గ్రేడింగ్ కోసం రాసి పోసిన నిమ్మకాయలు
గూడూరు: ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగానే సీజన్.. అన్ సీజన్ అనే తేడా లేకుండానే నిమ్మకాయలు లూజు బస్తా ధర కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.12 వేల వరకూ అమ్మడం 60 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. గత నెల 27వ తేదీన గరిష్టంగా లూజు బస్తా రూ.12 వేలు పలకడం విశేషం. ఆ ధరలకే వామ్మో అంటే ఆ ధరలు పెరుగుతూ పోయి సెప్టెంబర్ 4వ తేదీన ఏకంగా లూజు బస్తా రూ.15 వేలు పలికి ఆ చరిత్రను తిరగరాసింది. ఈ క్రమంలో గూడూరులో నిమ్మకాయలు అధిక ధరలు పలుకుతున్నాయని తెలిసి తెలంగాణలోని నల్గొండ, నకిరేకల్, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల నుంచి కూడా కాయలు ఇక్కడకు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే లూజు బస్తాపై రూ.6 వేలు తగ్గి రూ.9 వేలకు పడిపోయింది. అప్పటి నుంచి ధరలు తగ్గుతూ, పెరుగుతూ బస్తా రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకూ అమ్మాయి. శనివారం లూజు బస్తా ధర గరిష్టంగా రూ.15, 500 పలకాయి. ఆదివారం లూజు బస్తా ఏకంగా రూ.16 వేలు పలికాయి. కిలో నిమ్మకాయలు రూ.200 పలుకుతూ నిమ్మ చరిత్రలోనే రికార్డు సృష్టించాయి.
జిల్లాలోని గూడూరు, పొదలకూరు, రాపూరు, సైదాపురం, ఓజిలి, డక్కిలి, బాలాయపల్లి, చేజర్ల తదితర ప్రాంతాల్లో సుమారు 17 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. వర్షాలు సక్రమంగా పడితే అరకొరగా నీరున్నా నెలకు రెండు తడులు నీరు పెట్టుకుంటే నిమ్మ చెట్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 2015వ సంవత్సరంలో వర్షాలు ఆశించినమేర పడినా, వరదలతో భూమిలోకి నీరు ఇంకకుండానే సముద్రం పాలైంది. దీంతో గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం నెలకొన్నట్లే. ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మ చెట్లకు నీరందక రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొని నిమ్మ చెట్లు ఎండకుండా బతికించుకోగలిగారు.
పడిపోయిన దిగుబడులు
తీవ్ర వర్షాభావంతో నిమ్మ చెట్లు నిలువునా ఎండిపోవడంతో ఎన్నడూ లేని విధంగా దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీంతో గూడూరు నిమ్మ మార్కెట్‌లో ఉన్న 29 నిమ్మ కొట్లకు ప్రస్తుతం ఒక్క లూజు నుంచి కేవలం ఐదు లూజులలోపే వస్తున్నాయి. సాధారణంగా అయితే ఒక్కో కొట్టుకు 50 నుంచి 150 లూజుల వరకూ రోజూ వస్తుంటాయి. దీన్ని బట్టి దిగుబడులు ఎంత పడిపోయాయో అర్థమవుతోంది.
పెరుగుతున్న నిమ్మసాగు
కొన్నేళ్లుగా నిమ్మ ధరల ఆటుపోటులతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపారు. ఈ మేరకు గతంలో 25 వేల హెక్టార్లలో ఉన్న నిమ్మ సాగు ప్రస్తుతం 17 వేల హెక్టార్లకు చేరుకుంది. కానీ ఈ ఏడాది సీజన్, అన్ సీజన్ అనేది లేకుండా ఎన్నడూ లేని విధంగా నిమ్మ ధరలు పలకడంతో నిమ్మ సాగుకు రైతాంగం మళ్లీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు తిరుపతి, అనంతరాజుపేటలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిమ్మ మొలక రూ.20 పలకుతుండగా ప్రస్తుతం వాటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రైవేట్ నర్సరీల్లో రూ.55 అయినా మొలకల్లేవని రైతులు వాపోతున్నారు. రైతులు ప్రస్తుతం సమాయత్తమవుతున్నదాన్ని బట్టి నిమ్మసాగు రెట్టింపు అయ్యే పరిస్థితులు వ్యక్తమవున్నాయి. సాగు విస్తీర్ణం ఆ స్థాయిలో పెరిగితే రాబోయే రోజుల్లో అదే స్థాయి డిమాండ్ ఉంటుందా! అనే కోణంలో కూడా రైతాంగం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యాపారులు అంటున్నారు.
కాయల్లేకపోవడంతోనే
తీవ్ర వర్షాభావంతో నిమ్మ చెట్లు ఎండిపోయాయి. తోటల్లో కాయలే లేవు. దీంతోనే అధిక ధరలు పలుకుతున్నాయి. మాలాంటి వారికి ప్రయోజనం లేకుండా పోయింది.
–సుబ్రహ్మణ్యం, ఓడూరు, రైతు
చెట్లు కాపాడుకోవడంతోనే సరిపోయింది
నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో బావుల్లో నీరు లేకుండా పోయింది. బోర్లలో నీరు కూడా నిలిచిపోయింది. చెట్లు ఎండిపోతుంటే తట్టుకోలేక బోర్లు వేసేందుకే ఎంతో ఇబ్బంది పడ్డాం. అర కొరగా కాయలున్నా ధరలు బాగా పలకడంతో ఫలసాయం బాగానే వచ్చింది.
– ఆనాల శ్రీనివాసులు, ఓడూరు
Comments
Please login to add a commentAdd a comment