Maddipadu
-
కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!
మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణాల్లో ఊహించని ట్విస్ట్
-
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణాల్లో ఊహించని ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని మద్దిపాడు పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోన విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్లో బంధువులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు బాధితుడి సోదరుడు సమాచారం ఇచ్చారు. విజయ్‌భాస్కర్‌రెడ్డి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. -
భవనంపై నుంచి పడి వృద్ధురాలు మృతి
సాక్షి, మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నెం కోటయ్య భార్య విష్ణుప్రియ (65) తన ఇంటి పైనుంచి కిందపడి మృతిచెందింది. పై అంతస్తుకు వెళ్లిన ఆమె అక్కడినుంచి జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో గమనించిన కింది పోర్షన్లో అద్దెకు ఉండేవాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. బంధువులను పిలిపించి కేసు నమోదు చేశారు. ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని మృతురాలి కొడుకు తెలిపాడు. -
కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నం
మద్దిపాడు (సంతనూతలపాడు): తనను, తనబిడ్డను కిరోసిన్ పోసి తగులబెట్టటానికి ప్రత్యర్థులు ప్రయత్నించినట్లు ప్రకాశం జిల్లాలోని ఇనమనమెళ్లూరు ఎంపీసీ నగర్‌కు చెందిన మేకల సుభాషిణి మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు ఎంపీసీ నగర్లో నివాసం ఉంటున్న మేకల సుభాషిణి కుటుంబానికి అదే కాలనీకి చెందిన తుపాకుల రమణమ్మ, ఆమె కుమారుడు ఆంజనేయులుకు స్థలాల విషయంలో గతంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో తన భర్త బయటి గ్రామంలో పనుల కోసం వెళ్లగా, సుభాషిణితో వారు ఇరువురు గొడవ పడ్డారు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న తమపై కిరోసిన్ పోసి నిప్పుంటించటంతో మంటలకు చంటి బిడ్డను తీసుకుని పరుగులు తీసినట్లు సుభాషిణి పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యంత్రం కింద తలపెట్టి ఆత్మహత్య
మద్దిపాడు (ప్రకాశం జిల్లా) : మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని గోపాలకృష్ణ గ్రానైట్ క్వారీ వద్ద విషాదం చోటుచేసుకుంది. చంద్రమోహన్ మెహతా(40) అనే కార్మికుడు గ్రానైట్ బండరాళ్లను కోసే యంత్రం కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతని తల, మొండెం రెండూ వేరయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న మద్దిపాడు సీఐ సంజీవ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రమోహన్ స్వస్థలం పశ్చిమబెంగాల్. నాలుగు నెలల క్రితం క్వారీలో చేరాడు. నాలుగు రోజులుగా ఏదో బాధతో ఉన్నట్లు కనిపించిందని తోటి కార్మికులు తెలిపారు. -
వృద్ధుడి ఆత్మహత్య
మద్దిపాడు (ప్రకాశం జిల్లా) : మద్దిపాడు మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద పురుగుల మందు తాగి దేవరపల్లి కృష్ణారెడ్డి(64) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం కృష్ణారెడ్డి తన కుమారుడితో ఘర్షణ పడినట్లు తెలిసింది. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పవర్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ఘటనలో... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఓ ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రయాణికుడికి సమీపంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించగా, తీవ్ర గాయాలైన బస్సు డ్రైవర్ ఎంఆర్ బాబును 108లో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పుష్కరాల రద్దీ నేపథ్యంలో బస్సు విజయవాడకు వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం వారిని వేరొక బస్సులో విజయవాడకు పంపించారు. -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
మద్దిపాడు (ప్రకాశం): గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు మద్దిపాడులో రోడ్డెక్కారు. ముండ్లమూడు క్లస్టర్‌లోని వేంపాడు, రాయపాడు, పోలవరం, భీమవరం గ్రామాల రైతులు బుధవారం వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రానికి పొగాకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో పొగాకు ధరలు పూర్తిగా తక్కువగా ఉండటం, పొగాకును కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేయకపోవడం, నో-బిడ్ చేయడం వంటి వ్యవహారాల తీరుకు నిరసనగా పొగాకు రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారి పైకెక్కి వాహనాలను నిలిపివేసి తమ నిరసనను తెలియజేశారు. రైతులు తమ వెంట తెచ్చిన పొగాకును రోడ్డుపై తగలబెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని పొగాకు రైతులకు న్యాయం చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ పదిలం
