తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ పదిలం
వైఎస్ విగ్రహావిష్కరణ సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
మద్దిపాడు: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలే ఆయన కీర్తిని చిరస్థాయిగా నిలిపాయన్నారు. మండలంలోని తెల్లబాడు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వైవీ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, రోగుల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖరరెడ్డి ఒక్కరే అన్నారు.
ఆయన మరణించి ఐదేళ్లు దాటినా ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంటే ఆయన అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ప్రతి పేదవాని సంక్షేమం చూడటమే కారణమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి కల్పిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని మోసగించాడని..ఇలా ప్రతి విషయంలో అబద్ధాలాడిన వ్యక్తి ప్రజలకు ఏంచేశాడని ప్రశ్నించారు. త్వరలో యువకులకు ఉద్యోగాలపై ఒక ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు. తండ్రిబాటలో మాటతప్పని జగన్‌ను ముఖ్యమంత్రిగా చూసే సమయం అతిదగ్గరలో ఉందని అన్నారు.
జిల్లాలో వైఎస్సార్ 4 సాగునీటి పథకాలను చేపట్టి 3 పథకాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తిచేసి ప్రారంభించారన్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం రూ.60 కోట్లు కావలసిన ప్రాజక్టుకు రూ.6 కోట్లు కేటాయించటం చూస్తే రైతులపట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో 600 అడుగులు బోరు వేస్తేకానీ నీరు అందుబాటులోకి రాదని, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతంలో 30 అడుగులకే నీరు పడుతుందంటే అంతా వైఎస్సార్ పుణ్యమే అన్నారు. తాము పశ్చిమ ప్రాంతంలో పడుతున్న బాధలను చూడలేకే రూ.3300 కోట్ల పైచిలుకు వ్యయం చేసి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ కృషి చేశారని అన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు కేవలం ఆ ప్రాజెక్టుకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారని అవి సిబ్బంది జీతభత్యాలకే సరిపోవన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తాను వైఎస్సార్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండటం పూర్వజన్మ సుకృతమన్నారు. తెల్లబాడు ఎస్సీ కాలనీ ప్రజలు చందాలు వేసుకుని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ ప్రతి క్షణంప్రజల కోసం, దళితుల కోసం ఆలోచించారని అన్నారు. చంద్రబాబు దళితులకు ఉపయోగించాల్సిన రూ.5 వేల కోట్లు ఎటుపంపించాడో సమాధానం చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో వైఎస్సార్ కొలువై ఉన్నారన్నారు.
పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ కేవలం అధికారం కోసం తపించిన చంద్రబాబు బూటకపు మాటలు ప్రజలు నమ్మి మోసపోయారని మరోసారి ఆ తప్పు చేయరని అన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎటువంటి వ్యక్తో అందరికీ తెలుసునని అన్నారు. కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీపీ నారావిజయలక్ష్మి, ఎంపీటీసీ ఉన్నం ప్రశీద, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, చుండూరి రవి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.