జిల్లా టీడీపీ దాదాపు ఖాళీ అయ్యిందా..ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. గతేడాది అసెంబ్లీ ..లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ చికిత్సకు అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో జనరంజకంగా ముఖ్యమంత్రి వైెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో సర్కారు దూసుకెళుతుండటంతో ఆ పార్టీ నాయకులు టీడీపీలో కొనసాగడానికి నేతలు విముఖంగా ఉన్నారు. రోజురోజుకూ ఇలాంటి నాయకులు పెరుగుతున్నారు. పులివెందులలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీ పూర్తిగా చతికిలపడిపోయింది.
సాక్షి, కడప : టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్వీ సతీష్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం పులివెందులలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పార్టీని వీడటం టీడీపీకి గట్టి షాక్‌గా భావించవచ్చు. ఆయన రాజీనామాతో అరకొరగా ఉన్న అక్కడి క్యాడర్‌పార్టీకి పూర్తిగా దూరమైనట్లే. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి స్థానిక ఎన్నికల ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సతీష్‌రెడ్డి రాజీనామాతోపాటు మరికొందరు అదేబాటలో ఉన్నారనే సమాచారం ఆ పార్టీ శిబిరం పూర్తిగా డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికల్లో కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పరిశీలకుల భావన. మరికొందరు నేతలు సైతం పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కొందరు ఇప్పటికే బీజేపీ పంచన..
వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఛీకొట్టడంతో జిల్లాలోని పది అంసెబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘోర పరాజయ పాలైంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో జిల్లా టీడీపీ నేతలు కలవరపడ్డారు. ఆ పార్టీ పాత కాపు సీఎం రమేష్ భవిష్యత్తు లేదని భావించి టీడీపీని వీడి షెల్టర్ జోన్ బీజేపీలో చేరారు. ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదేబాట పట్టారు. అరకొరగా ఉన్న నేతలు మౌనముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. చూస్తుండగానే స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు మొదలైన మరుసటి రోజే ఆ పార్టీ కీలకనేత ఎస్వీ సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మరికొందరు నేతలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రొద్దుటూరులో చీకట్లు
ప్రొద్దుటూరుకు చెందిన ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను స్థానిక ఎన్నికలకు దూరమని ప్రకటించి టీడీపీని వీడనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైతం తీవ్ర అసంతృప్తిగా లోనైనట్లు తెలుస్తుంది. వరదరాజుల రెడ్డి అనుచరవర్గంఈ ఎన్నికల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడినా మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముక్తియార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడి వర్గం ఆ పార్టీపై గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే అంసతృప్తితో ఉంది. ఆయన తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు తన అనుచరులతో కలిసి టీడీపీని వీడనున్నారన్న ప్రచారం జరుగుతోంది. బద్వేలులో మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అరకొరగా మిగిలి ఉన్న టీడీపీ నేతలు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవడం లేదు. కొందరు రెండో శ్రేణి నేతలు సైతం ఈ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం, జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతున్నారు. టీడీపీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో అధికార పార్టీ విజయం ఏకపక్షమేనని పరిశీలకుల అంచనా.వరుసగా ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడతుండటంతో టీడీపీ జిల్లాలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment