Palem bus Accident
-
బలి జరిగితేనే కానీ....
ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయి. ఆ ప్రాణాలు ఎక్కడ ఎప్పుడు ఏలా పోతాయో ఎవరికి ఏరుకా. ఏదైన ప్రమాదం జరిగి మనుషులు మరణిస్తే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీ చేతులు కాలాక అకులు పట్టుకున్న చందంగా తయారైంది. అందుకు తాజా ఉదాహరణ.... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మరో 15 మంది వరకు గాయపడ్డారు. దేశంలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న సంఘటన ఇదే మొదటిది కాదు... గతంలో పలు రాష్ట్రాలలో ఇటువంటి తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, స్కూల్ బస్సు ప్రమాదాల నివారణ.... నిర్భయ అత్యాచారం వరకు ప్రభుత్వం ఏన్నో కమిటీలు వేసింది. ప్రభుత్వం కూడా ఆ కమిటీలు అందించిన నివేదికలు భద్రంగా అటకెక్కించింది. అదేమిటో ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వ అధికారుల్లో స్పందన వస్తుంది. తనిఖీల పేరిట నానాహడావుడి చేస్తారు. అందుకు పాలెం బస్సు దుర్ఘటన అందుకు ఉదాహరణ. ఆ తర్వాత నాలుగైదు రోజులకు వారు మొద్దు నిద్రలోకి జారుకుంటారు. ప్రమాదం జరిగి ప్రజలు బలి అయితేనే అటు రాష్ట్ర ప్రభుత్వంలోకానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ చిరు కదలిక వస్తుంది. అంతలోనే మళ్లీ ఇలాంటి వన్ని మాములే అని ప్రభుత్వ పెద్దలు సర్థి చెప్పుకుని కామ్‌గా ఉంటారు. ప్రజలకు ఎక్కడ,ఎలా ప్రమాదం జరిగే వీలు ఉంది... అటువంటి సంఘటనలు జరగకుండా ఏలాంటి చర్యలు తీసుకోవాలి... ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందితో సహా అందరిని భాగస్వామ్యం చేసుకుంటు ముందుకు వెళ్లితే ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం ఇలాంటి చర్యలు పునరావృతం కావు. ఏదైన ప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు బలి అయితేనే కానీ ప్రభుత్వం స్పందించదు. ఓ వేళ ప్రభుత్వం స్పందించిన... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు తీసుకుంటాం... కమిటీ వేస్తున్నం ... నష్టపరిహారం కింద లక్షలు ఇస్తామని ప్రకటిస్తుంది. అంతే ఆ తర్వాత ప్రమాదంపై ప్రభుత్వం ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నివేదక ఇస్తుంది. దాన్ని తీసుకువెళ్లీ అటకెక్కిస్తారు. అంతే ఆ తర్వాత మళ్లీ ఏదో ప్రమాదం సంభవించి... ప్రజలు పెద్ద సంఖ్యలో మృతి చెందితే... ప్రభుత్వం మళ్లీ ఇదే చిలకపలుకు పలుకుతుంది. అంతే కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా శాశ్వత నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఉన్న జవాబు మాత్రం శూన్యం. -
పాలెం బస్సు ఘటనపై సీఐడీ చార్జిషీటు
-
పాలెం బస్సు ఘటన: జేసీ ప్రభాకర్ భార్య సహా 10 మందిపై చార్జిషీటు
పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనపై సీఐడీ విభాగం చార్జిషీటు దాఖలుచేసింది. వోల్వో బస్సు తయారీలోనే లోపాలున్నాయని, అందులోని డీజిల్ ట్యాంక్ టైర్లకు దగ్గరగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అందులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సు సీట్ల డిజైన్ మార్చారని, అదికూడా ఈ ప్రమాదానికి కారణంగా మారిందని తెలిపారు. (చదవండి: వోల్వో బస్సు దగ్ధం - 44 మంది దుర్మరణం) ఈ కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, జబ్బార్ ట్రావెల్స్, ఆర్అండ్బీ శాఖతో పాటు మొత్తం పదిమంది నిందితులపై చార్జి షీటు దాఖలైంది. ఈ బస్సు ప్రమాదంపై 400 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సీఐడీ పంపింది. మహబూబ్‌నగర్ కోర్టులో మే 7వ తేదీన చార్జిషీటు దాఖలు చేశారు. (చదవండి: ఎవరినీ వదిలిపెట్టం.. 40 రోజుల్లో ఛార్జిషీటు) -
