
వారి భూదాహం తీరడం లేదు
► గోశాల తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు
► ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విహెచ్‌పీ
అనంతపురం కల్చరల్ : అమరావతి నుంచి అనంత దాకా భూములన్నీ ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నా, అధికార పక్షానికి భూదాహం తీరడం లేదని పలువురు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. ఇస్కాన్ వారి గోశాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యామసుందర్, ఇస్కాన్ జిల్లా నిర్వాహకులు దామోదర గౌరంగదాసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాదా గాంధీ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ తదితరులు మాట్లాడారు. గోశాలను తరలించాలన్న నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదని, ఎటువంటి పరిస్థితులలోనూ గోశాలను అన్యాక్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం తరం చేస్తామని హెచ్చరించారు.
అధికారులపై చర్యలు తీసుకోండి
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. గోశాల తరలింపు నిర్ణయమే అనాలోచితమైంది. ధార్మిక భావజాలానికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మరోసారి ప్రభుత్వం తప్పు చేయకుండా ఆలోచించుకోవాలి. గోశాల ఉద్యమంలో బీజేపీ పూర్తి మద్దతునిస్తుంది.- విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు
కబ్జా పర్వం కొనసాగుతోంది
మనుషులు తిండి మాత్రమే తింటారు. కానీ తెలుగుదేశం పార్టీలోని వారు భూములను కూడా యథేచ్ఛగా తింటారనడానికి గోశాలను ఆక్రమించాలన్న నిర్ణయమే నిదర్శనం. సేవా కార్యక్రమాలను ప్రతీకగా నిలుస్తున్న ఇస్కాన్ గోశాల తరలింపును అడ్డుకుంటాము. అధికార పక్షాన్ని నిలదీయడానికి ఉద్యమంలో పాల్గొంటాం. - కేవీ రమణ,ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు
టీడీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు పెరిగిపోయాయి
సజావుగా నడుస్తున్న గోశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకోవడం వెనుక కుట్ర దాగుందని అందరూ అనుకుంటున్నారు. పార్టీ కార్యాలయానికి వాడుకోవడానికి గోశాల భూములను వాడుకోవడం దారుణం. అందరూ దీనిని ఖండించాలి.- దాదా గాంధీ,కాంగ్రెస్ నగర అధ్యక్షులు
అన్యమత ప్రచారానికే గోశాల భూములు
హిందుత్వ సంస్థలను దెబ్బతీయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం వెళుతోంది. నిన్నటి వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపం, నేడు గోశాల ఇలా ధార్మిక సంస్థల నుంచి భూములను లాక్కొని ఇతర మతాల వారికియ్యడం కోసం కుట్రలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోయినా గోశాల తరలింపును ముందుకు సాగనీయం. - శ్యామసుందర్,వీహెచ్‌పీ,జిల్లా ఉపాధ్యక్షులు