ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చట్టబద్ధత లేని కమిటీల ఆటలు ఇక చెల్లవని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ అన్నారు. ఏలూరులో శనివారం ఏలూరు, అమలాపురం, రాజమండ్రి, బాపట్ల, నరసరావుపేట, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయన దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 73, 74 రాజ్యాంగ సవరణలను ధిక్కరించిందని, గ్రామాల్లో ప్రముఖులతో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలను వేసి ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. వారు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. దీనివల్ల బీజేపీకి దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా పోతోందన్నారు.
తాము సూచించిన వారికి సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. అలాగే అర్హులైన వారికి కూడా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తుండడంతో బీజేపీపై ప్రజలకు సానుకూల దృక్పథం రావడం లేదన్నారు. దీనిపై రాజ్‌కుమార్ సింగ్ స్పందిస్తూ ఇకపై జన్మభూమి కమిటీల ప్రాబల్యాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ బీజేపీని సొంతంగా బలపడేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆశయాల మేరకు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు మౌలిక వసతులు సమీకరించుకోవాలని, కార్యకర్తలను మరింతగా పెంచుకోవడానికి నాయకులు కృషి చేయాలని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పార్టీని బూత్‌ల వారీగా బలోపేతం చేయాలని, కేవలం పనిచేసే వారితోనే బూత్ కమిటీలు నిర్మాణం జరిగితే పార్టీకి ప్రయోజనముంటుందని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడుతూ 6 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్‌కే సింగ్ ప్రతీ నెలలో కనీసం రెండు నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తే పార్టీ మరింత బలపడే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బ్యాంకర్లు అర్హులకు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, తాను చెప్పినా వారు అంగీకరించకపోవడం బాధిస్తోందన్నారు. దీనిపై రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించి బ్యాంకర్లకు తగిన ఆదేశాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సీహెచ్ కుమరస్వామి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకట్రావు, ప్రకాశం జిల్లా నేత పీవీ.కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర మీడియా కో–ఆర్డినేటర్ తురగా నాగభూషణం, ఏలూరు నగర అధ్యక్షుడు నాగం శివ, పలువురు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరికలు..
నగరానికి చెందిన వ్యాపారవేత్త శీర్ల భాస్కరరావు కేంద్ర మంత్రి సమక్షంలో 300 మంది అనుచరులు, ముస్లిం మహిళలతో పార్టీలో చేరారు. వారికి కేంద్ర మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ నంది బాలసత్యనారాయణ పార్టీలో చేరారు. వందలాది మంది బీజేవైయం నాయకులతో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment