వోల్వో బస్సు ప్రమాదానికి కారణాలివేనని తేల్చిన దర్యాప్తు నివేదిక
న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదానికి డ్రైవర్ డబుల్ డ్యూటీ చేస్తుండడమే ప్రధాన కారణమా? బస్సులోపల బాణసంచా ఉందా?
పాలెం బస్సు దుర్ఘటన, కర్ణాటకలో చోటు చేసుకున్న మరో వోల్వో బస్సు దగ్ధం ఘటనలపై జరిపిన దర్యాప్తు ఈ విషయాలను నిర్ధారిస్తోంది. ఈ రెండు ఘటనల్లో 52 మంది ప్రయాణికులు సజీవ దహనమవడం తెలిసిందే. పాలెం వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు డ్రైవర్ డబుల్ డ్యూటీలో ఉన్నాడని, ఫలితంగా తీవ్ర అలసటకు గురైనట్టు దర్యాప్తు నివేదిక వెల్లడించింది. అలాగే బస్సులో బాణసంచా కూడా ఉందని తెలిపింది. డబుల్ డ్యూటీ కారణంగా తీవ్ర అలసటకు లోనైన డ్రైవర్ ప్రమాదాన్ని నివారించలేకపోయాడని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈ బస్సులోపల బాణసంచా సైతం ఉన్నట్టు ఆయన తెలిపారు.
అక్టోబర్ 30న పాలెం వద్ద జరిగిన ఈ వోల్వో ప్రమాదంలో 45 మంది సజీవ దహనమవడం విదితమే. జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి ఒక్కసారిగా నిప్పంటుకుంది.
ఈ సందర్భంగా రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడి బస్సుకు మంటలంటుకుని ఉండవచ్చని, బస్సులోని బాణసంచా పేలిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు. నవంబర్ 14న జరిగిన మరో ఘటనలో బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న మరో వోల్వో బస్సు హావేరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కునిమల్లహళ్లి వద్ద ఓ బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించడం విదితమే. అయితే ఈ ప్రమాదం వెనుక గల కారణాలను నిర్ధారించుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా వోల్వో బస్సులు చెక్క ఫ్లోరింగ్‌తో కూడి ఉన్నాయని, తేలిగ్గా మంటలంటుకునే రకం సీట్లు ఉన్నాయని, వేగ పరిమితి కూడా చాలా ఎక్కువగా ఉందని నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్, ఆర్ అండ్ డి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు చెందిన యాక్సిడెంట్ డేటా అనాలసిస్ సెంటర్ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.