నేనే ఏఎస్‌జీ.. కాదు నేనే!
హైకోర్టులో అశోక్‌గౌడ్, విష్ణువర్దన్‌రెడ్డి వాదులాట
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) పోస్టు విషయం లో హైకోర్టులో న్యాయవాదులు పొన్నం అశోక్‌గౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి ల మధ్య మొదలైన కుమ్ములాట ఇప్పుడు కోర్టు విచారణ సమయం లో న్యాయమూర్తుల ముందు వాదులాట వరకు వచ్చింది. కొత్త ఏఎస్‌జీగా తాను నియమితులయ్యానని, తనకు ఆ బాధ్యతలు అప్పగించాలని విష్ణువర్దన్‌రెడ్డి వాదిస్తుంటే.. కాదు తనను తొలగిస్తున్నట్లు ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ తనకు అందలేదు కాబట్టి తానే ఏఎస్‌జీగా కొనసాగుతానని అశోక్‌గౌడ్ చెబుతున్నారు.
చివరకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైనా కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు వారు ఇరువురూ లేచి నేను ఏఎస్‌జీనంటే.. కాదు నేనే ఏఎస్‌జీనంటూ వాదించుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించడం ఏఎస్‌జీ బాధ్యత. మరికొందరు న్యాయవాదులు ఆయనకు సహాయకులుగా ఉంటారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోదరుడైన అశోక్‌గౌడ్ 2009లో ఏఎస్‌జీగా నియమితులయ్యారు. ఆయన ఆ పోస్టులో కొనసాగుతుండగానే విష్ణువర్దన్‌రెడ్డి 2012, సెప్టెంబర్‌లో ఏఎస్‌జీగా రెండేళ్ల కాల పరిమితితో కేంద్రం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అశోక్‌గౌడ్... ఏఎస్‌జీగా పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.
హైకోర్టు విచారించే రోజువారీ కేసుల జాబితా (కాజ్ లిస్ట్)లో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యేందుకు అశోక్‌గౌడ్ పేరే మొన్నటి వరకూ ప్రచురితమయ్యేది. అయితే గత నెలలో అశోక్‌గౌడ్‌ను ఏఎస్‌జీ పదవి నుంచి రాష్ట్రపతి తొలగించారని, విష్ణువర్థన్‌రెడ్డే ఆ పదవిలో కొనసాగుతారని, కేసులన్నింటినీ ఆయనకే అప్పగించాలని అశోక్‌ను ఆదేశిస్తూ కేంద్ర న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ ఆర్.ఎస్.శుక్లా పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అశోక్ మాత్రం ఆ ఉత్తర్వులు తనకు అందలేదంటూ ఏఎస్‌జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విష్ణువర్థన్‌రెడ్డి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కలసి... శుక్లా ఉత్తర్వులను చూపించి, తానే ఏఎస్‌జీనని, కాజ్‌లిస్ట్‌లో తన పేరే ముద్రించాలని కోరారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆ మార్పు చేశారు. మరోవైపు వారిద్దరూ ఒకరిపై ఒకరు న్యాయమూర్తులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దాఖలైన కేసులు గురువారం వివిధ కోర్టుల్లో విచారణకొచ్చిన సమయంలో ఏఎస్‌జీ పోస్టు విషయమై అటు విష్ణువర్థన్‌రెడ్డి, ఇటు అశోక్‌గౌడ్ తరఫున ఆయన సహాయక న్యాయవాదులు వాదులాడుకున్నారు.