‘పాలెం’ దుర్ఘటనపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
ఏలూరు: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో మృతి చెందిన 45 మంది ప్రయాణికుల కుటుంబాలకు న్యాయం చేసి, దేశ రహదారులకు అనువుగా లేని వోల్వో బస్సులను రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన న్యాయ విద్యార్థి జి.అరిస్టాటిల్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన హెచ్‌ఆర్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, రవాణాశాఖ, ఆర్టీసీ, పోలీసు శాఖలు పనితీరు మెరుగుపరుచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవిద్యార్థి నవంబర్ 16న హెచ్‌ఆర్సీని కోరారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల సంఘం విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది.