ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: ప్రజాసమస్యలను పరిష్కరించాలన్న డిమాండుతో ఈ నెల 10న హైదరాబాద్‌లో నాలుగు వామపక్ష పార్టీలు (సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్) ఉమ్మడిగా నిర్వహించనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలను భారీగా సమీకరించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు చెప్పారు. వారు బుధవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోతినేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సరళీకరణ విధానాలతో ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా ఈ సభ తలపెట్టినట్టు చెప్పారు.
యూపీఏ-2 ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద-మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. పారి శ్రామిక రంగంలో మందగమనం ఏర్పడిందని, పరిశ్రమలు మూతపడడంతో అందులోని కార్మికులు వీధిన పడ్డారని చెప్పారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను విచ్చలవిడిగా అనుమతిస్తోందని విమర్శించారు. ఇవే విధానాలను బీజేపీ తన పాలనలో కూడా అవలంబించిందన్నారు.
భాగం హేమంతరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో దేశం సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో... హైదరాబాదులో వామపక్షాలు ఈ నెల 10న నిర్వహించనున్న బహిరంగ సభను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. బహిరంగ సభ పోస్టర్‌ను పోతినేని, భాగం తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో సీపీఐ నాయకులు పోటు ప్రసాద్, శింగు నరసింహారావు, ఎస్‌కె.జాన్‌మియా, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు.
10న వామపక్షాల సభకు ప్రజలను భారీగా తరలిస్తాం
Published Thu, Oct 3 2013 5:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement