లక్షలు వదిలి లక్ష్యం వైపు కదిలి
మారుతున్న యువతరం ఆలోచనలు
ఉన్నత ఉద్యోగాలు వదిలి సొంతంగా ఎదిగి
విజయం వైపు లక్ష్మి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్
ఒక ఆలోచన.. ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. అదే ఆలోచనకు దృఢ సంకల్పం తోడైతే విజయం సాధ్యమవుతుంది. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా ఒక్క అగ్గిపుల్ల వెలుతురును దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే విజయాన్ని ఆపలేరు. ఇదే సూత్రాన్ని పఠిస్తోంది ప్రస్తుత యువత. ఉద్యోగం చేస్తే లక్షల జీతం వస్తుంది. కానీ అది వారి లక్ష్యం కాదు. తను వ్యక్తిగతంగా ఎదుగుతూ.. పది మందికి ఉపాధి కల్పించాలి. వారినీ లక్ష్యసాధన వైపు నడిపించాలి. అలాంటి కొంత మంది యువకుల పరిచయమే ఈ కథనం. - సిటీ డెస్క్
బీపీసీఎల్ నుంచి బోధన వైపు..
‘శిఖరాగ్రాన ఉన్న వాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా నీవు నిల్చొన్న చోట నుంచే మజిలీ మొదలు పెడతాడు. సంకల్పం ఉంటే సగం విజయం.’ అంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి శ్రీనివాసరెడ్డి చిలకల. తను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. పదోతరగ తిలో 530 మార్కులు, ఇంటర్‌లో స్టేట్ మూడో ర్యాంక్(ఎంఈసీ), సీఏ(ఛార్టర్డ్ అకౌంటెంట్) ఫైనల్‌లో జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, సీఎంఏ ఫైనల్‌లో జాతీయ స్థాయిలో 17వ ర్యాంక్, సీఏ- ఐపీసీసీలో 29, సీఏ- సీపీటీలో 8వ ర్యాంక్. ఇదీ స్థూలంగా శ్రీనివాసరెడ్డి ఎడ్యుకేషన్ గ్రాఫ్. భారత ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్‌లో ఉద్యోగం. ఏడాదికి రూ.14.5 లక్షల జీతం. విలాసవంతమైన జీవితం. ఇవేమి ఆయనకు సంతృప్తి నివ్వలేదు. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. బోధన రంగంలో రాణించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకోసం విశాఖపట్నంలో ఎస్‌అండ్‌ఎస్ సీఏ అకాడమీని మిత్రుడు శ్రీకాంత్ చౌదరితో కలిసి ప్రారంభించాడు. ఇంకా
ఆయన ఏం అంటున్నారంటే...
‘సీఏ పాసవడమంటే మాటలా.. ఓ భగీరథ ప్రయత్నం.. అందరికీ సాధ్యం కాదు. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్‌లో ఎంఈసీ ఎంచుకున్నప్పుడు నేను విన్న మాటలు. అంత కష్టమా అనుకున్నా. కానీ ఎందులోనైనా కష్టపడనిదే ముందుకు సాగలేం. లక్ష్యం దిశగా సాగితే అదే బ్రహ్మ విద్యేమీ కాదని అనిపించింది. ర్యాంక్ గురించి ఆలోచించకుండా చదివాను. ఓ వైపు ఆర్టికల్‌షిప్ చేస్తూ ఖాళీ సమయాన్ని పక్కా ప్రణాళికతో సద్వినియోగం చేసుకున్నాను. ఆ ఏడాదిలో దేశం మొత్తం మీద 42 వేలమంది పరీక్ష రాస్తే.. అందులో 7 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించగలిగాను. బీపీసీఎల్ ముంబైలో జాబ్.. నెలకు రూ.14.5 లక్షల ప్యాకేజీ. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది చాలా పెద్ద మొత్తం. 18 నెలలు పనిచేశా. కానీ నా లక్ష్యం వేరు. బోధన రంగంలో రాణించాలి. ఉద్యోగం చేస్తున్న సమయంలో సెలవు రోజుల్లో తిరుపతిలో సీఏ తరగతులు నిర్వహించాను. పూర్తి స్థాయిలో అకాడమీ నెలకొల్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేశాను. విశాఖపట్నంలో సీఏ అకాడమీ స్థాపించాను. అకాడమీని నిలబెట్టాలి. విద్యను విస్తరింపజేయాలి. ఇప్పటికే సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. జీవితంలో స్థిరపడ్డాక ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు ఉచిత విద్యనందించాలి. సొంత ఊరికి సేవ చేయాలి. ఒక లక్ష్యాన్ని ప్రేమించి, పట్టుదలతో సాధన చేస్తే ఫలితం మన చేతుల్లోనే ఉంటుంది.’
21 ఏళ్లకే సీఏ
‘పోరాడేటప్పుడు తిరిగి పోరాడే అవకాశం రాదేమో అన్నట్టుగా పోరాడు. ఎందుకంటే రేపు ఆ అవకాశం రాకపోవచ్చు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.’ అలానే పోరాడి 21 ఏళ్లకే సీఏ చేశాడు శ్రీకాంత్ చౌదరి. ఒంగోలుకు చెందిన ఆయన మట్టిలో మాణిక్యంలా వెలుగులోకి వచ్చాడు. పదో తరగతి, ఇంటర్, సీఏ అన్నింటిలో మొదటి ప్రయత్నంలో విజయం సాధించాడు. సీఏలో కోచింగ్ తీసుకోకుండా సొంత నోట్స్ రాసుకొని 21 ఏళ్లకే సీఏలో ఉత్తీర్ణత సాధించాడు. నోవర్‌టీస్, మైలాన్ తదితర మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేశాడు. ఆడిట్ అసైన్స్‌మెంట్స్ మీద పది దేశాల్లో పర్యటించాడు. లక్షల్లో జీతం. కానీ ఆయన లక్ష్యం అది కాదు. బోధన అంటే ఇష్టం. అందుకే బోధన రంగంలోకి దూకాడు. మిత్రుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎస్ అండ్ ఎస్ అకాడమీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా
ఆయన ఏం అంటున్నారంటే...
‘అపనమ్మకంతో పనిని మొదలు పెట్టకు. ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. సీఏ అంటే మొదట్లో చాలా మంది భయపెట్టారు. మనం చేసే పనిని ప్రేమిస్తే.. అందులో కష్టపడితే చాలా సులువు. సీఏ సంబంధించి చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. కానీ కొత్తగా పెడితే మార్కెట్‌లో నిలబడతమా అనే ఓ సందేహం ఉంది. కానీ నాణ్యమైన విద్యనందించాలి. పేద విద్యార్థులకు అండగా నిలబడాలి. వ్యక్తిగతంగా మేము అభివృద్ధి చెందాలి. పేద విద్యార్థులకు రాయితీతో కూడిన విద్యనందించాలి. ఈ కాన్సెఫ్ట్‌తోనే అకాడమీని స్థాపించాం.