పాలెం బస్సు బాధితుల అరెస్ట్, పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు బాధితులను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేశారు. మంగళవారం వీరంతా హిమాయత్ నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి బయల్దేరగా.... పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయటం అమానుషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ సీపీఐ నేతలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాగా పాలెం బస్సు ప్రమాద బాధితులు ప్రధానంగా నాలుగు డిమాండ్లతో సినీ నటుడు శివాజీ నేతృత్వంలో నిన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బస్సు యజమాని జేసీ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అనుమతులతో ప్రైవేట్ బస్సులు నడిపించాలని వారు ఈ సందర్భంగా బొత్సను కోరారు. బాధితుల డిమాండ్లపై స్పందించిన బొత్స మాట్లాడుతూ బాధితుల డిమాండ్లు తీర్చే అధికారం తనకు లేదని, అయితే తన పరిధిలో న్యాయం చేస్తానని అన్నారు. ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రెండు రోజుల్లో లేఖ రాస్తానని చెప్పారు. -
మంత్రి బొత్స రాజీనామా చేయాలి
విజయనగరం మున్సిపాల్టీ,న్యూస్‌లైన్: పాలెం బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోలేని మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని యువసత్తా జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి వెంకటరమణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జబ్బార్ ట్రావెల్స్ ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక లోక్‌సత్తా నాయకులు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పాండ్రంకి మాట్లాడు తూ, బస్సు ప్రమాదం జరిగి 66 రోజులు గడుస్తున్నా బాధితుల కు ఎటువంటి న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే జబ్బార్ ట్రావెల్స్ లెసైన్సును శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాం డ్ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతలపూడి అప్పలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం జబ్బార్ ట్రావెల్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సుభద్రాదేవి, మెల్లేటి నాయుడు, పరుచూరి ఉదయగౌరి, ఎ.కాశీపతి, జి. వీర్రాజు, పవన్, మాధవ్, టి.అప్పారావు పాల్గొన్నారు. -
సీఎం, బొత్సలది బాధ్యతారాహిత్యం.. కోర్టులో కేసు వేస్తాం
రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీఏ కమిషనర్‌తో పాటు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలపై కోర్టులో కేసు వేస్తామని పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాల వారు తెలిపారు. 45 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బాధిత కుటుంబాల సభ్యులు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో కలిసి అఖిలపక్ష నాయకులతో పాటు ముఖ్యమంత్రిని కలిసి బాధితులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తామని పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాల సభ్యులు చెప్పారు. -
రైల్వేమంత్రిని అరెస్ట్ చేస్తారా?: జేసీ
అనంతపురం: వోల్పో బస్సు దుర్ఘటనపై మాజీ మంత్రి దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాలెం ఘటన తర్వాత తమను అరెస్టు చేయమంటున్నారని, నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటనకు బాద్యుడిని చేస్తూ రైల్వేమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. తమవి దొంగ బస్సులైతే పర్మిట్లు రద్దు చేయాలని సవాల్ విసిరారు. కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ పాత బస్సులకు పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పాలెం ఘటన వార్తలపై కొందరు మీడియా ప్రతినిధులు తమను బ్లాక్‌మొయిల్ చేస్తున్నారని వెల్లడించారు. అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సుకు మంటలంటుకుని 45 మంది సజీవ దహనమైన సంగతి విదితమే. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయాల చొప్పున పరిహారం చేతులు దులుపుకుంది. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానులను శిక్షించాలంటూ బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. -
డ్రైవర్ డబుల్ డ్యూటీ.. బాణసంచా
