రాజ్యాంగం ప్రకారమే.. | Legal expert opinion on SEC recruitment | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం ప్రకారమే..

Published Mon, Apr 13 2020 2:58 AM | Last Updated on Mon, Apr 13 2020 2:58 AM

Legal expert opinion on SEC recruitment - Sakshi

సాక్షి, అమరావతి: హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా, పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించేలా రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారమే పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌–200కి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం శాసనసభ రూపొందించిన చట్టం ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్‌ నిర్ణయించాలని, ఆ మేరకే గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వ్యవహరించారని పేర్కొంటున్నారు. అలహాబాద్‌ హైకోర్టు (లక్నో బెంచ్‌) ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా న్యాయనిపుణులు ఉదహరిస్తున్నారు. 

నిబంధనల ప్రకారమే..
రాష్ట్రంలో మద్యం, ధన ప్రభావమన్నది లేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించేలా, ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌–200కి  సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 10న ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీకాలం ముగియడంతో రిటైర్డు హైకోర్టు జడ్జి వి.కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా గవర్నర్‌ నియమించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగంలోని అధికరణ 243(కే), ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌–200 ఉల్లంఘించారంటూ కొందరు చేస్తున్న వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు.
 
గవర్నర్‌ నిర్ణయమే ఫైనల్‌..
► శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్‌ నిర్ణయిస్తారని రాజ్యాంగంలోని అధికరణ 243(కే) చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి స్థ్దాయితో  పరిగణించాలి. ఇతర కారణాల వల్ల తప్ప ఆయన్ను విధుల నుంచి తొలగించకూడదు. ఒకవేళ తొలగించాల్సి వస్తే హైకోర్టు జడ్జి తొలగింపునకు అనుసరించే పద్ధతిని అమలు చేయాలి. నిరూపితమైన దుర్వినియోగం,  అసమర్థత కారణాలను చూపుతూ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాక రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించవచ్చు.

► స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించేలా, పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించేలా ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం–1994  సెక్షన్‌–200కు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారమే గవర్నర్‌ ఆమోదించారంటూ న్యాయనిపుణులు తేల్చి చెబుతున్నారు.

నిమ్మగడ్డది పదవీ విరమణే..
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించారని కొందరు చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం–1994లోని సెక్షన్‌–200కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం.. రమేష్‌కుమార్‌ పదవీలో కొనసాగడానికి అర్హత కోల్పోయారు.
► 2016 ఏప్రిల్‌ 1న ఐదేళ్ల పదవీ కాలానికి నియమితులైన రమేష్‌ కుమార్‌ తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం ఈనెల 10 నుంచే పదవిలో కొనసాగే అవకాశం లేదు. అంటే ఆయన పదవీ విరమణ చేసినట్లు స్పష్టమవుతోంది.
► ఈ ప్రక్రియ అత్యంత స్పష్టంగా, పారదర్శకంగా జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం–1994లోని సెక్షన్‌–200 తాజా సవరణ ప్రకారం పదవీ కాలాన్ని మూడేళ్లకే కుదించడం వల్ల రమేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించారన్న ప్రశ్నే తలెత్తదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

యూపీ హైకోర్టు తీర్పే తార్కాణం..
– పదవీ కాలంపై గవర్నర్‌దే తుది నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌ శాసనసభ 2007లో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలానికి సంబంధించి మార్పులు చేసింది. అయితే ఆ మార్పులు చెల్లవంటూ నాడు యూపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అపర్మితా ప్రసాద్‌సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టు(లక్నో బెంచ్‌)ను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై(డబ్ల్యూపీ 3457)పై విచారించిన న్యాయస్థానం 2007 ఆగస్టు 23న కీలక తీర్పు ఇచ్చింది. ‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం సర్వీసు నిబంధనలకు సంబంధించినది కాదు. అధికరణ 243(కే) కేవలం సర్వీసు నిబంధనలకు మాత్రమే వర్తిస్తుంది. పదవీ కాలానికి సంబంధించిన మార్పు విషయంలో కాదు. సర్వీసు నిబంధనలు, పదవీ కాలం నిర్ణయంలో గవర్నర్‌దే అంతిమ అధికారం. పదవీ కాలంలో మార్పులు చేస్తూ చేసిన చట్టం వల్ల అనర్హత ఎదురైనప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వయంచాలక పదవీ విరమణ పొందుతారు’ అని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.

ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
– అవిభాజ్య ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య
‘‘ఎన్నికల కమిషనర్‌ కాల పరిమితి, సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ఈ అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ప్రకారమే ఎన్నికల కమిషనర్‌ కాల పరిమితిని, సర్వీసు నిబంధనలను సవరించింది. కరోనా వైరస్‌ వల్ల శాసనసభను హాజరుపరిచే పరిస్థితులు లేవు కాబట్టి ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇందులో ఎంత మాత్రం తప్పులేదు. ఇక్కడ చూడాల్సింది ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేసిందా లేదా అన్నదే తప్ప నిమ్మగడ్డ రమేశ్‌ విషయంలోనా, మరొకరి విషయంలోనా అన్నది కాదు. 

ఇక రెండో విషయం ఏమిటంటే... ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన జస్టిస్‌ కనగరాజ్‌ న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని చదవకుండా, పంచాయతీరాజ్‌ చట్టాన్ని చూడకుండానే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారా? ప్రభుత్వం ప్రతిదీ చట్ట ప్రకారమే చేసింది కాబట్టి ఆయన సంతృప్తి చెందారు. అందుకే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. అధికరణ 243కే చదివితే కమిషనర్‌ కాల పరిమితి వేరు, సర్వీసు నిబంధనలు వేరన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై అసలు చర్చే అవసరం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు’’
 

ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు..
– చిత్తవరపు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది
‘నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగించలేదు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీని ద్వారా చట్ట సవరణ చేసింది. కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటికే రమేష్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా మూడేళ్లు పూర్తి చేశారు. దీంతో చట్ట ప్రకారం ఆయన పదవీ కాలం ముగిసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఉంటారని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. దీని ప్రకారం రమేశ్‌కుమార్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రిటైర్డ్‌ జడ్జిని కమిషనర్‌గా నియమించింది. ఇందులో రాజ్యాంగ విరుద్ధం ఏముంది? టీడీపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందో అర్థం కావడం లేదు. చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు  అంతే బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదు’’

ఆదర్శ వ్యవస్థ కోసమే ఆర్డినెన్స్‌
– నిమ్మగడ్డ నిష్క్రమణ అందులో భాగమే
– ఎన్నికల ప్రకియలో న్యాయకోవిదుడి నియామకం వ్యవస్థకు మేలు చేస్తుంది
– ఇది ఎన్నికల తీరునే సమూలంగా మార్చేసే ప్రక్రియ
ఎన్నికల ప్రక్రియలో ఒక ఆదర్శప్రాయమైన వ్యవస్థ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చిందని, అది అమలు చేయడంలో భాగంగానే నిమ్మగడ్డ నిష్క్రమణ జరిగిందని, అంతేతప్ప ఆయన్ను తొలగించలేదని న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓ దళితుడిని, న్యాయ కోవిదుడిని నియమించడం వ్యవస్థకు మేలు చేస్తుందని, సామాజికంగానూ ఎంతో ఉపకరిస్తుందని, దేశానికి ఇది అనుసరణీయమని పేర్కొంటున్నారు. న్యాయమూర్తిగా పనిచేసిన వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఎన్నికల తీరునే సమూలంగా మార్చేసే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు. ఇక ఇలాంటి ఆర్డినెన్స్‌లు గతంలోనూ వచ్చాయని, ఇవేమీ కొత్త కాదని స్పష్టం చేస్తున్నారు. 1993లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) హోదాలో టి.ఎన్‌ శేషన్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావడం, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. దీన్ని సవాల్‌ చేస్తూ శేషన్‌ నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని న్యాయస్థానం సమర్ధించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement