రెండు దుర్ఘటనలూ ఒకే తీరుగా...! | Palem, kunimallahalli bus mishaps occurs same way | Sakshi
Sakshi News home page

రెండు దుర్ఘటనలూ ఒకే తీరుగా...!

Published Fri, Nov 15 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

Palem, kunimallahalli bus mishaps occurs same way

పాలెం, కర్ణాటక దుర్ఘటనలు రెండూ ఒకే రకంగా జరిగాయి. అతి వేగంతో దూసుకుపోతూ కల్వర్టు/డివైడర్‌కు ఢీకొనడం.. డీజిల్ ట్యాంకులు పగిలి మంటలు ఎగిసిపడడం.. క్షణాల్లో బస్సు అంతా వ్యాపించడం జరిగింది. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న వోల్వో బస్సులు కూడా ఇలా నిమిషాల్లో బుగ్గిగా మారటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘డివైడర్‌ను ఢీకొనగానే డీజిల్ ట్యాంకులు పగిలే పరిస్థితి మా బస్సుల్లో ఉండదు’ అని వోల్వో కంపెనీ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ.. అగ్నికీలలకు అవి అతీతం కావని నిపుణులు పేర్కొంటున్నారు. వోల్వో బస్సు బాడీని స్టీల్‌తో రూపొందిస్తున్నారు. ముందు, వెనుక ఆకర్షణీయంగా ఉండేందుకు ఫైబర్‌ను వినియోగిస్తున్నారు. డీజిల్ ట్యాంకులను అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్‌ను వాడుతున్నారు.

ఈ ప్లాస్టిక్ అంత సులభంగా పగలదనేది వోల్వో వాదన. కానీ అతి వేగంగా డివైడర్‌ను ఢీకొంటే కచ్చితంగా ట్యాంకు పగులుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు ప్రమాదాల్లో డీజిల్ ట్యాంకులు పగిలి అందులోని వందల లీటర్ల డీజిల్ రోడ్డుపై చిమ్మింది. ఈ రెండు బస్సులు ప్రమాద సమయంలో 100 కి.మీ.మించిన వేగంతో ప్రయాణించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉవ్వెత్తున మంటలెగియటానికి ఇదే కారణమైంది.  కానీ.. మంటలంటుకున్నప్పుడు ప్రయాణికులు సులభంగా బయటపడే అవకాశం ఉన్నా... డ్రైవర్లు, ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం ప్రాణనష్టాన్ని భారీగా పెంచాయి.

సాధారణంగా వోల్వో కంపెనీ.. తమ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడేలా వారు చూపాల్సిన చొరవపై కూడా అందులో పేర్కొంటుంది. కానీ ఈ రెండు ప్రమాదాల్లో డ్రైవర్లు ప్రయాణికులను కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. అత్యవసర మార్గాలెక్కడున్నాయో, కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తెలెక్కడున్నాయో ప్రయాణికులు గమనించే ఏర్పాట్లు చేయలేదు. కిటికీల వద్ద సుత్తెలు ఉండే చోట అవి కనపడకుండా కర్టెన్లు వేయటంతో వాటిపై ప్రయాణికులకు అవగాహనే లేకుండా పోయింది. కర్ణాటక బస్సు టాప్‌కు ప్రత్యేక ఎయిర్‌డోర్ ఉండటంతో ప్రయాణికులు దాని ద్వారా బయపడగలిగారు. కానీ పాలెం వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు అది లేకపోవటం, అద్దాలు పగలకపోవటంతో 45 మంది చనిపోయారు.

స్పీడ్ లాక్ తెరుస్తోందెవరు..?
వోల్వో కంపెనీ తమ బస్సులను రోడ్డుపైకి తెచ్చేప్పుడు గరిష్ట వేగం 100 కి.మీ. మించకుండా లాక్ చేస్తోంది. సాధారణ బస్సుల్లో ఇంజిన్‌లా కాకుండా ఇది సాఫ్ట్‌వేర్ ఆధారితంగా ఉంటుంది. అంటే వోల్వో బస్సులు గరిష్ట వేగం 100 కి.మీ. మించలేవన్నమాట. కానీ ఈ రెండు ప్రమాదాల్లో వాటి వేగం 120-130 కి.మీ. మధ్య ఉందని తెలుస్తోంది. అంటే ఆ బస్సుల వేగ నియంత్రణ లాక్ తెరిచారని స్పష్టమవుతోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో లాక్ చేస్తున్నందున అది బస్సు డ్రైవర్లు, సాధారణ మెకానిక్‌ల వల్ల సాధ్యం కాదని రవాణా శాఖ పేర్కొంటోంది.

వోల్వో వర్క్‌షాప్‌లలో పనిచేసే వారు ఈ పని (ట్యాంపరింగ్) చేస్తున్నారనేది వారి అనుమానం. చాలా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చటం ద్వారా ప్రయాణికుల దృష్టిని ఆకట్టుకునేందుకు ట్రావెల్ కంపెనీలు ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయని, దానికి వోల్వో మెకానిక్‌లే సాయం చేస్తున్నారన్న అనుమానం దిశగా రవాణ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. బ్రేక్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ సిస్టం, ఇంజిన్... ఇలా వోల్వోలో ఎనిమిది భాగాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటున్నాయి. అయినా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం.
 
వేగాన్ని చెక్ చేసే పరిజ్ఞానం ఎక్కడ..?
బస్సు వేగం ఎంతుందో తెలుసుకోవటం అంత కష్టం కాదు. కానీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉన్న వోల్వో బస్సులు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే సాంకేతిక సామర్థ్యం మన రవాణా శాఖకు లేదు. ప్రమాదానికి గురైనా, మరే సందర్భంలోనైనా దాని వేగాన్ని తెలుసుకోవాలంటే వోల్వో కంపెనీ గ్యారేజీకి వెళ్లి అక్కడి పరిజ్ఞానం ఆధారంగా చూస్తేగానీ తెలియదని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

 వోల్వో ప్రమాదాలివీ..
* 2005లో గుజరాత్‌లో లారీని ఢీకొన్న వోల్వో బస్సుకు నిప్పంటుకుని 27 మంది మృతి చెందారు.
* 2012లో తమిళనాడులో వోల్వో బస్సు లారీని ఢీకొనటంతో మంటలంటుకున్నాయి. 22 మంది ప్రయాణికులు మృతి చెందారు.
* నల్గొండ జిల్లా చింతలపూడి వద్ద వేగంగా వెళ్తున్న ప్రైవేటు ఏసీ హైటెక్ బస్సు (వోల్వో కాదు) టిప్పర్‌ను ఢీకొన్ని మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ సహా ఓ మహిళ మృతి చెందారు.
* మహబూబ్‌న్‌నగర్ జిల్లా పాలెం శివారులో గత నెల వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 45 మంది అగ్నికి ఆహుతయ్యారు.
* బుధవారం తెల్లవారుజామున కర్ణాటకలో వోల్వో బస్సు డివైడర్‌ను ఢీకొని అగ్నికీలల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం.

మల్టీ యాక్సిల్ బస్సులపై శిక్షణ ఉందా..?
వోల్వోలో గతంలో 11.7 మీటర్ల పొడవు ఉండే సింగిల్ యాక్సల్ బి7ఆర్ మోడల్ బస్సులు వాడేవారు. వాటి స్థానంలో ప్రస్తుతం 13.7, 15 మీటర్ల పొడవు ఉండే బీ9ఆర్, బీ11ఆర్ మోడళ్ల మల్టీ యాక్సల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ముందు చక్రాలకే స్టీరింగ్‌తో అనుసంధానం ఉంటుంది. కానీ మల్టీ యాక్సల్‌లో వెనక చక్రాల వ్యవస్థకు కూడా స్టీరింగ్‌తో అనుసంధానం ఉండటం వల్ల తక్కువ స్థలంలో కూడా బస్సులు మలుపు తిరిగేందుకు వీలుంటుంది.

పైగా ఈ బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 49 వరకు ఉండటం, కుదుపులు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ట్రావెల్స్ యజమానులు ఈ బస్సులవైపే దృష్టిపెడుతున్నారు. వీటిని నడపటంలో డ్రైవర్లకు మరింత శిక్షణ కావాలి. కానీ తొలుత వోల్వో కంపెనీ ఇచ్చే శిక్షణ మినహా వారికి ఎలాంటి పునఃశ్చరణ ఉండటం లేదు. పైగా వోల్వో కంపెనీ ఇచ్చే శిక్షణ మాడ్యూల్ ఏంటో కూడా ఇప్పటి వరకు రవాణాశాఖ పరిశీలించలేకపోయింది.

ఏమాత్రం డీజిల్ లీకైనా అంతే..
మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లాల్లో ఆర్టీసీ గరుడ (వోల్వో) బస్సులో నిప్పంటుకోవటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలింది. వోల్వో కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్రికల్ సిస్టంను చిన్నాభిన్నం చేసి ఆర్టీసీ సిబ్బంది బస్సులో ఏర్పాటు చేసిన స్విచ్‌బోర్డు సిస్టమే దీనికి కారణమని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. లగేజీ బాక్సులో ప్రత్యేకంగా స్విచ్‌బోర్డు ఏర్పాటు చేసి అక్కడ ఓ బల్బ్‌ను అమర్చారు.

ఇది వోల్వో నిబంధనలకు విరుద్ధం. ఈ స్విచ్‌బోర్డు ద్వారా నిప్పు రవ్వలు వెలువడి అక్కడి సామగ్రికి మంట అంటుకుంది. ఇక వోల్వో బస్సుల ఎగ్జాస్ట్ సిస్టం వద్ద 400- 600 డిగ్రీల వరకు వేడి ఉత్పత్తవుతుంది. దీనికి చేరువలోనే డీజిల్ ట్యాంకు ఉంటుంది. అక్కడ ఆయిల్ ఏమాత్రం లీక్ అయినా నిప్పు పుట్టే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ బస్సును పరిశీలించకుంటే పెను ప్రమాదానికి అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
 
డ్రైవర్లకు వీటిపై అవగాహన ఉందా?
వోల్వో బస్సు యురోపియన్ డిజైన్‌తో రూపొందినా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాల్లో ముందున్న బస్సుల తయారీ కంపెనీ ఇదే. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధర తగ్గించే క్రమంలో ఈ కంపెనీ కొన్ని అత్యాధునిక వసతులు తగ్గించి తయారు చేసి అందిస్తోంది. అయినప్పటికీ సాంకేతికంగా లోపాలు తలెత్తి ప్రమాదాలు చోటుచేసుకోకుండా డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు తనంతట తనుగా సూచనలిచ్చే వ్యవస్థ వీటిల్లో ఉంటుంది. ఇందుకు డ్రైవర్ ముందు ప్రత్యేక ప్యానెల్‌పై మూడు రకాల ప్రధాన సూచనలిందించే ఏర్పాటు ఉంటుంది.

అవి 1.ఇన్ఫర్మేషనరీ: బస్సులో ఇంధనం ఎంత ఉందో చూపుతూ... ఒకవేళ అయిపోయే పరిస్థితి వస్తే వెంటనే ఇంధనం నింపుకోవాలని తెలుపుతుంది. 2. కాషనరీ: సిస్టంలో ప్రధానమైన సాంకేతిక లోపం తలెత్తే పరిస్థితి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని డిస్‌ప్లే బోర్డుపై సూచిస్తుంది. పూర్తిగా పాడవటానికి ముందు సరిదిద్దేందుకు ఇది దోహదం చేస్తుంది. 3.స్టాప్: ఉన్నట్టుండి పెద్ద సమస్య తలెత్తితే డ్రైవర్ గుర్తించటానికి ముందే తనంతట తానుగా వెంటనే బస్సును నిలిపివేయమని పేర్కొంటూ ‘స్టాప్’ అని పేర్కొంటుంది.
 
ఈ పరిస్థితిలో బస్సు ముందుకు కదిలితే ప్రమాదం జరుగుతుంది. డ్రైవర్ దాన్ని గుర్తించేందుకు వీలుగా బస్సంతా వినిపించేలా ‘బీప్’ శబ్దం వస్తుంది. బోర్డుపై అది ఏం సూచిస్తోందో తెలియాలంటే డ్రైవర్‌కు కచ్చితంగా ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. ఈ విషయంలో చాలామంది డ్రైవర్లకు అవగాహన ఉండటం లేదు. బీప్ శబ్దం వచ్చినా బస్సులో టీవీ, సౌండ్ సిస్టం వల్ల అది వినిపించని దుస్థితి నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement