విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల్లో దుర్ఘటన
ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే అంటున్న కూలీలు
కొడకండ్ల(వరంగల్ జిల్లా): విద్యుత్ లైన్ పనులు చేస్తున్న దినసరి కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం శివారులో సోమవారం జరిగింది. నల్లగొండ జిల్లా జలాల్‌పురం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన విద్యుత్ లైన్ మండల కేంద్ర శివారులోని హక్యా తండ వ్యవసాయ బావులకు ఉంది. ఈ లైన్‌లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కొంతకాలం క్రితం విరిగిపోయింది. విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తూ ఈ స్తంభం మార్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఉపక్రమించారు. కాంట్రాక్టర్ సోమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లతండ, కొమ్మాల శివారు వీరునాయక్ తండాకు చెందిన గిరిజన దినసరి కూలీలు జలాల్‌పురం సబ్‌స్టేషన్‌లో మధ్యాహ్నం 12.26 నిమిషాలకు 92953 నంబర్‌పై ఎల్‌సీ ఇవ్వడంతో పని ప్రారంభించారు.
విద్యుత్ స్తంభం మార్చిన తర్వాత ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్‌కు కనెక్షన్ ఇచ్చేందుకు కందగట్లకు చెందిన గుగులోత్ బాబు(25) స్తంభం ఎక్కగా, వీరానాయక్ తండాకు చెందిన శివ డిస్క్ పనిచేసేందుకు వేరే స్తంభం ఎక్కాడు. బాబు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ ప్రసారమై షాక్‌కు గురై గుగులోత్ బాబు స్తంభంపైనే ప్రాణం విడిచాడు. మంటలు వ్యాపించడంతో గమనించిన శివ స్తంభం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా, ఎల్‌సీ తీసుకొని పనులు చేపట్టగా.. దానిని వెనక్కి ఇవ్వకుండానే సబ్‌స్టేషన్ ఆపరేటర్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని తోటీ కూలీలు సుధాకర్, శివ, భద్రు, సోమ్లా లు తెలిపారు. కందగట్ల తండాకు చెందిన గుగులోత్ రాజ-రాజమ్మ దంపతుల పెద్ద కుమారుడైన బాబుకు ఇంకా వివాహం కాలేదని సహచర కూలీలు తెలిపారు.
విద్యుదాఘాతంతో కూలీ మృతి
Published Mon, Mar 28 2016 10:40 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement