనే ఉండటం లేదు. బ్యాంకుల్లో నగదు విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో యజమానులు నిర్మాణ రంగాన్ని దాదాపుగా నిలిపివేశారు. నిర్మాణ రంగంలో నిర్వాహకులకు బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నప్పటికీ కరెన్సీ మారకం లేకపోవడంతో కిరాణా, ఆరోగ్యం వంటి వాటికి మాత్రమే పరిమితమవుతున్నారు.మరీ అత్యవసరమైన ఇంటి పనులు మాత్రమే చేయించుకుని మిగిలిన నిర్మాణ పనులను వాయిదా వేసుకుంటున్నారు.
నిర్మాణ రంగం కుదేలు...
ఈ పరిణామం నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా ఆధారపడ్డ తాపీ మేస్రీ్తలు, స్లాబ్లు వేసే జట్టు కూలీలు పనులు లేక మరో పని చేయలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా కష్టపడితే నాలుగైదు వందలు చేతికి వచ్చే పరిస్థితి ఇప్పుడు దూరమైపోయింది. అలవాటు లేకున్నా గత్యంతరం లేక వ్యవసాయ పనుల్లోకి వెళుతున్నా అక్కడ కూడా రైతులు కూలి డబ్బులు వారానికి ఒకసారి కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు లక్షా 10వేల మంది వరకు ఉన్నారు. ఒక్క రవాణా రంగంపై ఆధారపడి జిల్లాలో 75 వేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. ఆక్వా రంగంపై 35 వేల మంది, హామాలీలు 30వేల మంది, జీడిపిక్కల ఫ్యాక్టరీలలో 15 వేల మంది, కాకినాడ పోర్టులో 10వేల మంది బోటు వర్క్ర్స్ పనిచేస్తున్నారు. దాదాపు వీరందరి పరిస్థితీ అగమ్యగోచరంగా మారింది. నిత్యం పని ఉండే ఈ రంగాల్లో ప్రస్తుతం కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కలేక పనులను కట్టేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పనులు చేపడదామన్నా సొమ్ము సర్థుబాటు చేయలేక వదిలేయాల్సి వచ్చిందని భవన నిర్మాణ యజమాని పి వెంకటనారాయణ చెప్పుకొచ్చారు.
ఉపాధి కూలీల దీనావస్థ ఇలా...
వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తోన్న కూలీల దీనావస్థ మరో రకంగా ఉంది. అసలే ఉపాధి పనులకు అ¯ŒS సీజ¯ŒS. ఇందుకు కరెన్సీ కష్టాలు కూడా తోడవడంతో మొత్తం ఉపాధి కూలీలకు వేతనాలు అందక లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారు 30 వేల మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు దొరుకుతున్నాయి. వ్యవసాయ సీజ¯ŒS ప్రారంభం కావడంతో ఈ పనులు మరింత మందగించాయి. ఉపాధి హామీలో పనిచేసిన వారికి నగదు పోస్టాఫీస్లు, బ్యాంకుల్లో జమవుతున్నా చేతికి అందకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
జమ సరే...
