నిధుల్లేక ‘ఆంధ్రో’ళన | lake of funds in Andhra University | Sakshi
Sakshi News home page

నిధుల్లేక ‘ఆంధ్రో’ళన

Published Mon, Jul 14 2014 4:38 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

నిధుల్లేక ‘ఆంధ్రో’ళన - Sakshi

నిధుల్లేక ‘ఆంధ్రో’ళన

ఏయూ క్యాంపస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విశిష్ట స్థానం ఉంది. పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తూ ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాదిమంది విద్యార్థులకు విద్యను చేరువ చేస్తోంది.  ప్రతిష్టాకరమైన విశ్వవిద్యాలయం ఇప్పుడు ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంతంతమాత్రంగానే ఉండడం, అంతర్గతంగా నిధులు సమకూర్చుకోవడం కష్టతరంగా మారుతోంది. వర్సిటీ నిర్వహణ, అభివృద్ధి గగనంగా తయారైంది.
 
ఆచార్యుల కొరత
ఆర్ట్స్ కళాశాల పరిధిలో 97, సైన్స్ కళాశాల పరిధిలో 97, ఇంజినీరింగ్ కళాశాలలో 136, న్యాయకళాశాలలో 10, ఫార్మసీ కళాశాలలో 13 ,దూరవిద్యలో 12, అనుబంధ పీజీ కేంద్రాల్లో 11 మంది ఆచార్యులు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు(కాంట్రాక్ ్టపద్ధతిన) 130 మంది పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా మరికొందరు కొనసాగుతున్నారు. వర్సిటీలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాల్సి ఉండగా, 24 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడే ఉన్నారు. కొన్ని విభాగాల్లో కేవలం ఒకరిద్దరు ఆచార్యులతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది.

ఆర్ట్స్ కళాశాలల పరిధిలో చరిత్రలో 1, హిందీలో 2, తత్వశాస్త్రంలో 2, సోషియాలజీలో 2, లిగ్విస్టిక్స్‌లో 1, ఎడ్యుకేషన్, ఎంజేఎంసీ, సంగీతం, సైకాలజీ, సంస్కృతం విభాగాల్లో 3 ఆచార్యులు చొప్పున ఉన్నారు. సైన్స్ కళాశాల పరిధిలో జియో ఫిజిక్స్‌లో 3, హ్యూమన్ జెనిటిక్స్‌లో 3, మైక్రోబయాలజీలో 1, న్యూక్లియర్ ఫిజిక్స్‌లో 3, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫుడ్, డ్రగ్, వాటర్ విభాగంలో  కేవలం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ప్రతి విభాగంలో ఒక ఆచార్యుడు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చొప్పున ఉండాలి. ప్రస్తుతం ఈ విధానం వర్సిటీలోని ఏ ఒక్క విభాగంలోను కనిపించడంలేదు. ఏటా నూతన కోర్సులు, విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా వీటికి అనుగుణంగా ఆచార్యుల సంఖ్య పెరగడం లేదు.
 
బ్లాక్‌గ్రాంట్‌పైనే ఆశలు
వర్సిటీకి ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్‌గా వస్తున్న రూ.130.38 కోట్లు కేవలం మూడు నెలల వేతనాలకు సరిపోతోంది. అంతర్గతంగా సమకూర్చుకున్న నిధులతో కాలం వెళ్లదీస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.118.38 కోట్ల లోటు బడ్జెట్‌తో బండి నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం 509 ఆచార్యుల నియామకాలకు అనుమతులు మంజూరు చేసింది. కానీ ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదు. ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన హామీ వస్తేగాని ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం లేదు. దీంతో బ్లాక్ గ్రాంట్‌పైనే వర్సిటీ ఆశలు పెట్టుకుంది.
 
వీటికి నిధులెలా?
వర్సిటీకి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వసతి సమస్య వెంటాడుతోంది. అదనపు వసతిగృహాలు నిర్మించాల్సి ఉంది. క్రీడా విభాగం పూర్తిస్థాయిలో ఆధునికీకరణకు రూ.50 కోట్లు, భవనాల ఆధునికీకరణ, మరమ్మతులకు రూ.50 కోట్లు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది గృహాల ఆధునికీకరణకు రూ.50 కోట్లు, బోధనేతర సిబ్బంది నియామకం, వేతనాలకు ఏడాదికి సుమారు రూ.60 కోట్లు, భూముల పరిరక్షణకు అవసరమైన రక్షణ గోడ నిర్మాణానికి రూ.50 కోట్లు, నిరంతరాాయంగా విద్యుత్ సరఫరాకు రూ.20 కోట్లు, ప్రయోగశాల అభివృద్ధి, నూతన పరికరాల కొనుగోలుకు ఏడాదికి రూ.50 కోట్లు అవసరం అవుతుంది.  
 
సెంట్రల్ హోదా ప్రతిపాదన
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రలో కేంద్రీయ విద్యా సంస్థలు నెలకొల్పనున్నారు. దీంతోపాటు ఏయూను కేంద్రీయ వర్సిటీగా మార్చాలని, ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు ఐఐటీ హోదా కల్పించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏయూను సెంట్రల్ వర్సిటీగా మార్చడం ద్వారా వసతుల కల్పన సాధ్యమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement