ఇప్పటి హత్యలకు అప్పటినుంచే నాంది
వరుస ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారిందని, ఇప్పుడు జరుగుతున్న హత్యలకు అక్కడే నాంది పలికిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభ నుంచి వాకౌట్ చేసి, బయట గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చకోసం పట్టుబడుతున్న సందర్భంలోనే గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరిని చంపేశారని, అనంతపురం జిల్లా శింగనమలలో మరొకరిని హత్యచేశారని చెప్పారు. మొత్తం 3 నెలల కాలంలో 14 హత్యలు జరిగాయన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
''వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, ఘర్షణలు ఉండొచ్చు. అవి సమసిపోయేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పైనుంచి అధికార పార్టీ వారు ప్రోత్సహిస్తున్నారు. జరిగిన ఘటనలు హత్యకాదంటారా? 100 రోజుల్లో జరిగినవి హత్యలు కాదా? అసెంబ్లీ చర్చలో అ 14 కుటుంబాలకు ఏం భరోసా ఇస్తారన్నదానిపై మాట్లాడటం లేదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించేలా ఎందుకు చేయడంలేదు? మేం దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెడితే.. దాన్ని హాస్యాస్పదం చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఈ ఘటనలగురించి కాకుండా పాత అంశాలను తీసుకొస్తున్నారు. గతంలోకి పోవద్దని, అలా పోతే అవాస్తవాలు, ఆరోపణలు తప్ప చర్చ ముందుకెళ్లదని చెప్పాం. ముందుగా ఈ ఘటనలపై దృష్టిపెట్టాలని మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.
పథకం ప్రకారం మా గొంతులు వినబడనీయకుండా వారి గొంతులు మాత్రమే వినపడేలా సభ జరుగుతోంది. బాబు ప్రమాణస్వీకారం చేయడానికి ముందు హత్యలు జరిగితే విచారణ చేయరా? 19సార్లు అధికార పార్టీ సభ్యులు అప్రజాస్వామిక భాషను ఉపయోగిస్తే సభాపతి అడ్డుకోరు. మేం ఒకే ఒక్కసారి మాట్లాడితే.. దాని గురించి మాట్లాడతారు. మేం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నామని స్పీకర్ అంటారు. ఆ మాటను ఆయన అనడం కూడా అప్రజాస్వామికమే.
వాస్తవానికి ఇవాళ బడ్జెట్‌పై మాట్లాడాల్సి ఉంది... అదికాకుండా శాంతిభద్రతల అంశాన్ని ముందుపెట్టారు. పోనీ చర్చ పెట్టారు అంటే, మాకు మైకు ఇవ్వరంట.
చనిపోయిన కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి.. వారిపై నిందలు మోపారు.
పదేళ్ల కిందట కథలకు పోతున్నారు. పరిటాల రవిహత్యకేసులో దర్యాప్తు జరిగింది, కోర్టుల్లో విచారణకూడా ముగిసింది. ఈకేసులో దోషులకు శిక్షకూడా పడింది. అయినా అవే ఆరోపణలను పదేపదే చేస్తున్నారు.
ఒకవేళ మాకు మైకు ఇచ్చిఉంటే, మాకూ సభను పక్కదోవ పట్టించే ఆలోచన మాక్కూడా ఉంటే మేంకూడా అడిగేవాళ్లం. వంగవీటి మోహన రంగాని దగ్గరుండి చంపించింది చంద్రబాబే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబునుకూడా గట్టిగా నిలదీయాలంటే వంగవీటి మోహనరంగా కేసులో 11వ ముద్దాయి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ఇదే అసెంబ్లీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈకేసులో ముద్దాయి. ఆయన చంద్రబాబు పక్కన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే చంద్రబాబును మేం ప్రశ్నించాలనుకుంటే వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ ఆరోజు హోంమంత్రిగా లేరా? అవాళ ఆయన బాధ్యుడు కాదా? బాధ్యత తీసుకోరా? రాజీ నామా చేయాల్సిన పరిస్థితుల్లో పదవి వదులుకున్నారు.
సభను పక్కదోవ పట్టించడానికి మేంకూడా ఇవన్నీ ప్రస్తావించి ఉండొచ్చు. విషయం పక్కదోవ పట్టకూడదని గట్టిగా మేం చర్చకోసం పట్టుబట్టాం. కానీ అధికారపక్షం వాళ్లు తెలిసీ, తెలియని విషయాలతో అవాస్తవాలు చెబుతున్నారు. సభా సమయాన్ని పూర్తిగా వృథా చేశారు. ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేదా ప్రతిపక్షనేత వాకౌట్ చేస్తున్నప్పుడు మైకు ఇస్తారు. కానీ దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా మైకు ఇవ్వకుండా స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ఆయన తెలుగుదేశం కార్యకర్తా? మంత్రా? టీడీపీ ఎమ్మెల్యేనా? స్పీకరే నిర్ణయించుకోవాలి. మా గొంతు నొక్కుతున్నప్పుడు నిరసన తెలపడం మినహా మాకు మరో మార్గంలేదు.
పోలీసులతో రాయించిన ఎఫ్‌ఐఆర్‌లు కాకుండా మరణించిన వారి కుటుంబాల మాటలు వినాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. హత్యకు గురైన కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. చిన్నచిన్నగొడవలు హత్యలవరకూ వెళ్తున్నాయంటే రాజకీయ వ్యవస్థ చెడిపోతున్నట్టే. అధికారంలో ఎవ్వరున్నా.. హత్యలను ప్రోత్సహించకూడదు. మైకులు ఇవ్వకపోవడం వల్లే మేం వాకౌట్ చేశాం. మా గొంతులు వినే అవకాశం లేదుకాబట్టి వాకౌట్ చేశాం. శాంతిభద్రతలపై చర్చ ముగిశాక బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటాం. అక్కడ రుణమాఫీ అంశంపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తాం. రైతులకు, డ్వాక్రా మహిళలకు తోడుగా ఉంటాం. ఈ సందర్భంగా జరిగే చర్చను రాష్ట్రం మొత్తం చూడాలి. దీన్నికూడా ఆపడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను దేశంమొత్తంచూడాలి
ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. దీనిపైకూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీ జరుగుతున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి. రాజకీయ లబ్ధి కోసమే అధికారపక్ష సభ్యులు తీర్పువచ్చిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఇలాగే వ్యవహరిస్తే... వ్యవస్థ కుప్పకూలిపోతుంది'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.