జిల్లాలోని 62 రూరల్ మండలాల్లో 1,075 పంచాయతీల పరిధిలో 7,82,847 మందికి జాబ్ కార్డులున్నాయి. నమోదైన 44,538 కూలీల గ్రూపుల్లో 7,54,230 మంది కూలీలున్నారు. కానీ ప్రస్తుతం జిల్లా అంతటా కలిపితే 30 వేల మందికి మాత్రమే ఉపాధి హామీలో పని లభిస్తోంది. చేసిన పనికి కూడా చేతికి సొమ్ము దక్కని పరిస్థితి. గత నవంబరు నెలనే తీసుకుంటే మైదాన ప్రాంతంలో బ్యాంకులు, ఏజెన్సీ ప్రాంతంలో పోస్టు ఆఫీస్లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు సుమారు రూ.3 కోట్లు నగదు జమయింది.అదే డిసెంబరు నెలకు వచ్చేసరికి రెండు కోట్ల వరకు ఉంటుందని జాతీయ ఉపాధి హామీ పథక నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంకులు, పోస్టు ఆఫీస్లో సొమ్ములు జమయినా చేతికి మాత్రం సొమ్ములు రావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క ఏజెన్సీలో ఉపాధి పనులు లేక పలు మండలాల్లో గిరిజనులు ఖాళీ చేసి వలసలు కూడా వెళ్లిపోతున్నారు. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో 3లక్షల 50 వేల మంది జనాభా ఉంటే 1లక్ష11 వేల285 మందికి జాబ్ కార్డులున్నాయి. ఈ కార్డులున్న వారిలో గిరిజనులు 78 వేల మంది వరకు ఉంటారు. పనులు చేసి సొమ్ముల కోసం వారాల తరబడి బ్రాంచి పోస్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదంటున్నారు. మరోపక్క ఉపాధి పనులు లేక రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, చింతూరు, గంగవరం తదితర మండలాల నుంచి గిరిజనులు పనులు కోసం వలస పోతున్నారు. గంగవరం మండలం లక్కొండ, జడేరు, మర్రిపాలెం పంచాయతీలో 20 గ్రామాల నుంచి పనులు కోసం నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో సరుగుడు, చెన్నైలో జామాయిల్ తోటలు నరికేందుకు వలస పోతున్నారు. కార్మికులు, కూలీలపై పెద్ద నోట్లు రద్దు గట్టి దెబ్బతీసింది.
పనులు లేక పస్తులుంటున్నాం
పెద్ద నోట్ల రద్దుతో భవన నిర్మాణ పనులు చేసుకునే మాలాంటి వారి ఉపాధికి ఇబ్బందిగా మారింది. డబ్బులు లేవని మేస్రీ్తలు పనులు చెప్పడం లేదు. ఒకవేళ పని ఉన్నా డబ్బులు ఇచ్చే స్థితిలో మేస్రీ్తలు లేరు. దీంతో గత నెల రోజులగా ఒక పూట పనికి వెళ్తే వారం రోజులు ఇంటి వద్ద ఉంటున్నాం. డబ్బులు లేక కనీసం బియ్యం, కూరలు వంటివి తెచ్చుకోలేక పస్తులుండే పరిస్థితితో బాధపడుతున్నాం. పల్లెల్లో ఉంటున్నాం. బ్యాంకు కార్డుల ద్వారా లావాదేవీలు అంటున్నారు. వీటి వల్ల గ్రామీణులు ఆర్ధిక మోసాలకు లోనయ్యే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకుల ద్వారా ఎక్కువ నగదు ఇస్తేనే తమకు పనులు దొరుకుతాయి.
– నున్న భీమశంకరరావు, భవన నిర్మాణ కార్మికుడు, కరప
కార్మికుల జీవితాలతో ఆటలు
పెద్దనోట్లు రద్దు చేసి నల్ల కుబేరుల భరతం పడతామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ అసంఘటిత రంగ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. నోట్ల రద్దుతో కార్మికులు ఉపాధి దొరక్క రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. మరో పక్క నగదు రహితం పేరుతో చిరువ్యాపారుల జీవితాలను అథః పాతాళానికి తొక్కే చర్యలు చేపట్టారు.
– ఎం.వేణుగోపాల్, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి
నెల రోజులుగా పనులు లేవు
పెద్దనోట్లు రద్దు చేసిన దగ్గర నుంచి గడిచిన నెల రోజులుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్యల కారణంగా యజమానులు నిర్మాణాలను ఆపి వేయడంతో పనులు దొరకడం లేదు. మేస్రి్తలు, కూలీలకు పూటగడవక ఇక్కట్లకు గురవుతున్నారు.
– యాతం వెంకటరమణ, తాపీ మేస్త్రి