లారీ, బైక్ ఢీ.. ఇద్దరి దుర్మరణం
Published Thu, Aug 22 2013 2:30 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
మంగళగిరి/కోదాడ రూరల్ న్యూస్‌లైన్ : రాంగ్ రూట్లో వచ్చిన లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొనడంతో రెండు నిండు ప్రాణాలు బలికాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ పొక్కుల సుభాష్, గాయత్రీదేవి(33) దంపతులు తమ కుమార్తె చందన(5)తో కలిసి మోటార్‌సైకిల్‌పై గుంటూరులోని గాయత్రి పుట్టింటికి బయలుదేరారు.
మంగళగిరి ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద మంగళగిరి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ రాంగ్ రూట్‌లో ఎదరుగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలై చందన అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా గాయత్రీదేవి మృతిచెందింది. సుభాష్ తలకు బలమైన గాయాలయ్యాయి. సుమారు 15 నిమిషాలపాటు రోడ్డుపైనే బాధితులు కొన ఊపిరి తో కొట్టుమిట్టాడిన అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుభాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం తాడేపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుడిబండలో విషాదఛాయలు
ఫొటో స్టూడియో ద్వార గ్రామస్తులందరికీ సుపరిచితులైన సుభాష్ భార్య, కూతురు మృతిచెందడంతో గుడిబండ గ్రామస్తులు విషాదంలో ముని గిపోయారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న వారికి ఇలాంటి దురదృష్టకర సంఘటన ఎదురవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
Advertisement
Advertisement