వామపక్షాల లేఖల యుద్ధం
హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. లేఖల యుద్ధం ముదురుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణల మధ్య లేఖ యుద్దం సాగుతోంది. రాఘవులు నిన్న రాసిన లేఖకు నారాయణ ఈరోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
నారాయణ తనతో పాటు తన పార్టీ పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని రాఘవులు రాసిన లేఖలో దుయ్యబట్టారు. నారాయణ తన స్థాయి మరిచి విమర్శలకు దిగి అసత్యాలు, దిగజారుడు మాటలు మాట్లాడవద్దని హితవుపలికారు. వైఎస్సార్‌సీపీతో సర్దుబాట్లపై చర్చలకు తానే ప్రత్యక్ష సాక్షినన్నట్లు మాట్లాడిన నారాయణ నిజాయితీ ఉన్న కమ్యూనిస్టయితే వాటిని నిరూపించాలని రాఘవులు సవాల్ చేశారు.
వైఎస్సార్‌సీపీతో సీపీఎం రహస్యంగా సీట్ల ఒప్పందం కుదుర్చుకుంటోందని నారాయణ విమర్శించిన నేపథ్యంలో రాఘవులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేపదే లేఖలు రాసినా సీపీఎం పట్ల నారాయణ దురుసుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వామపక్షాల మధ్య ఉండాల్సిన స్థాయిలో ఈ విమర్శలు ఉండడం లేదని, వ్యక్తిగత దూషణలకు దిగి అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వల్ల నారాయణకు, ఆయన పార్టీకే తీరని నష్టమని అన్నారు.రాష్ట్రంలో అనిశ్చితి తేలేవరకు ఎన్నికల గురించి చర్చించబోమని ఇదివరకే చెప్పామని గుర్తు చేశారు. ఒంగోలులో గురువారం నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు, నిరాధార, కల్పిత ఊహాగానాలు చేయవద్దని సలహా ఇచ్చారు.
దీంతో రాఘవులు లేఖకు ఈరోజు నారాయణ కూడా లేఖ ద్వారానే కటువుగా సమాధానామిచ్చారు. తాను ఒంగోలులో చేసిన ఆరోపణలకు రాఘవులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారని పేర్కొన్నారు. బహిరంగంగా చేసిన ఆరోపణను జీర్ణించుకోలేకపోయారని నారాయణ లేఖలో విమర్శించారు. నిజానిజాలు భవిష్యత్తులో తేలుతాయన్నారు.