వోల్వో బస్సు ప్రమాదానికి కారణాలివేనని తేల్చిన దర్యాప్తు నివేదిక న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదానికి డ్రైవర్ డబుల్ డ్యూటీ చేస్తుండడమే ప్రధాన కారణమా? బస్సులోపల బాణసంచా ఉందా? పాలెం బస్సు దుర్ఘటన, కర్ణాటకలో చోటు చేసుకున్న మరో వోల్వో బస్సు దగ్ధం ఘటనలపై జరిపిన దర్యాప్తు ఈ విషయాలను నిర్ధారిస్తోంది. ఈ రెండు ఘటనల్లో 52 మంది ప్రయాణికులు సజీవ దహనమవడం తెలిసిందే. పాలెం వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు డ్రైవర్ డబుల్ డ్యూటీలో ఉన్నాడని, ఫలితంగా తీవ్ర అలసటకు గురైనట్టు దర్యాప్తు నివేదిక వెల్లడించింది. అలాగే బస్సులో బాణసంచా కూడా ఉందని తెలిపింది. డబుల్ డ్యూటీ కారణంగా తీవ్ర అలసటకు లోనైన డ్రైవర్ ప్రమాదాన్ని నివారించలేకపోయాడని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈ బస్సులోపల బాణసంచా సైతం ఉన్నట్టు ఆయన తెలిపారు. అక్టోబర్ 30న పాలెం వద్ద జరిగిన ఈ వోల్వో ప్రమాదంలో 45 మంది సజీవ దహనమవడం విదితమే. జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి ఒక్కసారిగా నిప్పంటుకుంది. ఈ సందర్భంగా రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడి బస్సుకు మంటలంటుకుని ఉండవచ్చని, బస్సులోని బాణసంచా పేలిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు. నవంబర్ 14న జరిగిన మరో ఘటనలో బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న మరో వోల్వో బస్సు హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఓ బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించడం విదితమే. అయితే ఈ ప్రమాదం వెనుక గల కారణాలను నిర్ధారించుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా వోల్వో బస్సులు చెక్క ఫ్లోరింగ్‌తో కూడి ఉన్నాయని, తేలిగ్గా మంటలంటుకునే రకం సీట్లు ఉన్నాయని, వేగ పరిమితి కూడా చాలా ఎక్కువగా ఉందని నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్, ఆర్ అండ్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు చెందిన యాక్సిడెంట్ డేటా అనాలసిస్ సెంటర్ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. -
‘పాలెం’ దుర్ఘటనపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
ఏలూరు: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో మృతి చెందిన 45 మంది ప్రయాణికుల కుటుంబాలకు న్యాయం చేసి, దేశ రహదారులకు అనువుగా లేని వోల్వో బస్సులను రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన న్యాయ విద్యార్థి జి.అరిస్టాటిల్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, రవాణాశాఖ, ఆర్టీసీ, పోలీసు శాఖలు పనితీరు మెరుగుపరుచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవిద్యార్థి నవంబర్ 16న హెచ్ఆర్సీని కోరారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల సంఘం విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. -
ట్రావెల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి
* సీఎంకు కేంద్ర మంత్రి చిరంజీవి లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అరికట్టడానికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులు వరుసగా మంటల్లో చిక్కుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు బస్సుల్లో ప్రయాణించే వారిలో మరింత అభద్రతాభావాన్ని కల్గిస్తాయని తెలిపారు. మాఫియాలా మారిన ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఉక్కుపాదం మోపాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తన అభిమాన సంఘ నాయకుడొకరు, ఆయన సోదరి సజీవదహనం అయ్యారని లేఖలో ప్రస్తావించారు. బస్సు దుర్ఘటనలో అసువులు బాసిన వ్యక్తుల కుటుంబాల వారి వేదన, రోదన ఏ ఒక్కరూ తీర్చలేనిదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయగలడమే మన మందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపకపోవడం వల్లే ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే బస్సు యజమానులు నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలపై ప్రభుత్వ తీరుపైనా మండిపడ్డారు. ‘‘ప్రమాదాలు జరిగినప్పుడు రవాణ శాఖ అధికారులు సాధారణంగా చేసే దాడులు, బస్సులను స్వాధీన పరుచుకోవడం వంటి చర్యలు కొన్ని రోజుల వరకే పరిమితం కావడం.. ఆ తర్వాత మళ్లీ పాత కథ పునరావృతం కావడం సర్వసాధారణంగా మారింది’’ అని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను నియంత్రించాలని సీఎంను కోరారు. -
రెండు దుర్ఘటనలూ ఒకే తీరుగా...!
