lemon market
-
రోజురోజుకు పెరిగిపోతున్న నిమ్మ ధరలు
ఆళ్లగడ్డ: రోజు రోజుకు నిమ్మ ధరలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ధరల్లేక.. ధర ఉన్నా ఆశించిన మేర దిగుబడి రాక నష్టాలు చవిచూసిన రైతులకు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రకృతి అనుకూలించడంతో ఏడాది పొడవునా మంచి కాపు కాస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కాయ నాణ్యతను బట్టి బస్తా రూ.2000 నుంచి రూ.2200 వరకు ధర పలికింది. ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు, జాతరలతో పాటు వేసవి గిరాకీ కూడా తోడు కావడంతో నిమ్మ ధరలు రెట్టింపు అయ్యాయి. గత 20 రోజుల నుంచి జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ నిమ్మకాయల మార్కెట్ (మండీ)లో పండుగాయలు బస్తా (సుమారు 40 కిలోలు) రూ.3,800 నుంచి రూ.4,000 పలకగా.. పచ్చికాయ రూ.4,000 నుంచి రూ.4,500 వరకు వ్యాపారులు సవాల్ పాడుతున్నారు. రెండు నెలల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక దశలో బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో బస్తా రూ.8 వేలు వరకు చేరిందంటే నిమ్మ మార్కెట్ ఎంత జోరుమీదుందో అర్థమవుతుంది. అంతర్జాతీయంగా డిమాండ్ ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ప్యాపిలి, డోన్ మండాలాల నుంచి రోజు భారీగా నిమ్మకాయలు మినీ లారీలు, ఆటోలు, ట్రాక్టర్లలో ఆళ్లగడ్డ, నంద్యాల మార్కెట్లకు తరలివస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు రైతులతో మాట్లాడుకుని ఇద్దరు, ముగ్గురు రైతులవి కలిపి లారీలకు లోడ్ చేసి నేరుగా బెంగళూర్, చైన్నె, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, జైపూర్, మహారాష్ట్ర మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. నిమ్మకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో అక్కడి నుంచి విదేశాలకు సైతం ఎగుమతి జరుగుతోంది. రైతులకు నిఖరాదాయం నిమ్మ ఏడాదికి మూడు కాపులు వస్తాయి. ఈ క్రమంలో ఏడాదిలో ఒక సీజన్లోనైనా మంచి ధర పలికితే చాలు అని గతంలో అనుకునేవారు. అలాంటిది మూడు సంవత్సరాలుగా సీజన్, అన్ సీజన్ అన్న తేడాలేకుండా నిమ్మకు డిమాండ్ ఉంటుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరా నిమ్మ సాగు చేసిన రైతు ఖర్చలు పోను రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు నిఖర ఆదాయం పొందుతున్నారు. గతంలో ఎకరాకు ఏడాది పొడువునా రూ.లక్ష వరకు వస్తే పెద్ద సంగతి. ఇందులో ఖర్చులు, పెట్టబడి పోను ఎకరాకు రూ.10 నుంచి రూ.20 వేలు మిగిలితే అంతే చాలు అనుకుని సంబరపడేవారు. అయితే ఈ సంవత్సరం ధర ఆశాజనకంగా ఉండటంతో మంచి ఆదాయం పొందుతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఆళ్లగడ్డ సబ్‌డివిజన్ పరిధిలో నిమ్మ సాగు ఏటికేడు విస్తారంగా పెరుగుతోంది. రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. గత ప్రభుత్వం నామమాత్రంగానే రాయితీలు అందించింది. అదీకూడా టీడీపీ నాయకులకు, వారు సిఫార్సు చేసిన వారికి మాత్రమే హెక్టార్‌కు రూ.13 వేలు మంజూరు చేసేవారు. ప్రస్తుతం తోటల పుణరుద్ధరణ పథకం కింద ముదురు తోటలను తొలగించి చెట్లు నాటుకుంటే ఉద్యానశాఖ హెక్టార్‌కు రూ.17,700 రాయితీ అందజేస్తోంది. ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు నిమ్మ సాగుకు ప్రత్యేకంగా ప్రోత్సాహం లభిస్తోంది. ఎకరాకు ఏడాదికి రూ.50 వేల వరకు అందజేస్తున్నారు. సేద్యం ఖర్చులతో పాటు అంతర్ పంటల సాగుకు అయ్యే పెట్టుబడి కూడా ఉపాధి హామీలో అందిస్తోంది. వైఎస్సార్ జలకళ ద్వారా నిమ్మ తోటల్లో ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయిస్తోంది. ఇందు కోసం బోరు, కేసింగ్ పైపు, మోటరు, విద్యుత్ సౌకర్యం మొత్తం కలిపి ఒక్కో రైతుకు రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ధర పెరుగుతూ వస్తోంది ఎకరా రూ.లక్ష ప్రకారం 3 ఎకరాలను కౌలుకు తీసుకున్నా. నెల నుంచి నిమ్మకాయకు ధర పెరుగుతూ వస్తోంది. గత రెండు కాపులు పెట్టుబడికి, కౌలుకు సరిపోయింది. డిసెంబర్లో వచ్చిన మంచుతో ప్రస్తుత కాపు కొంత మేర దెబ్బతినడంతో నష్టం వస్తుందని అనుకున్నాం. అయితే మార్కెట్లో ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో లాభాలు వస్తున్నాయి. – నారపురెడ్డి, కౌలు రైతు, కోటకందుకూరు మరింత పెరిగే అవకాశం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది పొడువునా నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రకృతి అనుకూలించక పోవడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో నిమ్మ కాపు సరిగా వచ్చినట్లు లేదు. అందుకే ధర బాగా పలికే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఆళ్లగడ్డ ప్రాంతంలోని భూములు, ఇక్కడి వాతావరణం నిమ్మసాగుకు బాగా అనుకూలం. ప్రస్తుతం వచ్చిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో అక్కడక్కడ నిమ్మ కాపు రాలిపోయింది. దీంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకోవాలి. – నాగరాజు, జిల్లా ఉద్యానశాఖాధికారి -
అమ్మో నిమ్మ! ఒక కాయ ధర ఎంతో తెలుసా?
సాక్షి, ఆదిలాబాద్: మార్కెట్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. ఎండలు ముదరడంతోపాటు కరోనా ప్రభావంతో నిమ్మకాయల వాడకం పెరిగింది. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వేసవికాలంలో ప్రతిఒక్కరూ నిమ్మకాయలను వినియోగిస్తారు. అంతేకాకుండా నిమ్మకాయలలో “సి’ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వివిధ రకాల కషాయాలను సేవిస్తున్నారు. నిమ్మ, తేనె, పసుపు కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకంతో గతేడాది నుంచి నిమ్మకాయల వినియోగం పెరిగింది. మార్కెట్లో గతంలో ఒక్క నిమ్మకాయ రూ.2 ఉండగా ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.5 పలుకుతోంది. ధరలు పెరిగినా నిమ్మకాయలు మార్కెట్లో దొరకడం లేదని వినియోగదారులంటున్నారు. జిల్లాలో నిమ్మతోటల విస్తీర్ణం చాలా తక్కువ జిల్లాలో నిమ్మతోట విస్తీర్ణం అంతంత మాత్రంగా ఉంది. చెప్పుకునే విధంగా నిమ్మతోటల పెంపకం లేదని ఉద్యానవన శాఖ అధికారులంటున్నారు. నిమ్మకాయలు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా నిమ్మకాయలు దిగుమతి కాకపోవడంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్ మాసంలోనే నిమ్మకాయ రూ.5 ఉంటే రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులంటున్నారు. మే నెలలో వివాహాలు ఎక్కువగా ఉండడంతో నిమ్మకాయల ధరలు రెండింతలు పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు వ్యాపారులు తెలిపారు. -
నిమ్మ రైతులకు ఊరట
