
సొంతగడ్డపై లగడపాటికి సమైక్య సెగ
ఏపీ ఎన్జీవోస్ దీక్షా శిబిరం వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చేదు అనుభవం ఎదురయింది. ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. గో బ్యాక్ లగడపాటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి గర్జనలో పాల్గొన్న అనంతరం బందరు రోడ్డులో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని లగడపాటి సందర్శించారు. కార్మికులతో కలిసి దీక్షలో కూర్చుకున్నారు. కొంపసేపటికి దీక్షా శిబిరంలో కలకలం రేగింది. గో బ్యాక్ లగడపాటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని లగడపాటిని డిమాండ్ చేశారు.
దీంతో లగడపాటి రాజగోపాల్ దీక్షా శిబిరం నుంచి వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానంపై బందరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఆయనతో చర్చలు జరిపి శాంతింప జేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.