పాలెం, కర్ణాటక దుర్ఘటనలు రెండూ ఒకే రకంగా జరిగాయి. అతి వేగంతో దూసుకుపోతూ కల్వర్టు/డివైడర్‌కు ఢీకొనడం.. డీజిల్ ట్యాంకులు పగిలి మంటలు ఎగిసిపడడం.. క్షణాల్లో బస్సు అంతా వ్యాపించడం జరిగింది. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న వోల్వో బస్సులు కూడా ఇలా నిమిషాల్లో బుగ్గిగా మారటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘డివైడర్‌ను ఢీకొనగానే డీజిల్ ట్యాంకులు పగిలే పరిస్థితి మా బస్సుల్లో ఉండదు’ అని వోల్వో కంపెనీ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ.. అగ్నికీలలకు అవి అతీతం కావని నిపుణులు పేర్కొంటున్నారు. వోల్వో బస్సు బాడీని స్టీల్‌తో రూపొందిస్తున్నారు. ముందు, వెనుక ఆకర్షణీయంగా ఉండేందుకు ఫైబర్‌ను వినియోగిస్తున్నారు. డీజిల్ ట్యాంకులను అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ అంత సులభంగా పగలదనేది వోల్వో వాదన. కానీ అతి వేగంగా డివైడర్‌ను ఢీకొంటే కచ్చితంగా ట్యాంకు పగులుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు ప్రమాదాల్లో డీజిల్ ట్యాంకులు పగిలి అందులోని వందల లీటర్ల డీజిల్ రోడ్డుపై చిమ్మింది. ఈ రెండు బస్సులు ప్రమాద సమయంలో 100 కి.మీ.మించిన వేగంతో ప్రయాణించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉవ్వెత్తున మంటలెగియటానికి ఇదే కారణమైంది. కానీ.. మంటలంటుకున్నప్పుడు ప్రయాణికులు సులభంగా బయటపడే అవకాశం ఉన్నా... డ్రైవర్లు, ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం ప్రాణనష్టాన్ని భారీగా పెంచాయి. సాధారణంగా వోల్వో కంపెనీ.. తమ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడేలా వారు చూపాల్సిన చొరవపై కూడా అందులో పేర్కొంటుంది. కానీ ఈ రెండు ప్రమాదాల్లో డ్రైవర్లు ప్రయాణికులను కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. అత్యవసర మార్గాలెక్కడున్నాయో, కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తెలెక్కడున్నాయో ప్రయాణికులు గమనించే ఏర్పాట్లు చేయలేదు. కిటికీల వద్ద సుత్తెలు ఉండే చోట అవి కనపడకుండా కర్టెన్లు వేయటంతో వాటిపై ప్రయాణికులకు అవగాహనే లేకుండా పోయింది. కర్ణాటక బస్సు టాప్కు ప్రత్యేక ఎయిర్డోర్ ఉండటంతో ప్రయాణికులు దాని ద్వారా బయపడగలిగారు. కానీ పాలెం వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు అది లేకపోవటం, అద్దాలు పగలకపోవటంతో 45 మంది చనిపోయారు. స్పీడ్ లాక్ తెరుస్తోందెవరు..? వోల్వో కంపెనీ తమ బస్సులను రోడ్డుపైకి తెచ్చేప్పుడు గరిష్ట వేగం 100 కి.మీ. మించకుండా లాక్ చేస్తోంది. సాధారణ బస్సుల్లో ఇంజిన్‌లా కాకుండా ఇది సాఫ్ట్వేర్ ఆధారితంగా ఉంటుంది. అంటే వోల్వో బస్సులు గరిష్ట వేగం 100 కి.మీ. మించలేవన్నమాట. కానీ ఈ రెండు ప్రమాదాల్లో వాటి వేగం 120-130 కి.