వైఎస్ విగ్రహావిష్కరణ సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మద్దిపాడు: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలే ఆయన కీర్తిని చిరస్థాయిగా నిలిపాయన్నారు. మండలంలోని తెల్లబాడు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వైవీ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, రోగుల కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖరరెడ్డి ఒక్కరే అన్నారు. ఆయన మరణించి ఐదేళ్లు దాటినా ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంటే ఆయన అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ ప్రతి పేదవాని సంక్షేమం చూడటమే కారణమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి కల్పిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని మోసగించాడని..ఇలా ప్రతి విషయంలో అబద్ధాలాడిన వ్యక్తి ప్రజలకు ఏంచేశాడని ప్రశ్నించారు. త్వరలో యువకులకు ఉద్యోగాలపై ఒక ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు. తండ్రిబాటలో మాటతప్పని జగన్‌ను ముఖ్యమంత్రిగా చూసే సమయం అతిదగ్గరలో ఉందని అన్నారు. జిల్లాలో వైఎస్సార్ 4 సాగునీటి పథకాలను చేపట్టి 3 పథకాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తిచేసి ప్రారంభించారన్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం రూ.60 కోట్లు కావలసిన ప్రాజక్టుకు రూ.6 కోట్లు కేటాయించటం చూస్తే రైతులపట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో 600 అడుగులు బోరు వేస్తేకానీ నీరు అందుబాటులోకి రాదని, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతంలో 30 అడుగులకే నీరు పడుతుందంటే అంతా వైఎస్సార్ పుణ్యమే అన్నారు. తాము పశ్చిమ ప్రాంతంలో పడుతున్న బాధలను చూడలేకే రూ.3300 కోట్ల పైచిలుకు వ్యయం చేసి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ కృషి చేశారని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేవలం ఆ ప్రాజెక్టుకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారని అవి సిబ్బంది జీతభత్యాలకే సరిపోవన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తాను వైఎస్సార్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండటం పూర్వజన్మ సుకృతమన్నారు. తెల్లబాడు ఎస్సీ కాలనీ ప్రజలు చందాలు వేసుకుని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ ప్రతి క్షణంప్రజల కోసం, దళితుల కోసం ఆలోచించారని అన్నారు. చంద్రబాబు దళితులకు ఉపయోగించాల్సిన రూ.5 వేల కోట్లు ఎటుపంపించాడో సమాధానం చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో వైఎస్సార్ కొలువై ఉన్నారన్నారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ కేవలం అధికారం కోసం తపించిన చంద్రబాబు బూటకపు మాటలు ప్రజలు నమ్మి మోసపోయారని మరోసారి ఆ తప్పు చేయరని అన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎటువంటి వ్యక్తో అందరికీ తెలుసునని అన్నారు. కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీపీ నారావిజయలక్ష్మి, ఎంపీటీసీ ఉన్నం ప్రశీద, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, చుండూరి రవి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. -
సినిమా డెరైక్టర్ కారుకు ప్రమాదం
మద్దిపాడు(ఆంధ్రప్రదేశ్): ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం కారు బోల్తా కొట్టి అందులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ (36) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సినిమా డెరైక్టర్ ముకళంజియం తన స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వచ్చి తిరుగు ప్రయాణంలో కొష్టాలు సెంటర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు కుడివైపు ముందు చక్రం పేలిపోయింది. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండో వైపు రోడ్డులో నాలుగు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మద్దిపాడు ఎస్ఐకు సమాచారమందించడంతో కారులోని వారిని 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్‌పాండేకు తీవ్రగాయాలు కాగా, డెరైక్టర్ ముకళంజియం, నటుడు పెరుంజిత్తన్, డ్రైవర్ ఎస్.బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డెరైక్టర్ ముకళంజియం పూమణి, పూందొట్టం, కెలుక్కుమెరుక్కుం, మిటా మెరాస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మృతి చెందిన అరుణ్‌కుమార్ తంజావూరు జిల్లా పాపనాడుకు చెందినవారని తెలిసింది. ముకళంజియంది కూడా తంజావూరే. మద్దిపాడు ఎస్ఐ వి.మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.