మీ. మధ్య ఉందని తెలుస్తోంది. అంటే ఆ బస్సుల వేగ నియంత్రణ లాక్ తెరిచారని స్పష్టమవుతోంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో లాక్ చేస్తున్నందున అది బస్సు డ్రైవర్లు, సాధారణ మెకానిక్‌ల వల్ల సాధ్యం కాదని రవాణా శాఖ పేర్కొంటోంది. వోల్వో వర్క్‌షాప్‌లలో పనిచేసే వారు ఈ పని (ట్యాంపరింగ్) చేస్తున్నారనేది వారి అనుమానం. చాలా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చటం ద్వారా ప్రయాణికుల దృష్టిని ఆకట్టుకునేందుకు ట్రావెల్ కంపెనీలు ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయని, దానికి వోల్వో మెకానిక్‌లే సాయం చేస్తున్నారన్న అనుమానం దిశగా రవాణ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. బ్రేక్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ సిస్టం, ఇంజిన్... ఇలా వోల్వోలో ఎనిమిది భాగాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటున్నాయి. అయినా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. వేగాన్ని చెక్ చేసే పరిజ్ఞానం ఎక్కడ..? బస్సు వేగం ఎంతుందో తెలుసుకోవటం అంత కష్టం కాదు. కానీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉన్న వోల్వో బస్సులు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే సాంకేతిక సామర్థ్యం మన రవాణా శాఖకు లేదు. ప్రమాదానికి గురైనా, మరే సందర్భంలోనైనా దాని వేగాన్ని తెలుసుకోవాలంటే వోల్వో కంపెనీ గ్యారేజీకి వెళ్లి అక్కడి పరిజ్ఞానం ఆధారంగా చూస్తేగానీ తెలియదని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వోల్వో ప్రమాదాలివీ.. * 2005లో గుజరాత్లో లారీని ఢీకొన్న వోల్వో బస్సుకు నిప్పంటుకుని 27 మంది మృతి చెందారు. * 2012లో తమిళనాడులో వోల్వో బస్సు లారీని ఢీకొనటంతో మంటలంటుకున్నాయి. 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. * నల్గొండ జిల్లా చింతలపూడి వద్ద వేగంగా వెళ్తున్న ప్రైవేటు ఏసీ హైటెక్ బస్సు (వోల్వో కాదు) టిప్పర్‌ను ఢీకొన్ని మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ సహా ఓ మహిళ మృతి చెందారు. * మహబూబ్న్నగర్ జిల్లా పాలెం శివారులో గత నెల వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 45 మంది అగ్నికి ఆహుతయ్యారు. * బుధవారం తెల్లవారుజామున కర్ణాటకలో వోల్వో బస్సు డివైడర్‌ను ఢీకొని అగ్నికీలల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం. మల్టీ యాక్సిల్ బస్సులపై శిక్షణ ఉందా..? వోల్వోలో గతంలో 11.7 మీటర్ల పొడవు ఉండే సింగిల్ యాక్సల్ బి7ఆర్ మోడల్ బస్సులు వాడేవారు. వాటి స్థానంలో ప్రస్తుతం 13.7, 15 మీటర్ల పొడవు ఉండే బీ9ఆర్, బీ11ఆర్ మోడళ్ల మల్టీ యాక్సల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ముందు చక్రాలకే స్టీరింగ్‌తో అనుసంధానం ఉంటుంది. కానీ మల్టీ యాక్సల్లో వెనక చక్రాల వ్యవస్థకు కూడా స్టీరింగ్‌తో అనుసంధానం ఉండటం వల్ల తక్కువ స్థలంలో కూడా బస్సులు మలుపు తిరిగేందుకు వీలుంటుంది. పైగా ఈ బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 49 వరకు ఉండటం, కుదుపులు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ట్రావెల్స్ యజమానులు ఈ బస్సులవైపే దృష్టిపెడుతున్నారు. వీటిని నడపటంలో డ్రైవర్లకు మరింత శిక్షణ కావాలి. కానీ తొలుత వోల్వో కంపెనీ ఇచ్చే శిక్షణ మినహా వారికి ఎలాంటి పునఃశ్చరణ ఉండటం లేదు. పైగా వోల్వో కంపెనీ ఇచ్చే శిక్షణ మాడ్యూల్ ఏంటో కూడా ఇప్పటి వరకు రవాణాశాఖ పరిశీలించలేకపోయింది. ఏమాత్రం డీజిల్ లీకైనా అంతే.. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లాల్లో ఆర్టీసీ గరుడ (వోల్వో) బస్సులో నిప్పంటుకోవటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలింది. వోల్వో కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్రికల్ సిస్టంను చిన్నాభిన్నం చేసి ఆర్టీసీ సిబ్బంది బస్సులో ఏర్పాటు చేసిన స్విచ్‌బోర్డు సిస్టమే దీనికి కారణమని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. లగేజీ బాక్సులో ప్రత్యేకంగా స్విచ్‌బోర్డు ఏర్పాటు చేసి అక్కడ ఓ బల్బ్‌ను అమర్చారు. ఇది వోల్వో నిబంధనలకు విరుద్ధం. ఈ స్విచ్‌బోర్డు ద్వారా నిప్పు రవ్వలు వెలువడి అక్కడి సామగ్రికి మంట అంటుకుంది. ఇక వోల్వో బస్సుల ఎగ్జాస్ట్ సిస్టం వద్ద 400- 600 డిగ్రీల వరకు వేడి ఉత్పత్తవుతుంది. దీనికి చేరువలోనే డీజిల్ ట్యాంకు ఉంటుంది. అక్కడ ఆయిల్ ఏమాత్రం లీక్ అయినా నిప్పు పుట్టే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ బస్సును పరిశీలించకుంటే పెను ప్రమాదానికి అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. డ్రైవర్లకు వీటిపై అవగాహన ఉందా? వోల్వో బస్సు యురోపియన్ డిజైన్‌తో రూపొందినా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాల్లో ముందున్న బస్సుల తయారీ కంపెనీ ఇదే. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధర తగ్గించే క్రమంలో ఈ కంపెనీ కొన్ని అత్యాధునిక వసతులు తగ్గించి తయారు చేసి అందిస్తోంది. అయినప్పటికీ సాంకేతికంగా లోపాలు తలెత్తి ప్రమాదాలు చోటుచేసుకోకుండా డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు తనంతట తనుగా సూచనలిచ్చే వ్యవస్థ వీటిల్లో ఉంటుంది. ఇందుకు డ్రైవర్ ముందు ప్రత్యేక ప్యానెల్‌పై మూడు రకాల ప్రధాన సూచనలిందించే ఏర్పాటు ఉంటుంది. అవి 1.ఇన్ఫర్మేషనరీ: బస్సులో ఇంధనం ఎంత ఉందో చూపుతూ... ఒకవేళ అయిపోయే పరిస్థితి వస్తే వెంటనే ఇంధనం నింపుకోవాలని తెలుపుతుంది. 2. కాషనరీ: సిస్టంలో ప్రధానమైన సాంకేతిక లోపం తలెత్తే పరిస్థితి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని డిస్ప్లే బోర్డుపై సూచిస్తుంది. పూర్తిగా పాడవటానికి ముందు సరిదిద్దేందుకు ఇది దోహదం చేస్తుంది. 3.స్టాప్: ఉన్నట్టుండి పెద్ద సమస్య తలెత్తితే డ్రైవర్ గుర్తించటానికి ముందే తనంతట తానుగా వెంటనే బస్సును నిలిపివేయమని పేర్కొంటూ ‘స్టాప్’ అని పేర్కొంటుంది. ఈ పరిస్థితిలో బస్సు ముందుకు కదిలితే ప్రమాదం జరుగుతుంది. డ్రైవర్ దాన్ని గుర్తించేందుకు వీలుగా బస్సంతా వినిపించేలా ‘బీప్’ శబ్దం వస్తుంది. బోర్డుపై అది ఏం సూచిస్తోందో తెలియాలంటే డ్రైవర్‌కు కచ్చితంగా ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. ఈ విషయంలో చాలామంది డ్రైవర్లకు అవగాహన ఉండటం లేదు. బీప్ శబ్దం వచ్చినా బస్సులో టీవీ, సౌండ్ సిస్టం వల్ల అది వినిపించని దుస్థితి నెలకొంది.