నిమ్మ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెటింగ్ శాఖ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యాపారులతో ఇటీవల ఆ శాఖ అధికారులు చేపట్టిన చర్చలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో రైతులకు మేలు జరుగుతోంది. నాణ్యమైన కాయల కొనుగోలుతో రైతులకు గిట్టుబాటు లభిస్తోంది. పొదలకూరు: కరోనా కష్టకాలంలో నిమ్మ రైతులు, వ్యాపారులు దుకాణాలనే మూసివేశారు. తోటల్లోనే కాయలు నేలరాలి కుళ్లిపోతున్న తరుణంలో ఇటీవల వ్యాపారులు దుకాణాలను తెరిచి స్వల్పంగా కాయలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్న కాయలను ఎగుమతి చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, తోటల్లోనే కాయలను మగ్గబెట్టుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ♦నిమ్మ రైతుల అగచాట్లను గుర్తించిన ప్రభుత్వం యార్డుల్లో మార్కెటింగ్‌శాఖ ద్వారా కాయలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ♦ఈ ప్రయత్నం మెల్లగా సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సీఎం ఆదేశాల మేరకు బయట రాష్ట్రాల వ్యాపారులు, అధికారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతికి లైన్ క్లియర్ చేశారు. ♦ఫలితంగా కుదేలైన నిమ్మ మార్కెట్‌కు ఊరట లభిస్తుందన్న భరోసా కనిపిస్తోంది. ♦ప్రభుత్వ ప్రయత్నంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా మార్కెట్ తెరుచుకుంది. ♦కేరళ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో నిమ్మ దిగుమతులను నిలిపివేసింది. అయితే ఇప్పుడిప్పుడే నిమ్మ ఎగుమతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. ♦ఢిల్లీ మార్కెట్ తెరుచుకుంటే కాయల ఎగుమతి పెరుగుతుంది. ప్రభుత్వ చొరవతో పెరిగిన ధరలు ♦నిమ్మ రైతులు కనీసం కాయలు కోసిన కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లలో మార్కెటింగ్‌శాఖ ద్వారా కాయలను కొనుగోలు చేస్తామని ప్రకటిచింది. ♦ఈ ప్రకటనతో నిమ్మ కొనుగోలులో మార్పులు కనిపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆయా మార్కెట్, రైతుల నుంచి వచ్చే కాయల నాణ్యతను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌శాఖ నిమ్మకు మద్దతు ధర ప్రకటించింది. ♦గూడూరు, పొదలకూరు మార్కెట్లలో కిలో నిమ్మకాయలు రూ.7 వంతున కొనుగోలు చేస్తామన్నారు. ♦అయితే వ్యాపారులే మద్దతు ధరకంటే అదనంగా చెల్లిస్తున్నారు. ♦పొదలకూరు మార్కెట్లో మంగళవారం నాణ్యత కలిగిన మూడు బస్తాల కాయలకు కిలోకు రూ.13 చెల్లించడం విశేషం. ♦ఇప్పటి వరకు రైతుల తోటల్లో మచ్చలు, డాగులు (నాణ్యతలేని కాయలు) దాదాపుగా లేకుండాపోయాయి. ♦గురువారం నుంచి నాణ్యత కలిగిన కాయలు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. ♦పొదలకూరులో 25 మంది ట్రేడర్స్ ఉండగా ఇప్పటి వరకు ఐదారుగురే దుకాణాలు తెరచి కాయలు కొనుగోలు చేస్తున్నారు. ♦మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రానికి రైతులు వచ్చి ధరల వివరాలను వాకబు చేసుకుని వెళ్తున్నారు. ఎగుమతులుంటే కొనుగోలు చేస్తాం బయట రాష్ట్రాలకు ఎగుమతులు ఉంటే కాయలను కొనుగోలు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇటీవల రైతుల నుంచి కొనుగోలు చేసి కాయలను ఎగుమతి చేయలేక, కాయలు దెబ్బతిని యార్డుకు దూరంగా పారబోయాల్సి వచ్చింది. – ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది నిమ్మ రైతుల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటోంది. గురువారం నుంచి కాయల ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. రైతులు సైతం నాణ్యత కలిగిన కాయలను మార్కెట్‌కు తీసుకు రావాలి. వ్యాపారులు మద్దతు ధర కంటే అదనంగా చెల్లిస్తున్నారు. – అనితాకుమారి, మార్కెట్ కమిటీ సెక్రటరీ -
ఇంత ధర పలకడం చరిత్రలో మొదటిసారి..
గూడూరు: ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగానే సీజన్.. అన్ సీజన్ అనే తేడా లేకుండానే నిమ్మకాయలు లూజు బస్తా ధర కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.12 వేల వరకూ అమ్మడం 60 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. గత నెల 27వ తేదీన గరిష్టంగా లూజు బస్తా రూ.12 వేలు పలకడం విశేషం. ఆ ధరలకే వామ్మో అంటే ఆ ధరలు పెరుగుతూ పోయి సెప్టెంబర్ 4వ తేదీన ఏకంగా లూజు బస్తా రూ.15 వేలు పలికి ఆ చరిత్రను తిరగరాసింది. ఈ క్రమంలో గూడూరులో నిమ్మకాయలు అధిక ధరలు పలుకుతున్నాయని తెలిసి తెలంగాణలోని నల్గొండ, నకిరేకల్, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల నుంచి కూడా కాయలు ఇక్కడకు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే లూజు బస్తాపై రూ.6 వేలు తగ్గి రూ.9 వేలకు పడిపోయింది. అప్పటి నుంచి ధరలు తగ్గుతూ, పెరుగుతూ బస్తా రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకూ అమ్మాయి. శనివారం లూజు బస్తా ధర గరిష్టంగా రూ.15, 500 పలకాయి. ఆదివారం లూజు బస్తా ఏకంగా రూ.16 వేలు పలికాయి. కిలో నిమ్మకాయలు రూ.200 పలుకుతూ నిమ్మ చరిత్రలోనే రికార్డు సృష్టించాయి. జిల్లాలోని గూడూరు, పొదలకూరు, రాపూరు, సైదాపురం, ఓజిలి, డక్కిలి, బాలాయపల్లి, చేజర్ల తదితర ప్రాంతాల్లో సుమారు 17 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. వర్షాలు సక్రమంగా పడితే అరకొరగా నీరున్నా నెలకు రెండు తడులు నీరు పెట్టుకుంటే నిమ్మ చెట్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 2015వ సంవత్సరంలో వర్షాలు ఆశించినమేర పడినా, వరదలతో భూమిలోకి నీరు ఇంకకుండానే సముద్రం పాలైంది. దీంతో గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం నెలకొన్నట్లే. ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మ చెట్లకు నీరందక రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొని నిమ్మ చెట్లు ఎండకుండా బతికించుకోగలిగారు. పడిపోయిన దిగుబడులు తీవ్ర వర్షాభావంతో నిమ్మ చెట్లు నిలువునా ఎండిపోవడంతో ఎన్నడూ లేని విధంగా దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీంతో గూడూరు నిమ్మ మార్కెట్లో ఉన్న 29 నిమ్మ కొట్లకు ప్రస్తుతం ఒక్క లూజు నుంచి కేవలం ఐదు లూజులలోపే వస్తున్నాయి. సాధారణంగా అయితే ఒక్కో కొట్టుకు 50 నుంచి 150 లూజుల వరకూ రోజూ వస్తుంటాయి. దీన్ని బట్టి దిగుబడులు ఎంత పడిపోయాయో అర్థమవుతోంది. పెరుగుతున్న నిమ్మసాగు కొన్నేళ్లుగా నిమ్మ ధరల ఆటుపోటులతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపారు. ఈ మేరకు గతంలో 25 వేల హెక్టార్లలో ఉన్న నిమ్మ సాగు ప్రస్తుతం 17 వేల హెక్టార్లకు చేరుకుంది. కానీ ఈ ఏడాది సీజన్, అన్ సీజన్ అనేది లేకుండా ఎన్నడూ లేని విధంగా నిమ్మ ధరలు పలకడంతో నిమ్మ సాగుకు రైతాంగం మళ్లీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు తిరుపతి, అనంతరాజుపేటలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిమ్మ మొలక రూ.20 పలకుతుండగా ప్రస్తుతం వాటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రైవేట్ నర్సరీల్లో రూ.55 అయినా మొలకల్లేవని రైతులు వాపోతున్నారు. రైతులు ప్రస్తుతం సమాయత్తమవుతున్నదాన్ని బట్టి నిమ్మసాగు రెట్టింపు అయ్యే పరిస్థితులు వ్యక్తమవున్నాయి. సాగు విస్తీర్ణం ఆ స్థాయిలో పెరిగితే రాబోయే రోజుల్లో అదే స్థాయి డిమాండ్ ఉంటుందా! అనే కోణంలో కూడా రైతాంగం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యాపారులు అంటున్నారు. కాయల్లేకపోవడంతోనే తీవ్ర వర్షాభావంతో నిమ్మ చెట్లు ఎండిపోయాయి. తోటల్లో కాయలే లేవు. దీంతోనే అధిక ధరలు పలుకుతున్నాయి. మాలాంటి వారికి ప్రయోజనం లేకుండా పోయింది. –సుబ్రహ్మణ్యం, ఓడూరు, రైతు చెట్లు కాపాడుకోవడంతోనే సరిపోయింది నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో బావుల్లో నీరు లేకుండా పోయింది. బోర్లలో నీరు కూడా నిలిచిపోయింది. చెట్లు ఎండిపోతుంటే తట్టుకోలేక బోర్లు వేసేందుకే ఎంతో ఇబ్బంది పడ్డాం. అర కొరగా కాయలున్నా ధరలు బాగా పలకడంతో ఫలసాయం బాగానే వచ్చింది. – ఆనాల శ్రీనివాసులు, ఓడూరు -
‘నిమ్మ’ ధర..ఢమాల్!
నకిరేకల్ : వేసవికాలం నేపథ్యంలో నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక బస్తా ధర రూ.1200 పలకగా, నాలుగు రోజులనుంచి పడిపోయింది. ప్రస్తుతం బస్తా ధర రూ.600లకు మించి రావడం లేదు. దీంతో నిమ్మ రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. ఏటా 2.50లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. అంటే రూ.300కోట్ల పైనే నిమ్మ వ్యాపారం సాగుతోంది. ఒక్కో నిమ్మకాయ బస్తా 22 కేజీలు ఉంటుంది. ఒక్కో బస్తాలో లావుకాయ అయితే 600 వరకు, చిన్న కాయలైతే 900 వరకు నింపుతారు. గతంలో నిమ్మరైతులు దళారులకు అమ్ముకునేవారు. ఎన్నో ఏళ్లనుంచి రైతులనుంచి వచ్చిన డిమాండ్ మేరకు నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3కోట్లతో నకిరేకల్‌లోని తిప్పర్తిరోడ్డు చిమలగడ్డ సమీపంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిమ్మమార్కెట్ నిర్మించారు. ఈ మార్కెట్ ప్రారంభమైన నాటి నుంచి నాలుగు రోజు ల క్రితం వరకు కూడా ఒక నిమ్మ బస్తా ధర రూ. 900నుంచి రూ.1300 ధర పలికింది. ప్రస్తుతం బస్తా ధర 400 నుంచి 600వరకు పడిపోయింది. ప్రధానంగా నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. సాయంత్రం 6 గంటలనుంచి మార్కెట్లో కొనుగోళ్లు ఇక్కడ ఈ మార్కెట్లో ప్రతి రోజు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, సూర్యపేట, కోదాడ తదితర ప్రాంతాలకు చెందిన నిమ్మ బేరగాళ్ళు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతుంటారు. రైతులనుంచి కొనుగోలు చేసిన నిమ్మ దిగుబడులను హైదరాబాద్‌కు, అక్కడినుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. రైతు దగ్గరినుంచి గతంలో మార్కెట్ ప్రారంభం కాకముందు దళారులు 13శాతం కమీషన్ తీసుకునేవారు. ప్రస్తుతం నిమ్మ మార్కెట్ ప్రారంభం చేయడంతో 4శాతం మేర కమీషన్ భారం రైతుపై పడుతోంది. నాలుగు రోజుల నుంచి గత ఏడాది కాలంగా కొనసాగిన ధర పడిపోవడంతో రైతులు కొంత నిరాశ నిసృహలకు లోనవుతున్నారు. బస్తా ధర రూ.900పైనే రావాలి మాది శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామం. నాకు ఆరు ఎకరాల్లో నిమ్మ తోట ఉంది. ఇటీవల గాలి దుమారంతో నిమ్మకాయలు రాలిపోయాయి. పక్షం రోజుల క్రితం ఈ మార్కెట్‌కు వచ్చినప్పుడు ఒక నిమ్మ బస్తా ధర రూ.1000 వరకు వచ్చింది. నాలుగు రోజులనుంచి తగ్గింది. రూ.600కు మించి ధర రావడం లేదు. ఒక్క నిమ్మ బస్తాకు కనీసం రూ.900 పైబడి ధర పలికితే రైతుకు లాభం ఉంటుంది. – తోట వీరయ్య, నిమ్మ రైతు, అంబారిపేట నిమ్మ ధరల్లో నిలకడ ఉండదు నిమ్మ ధరలలో నిలకడ ఉండదు. నిమ్మ మార్కెట్ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు రైతుకు మంచి మద్దతు ధర లభించింది. నాలుగు రోజులనుంచి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం వాస్తవమే. నిమ్మ కాయలు ఎక్కువ దిగుబడి వస్తే ధర తగ్గుముఖం పడతాయి. వేసవి నేపథ్యంలో నిమ్మకు మంచిడిమాండ్ ఉంటుంది. రైతులకు కూడా తగిన ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – వెంకన్న, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ -
‘వారు పోరాడేది కుర్చీల కోసమే’
సాక్షి, నకిరేకల్/నల్గొండ: కాంగ్రెస్ హయాంలో సాగునీటికి, కరెంట్‌కు అరిగోస పడ్డ రైతన్నల కష్టాలు తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి అన్నారు. నీటి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించడం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో ఆదివారం నిమ్మ మార్కెట్‌ను ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రైతుల ఎన్నో ఏళ్ల కల నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు మూసి ఆయకట్టు కింద 40 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజల బాగుకోసం ఆలోచించని కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. వాళ్లు కుర్చీల కోసమే కొట్లాడుకుంటారనీ.. ప్రజా సమస్యలపై పోరాడే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. ఏనాడైనా మాట్లాడారా? టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని హరీశ్‌రావు అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి ఏనాడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ ఎడమకాలువకు 700 కోట్ల ఖర్చు పెడితే, నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో 1200 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా అక్రమంగా నీరు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్తున్నా ఒక్క కాంగ్రెస్ నేత నోరు మెదపలేదని విమర్శించారు. -
హక్కు అడిగినందుకు వెలి!
పట్టణ మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మకాయల మార్కెట్లో ఒక రైతుకు చెందిన సరుకును కొనుగోలు చేయకుండా పక్కన పెట్టేశారు. మార్కెట్ లావాదేవీల్లో అనుసరించాల్సిన విధానాలను పాటించేలా చేయాలని వినియోగదారుల ఫోరంకు వెళ్లటమే ఆ రైతు చేసిన తప్పు. అసోసియేషన్ తీర్మానించిందంటూ నిమ్మకాయల కొనుగోలు చేయకుండా తిరస్కరించటంతో ఖిన్నుడైన ఆ రైతుకు యార్డు అధికారులు కూడా అందుబాటులో లేకపోవటం గమనించాల్సిన అంశం. తెనాలి: రూరల్ మండలం సంగంజాగర్లమూడికి చెందిన కొత్త శ్రీనివాసబాబు బుధవారం 4.5 టిక్కీల నిమ్మకాయలను తెనాలి నిమ్మ మార్కెట్‌కు పంపారు. వేలం పాటల సమయంలో ఈ లాటు సరుకు ఎవరిదని ప్రశ్నించిన కమీషన్ ఏజెంట్లు, శ్రీనివాసబాబు సరుకని చెప్పటంతో కోర్టుకు వెళ్లినందున అతడి సరుకు కొనొద్దని పక్కన బెట్టమని చెప్పేశారు. పైగా ఒక కమీషను ఏజెంటు నేరుగా శ్రీని వాసబాబుకు ఫోను చేసి ఇదే విషయం చెప్పారు. అదేమంటే ‘నీవు సమస్యలపై కోర్టుకు వెళ్లినందున, వేలంలో నీ సరుకు కొనేది లేదని, ఈ ప్రకారం తమ అసోసియేషన్ తీర్మానించిందని చెప్పారు. నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం ధరలు లేక దిగాలు పడుతున్న రైతుకు ఈ పరిణామం దిక్కతోచనీయలేదు. నిమ్మకాయలు పచ్చి సరుకైనందున వేలంపాటలో కొనుగోలు జరక్కపోతే కాయ దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 10 వేల నిమ్మకాయలు కోల్పోతే ఆ రైతుకు చాలా నష్టం కలుగుతుంది. అందుబాటులో లేని అధికారి.. దీనితో యార్డు కార్యదర్శి షేక్ గౌస్‌బాషాను కలిసేందుకు చూడగా, ఆయన అందుబాటులో లేరు. ఫోనులో సంప్రదించగా, గుంటూరు కమిషనర్ కార్యాలయంలో ఉన్నట్టు చెప్పారని శ్రీనివాసబాబు తెలిపారు. నిమ్మకాయల కొనుగోలు చేయకపోవటం, కమీషన్ ఏజెంట్ల కక్ష సాధింపుపై వివరించగా, తాను వేలం పాడిస్తానని చెప్పారు. దయాదాక్షిణ్యాలపై కాకుండా అందరి రైతుల్లానే తమ సరుకును రోజూ కొనుగోలు చేసేలా చూడాలని లేకుంటే న్యాయం కోసం తదుపరి చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. కోర్టుకెళ్లటమే నేరమా.. హక్కుల కోసం కోర్టును ఆశ్రయించటం తప్పు ఎలా అవుతుంది. మేం చిన్న రైతులం. మా పొట్టకొడితే వ్యవసాయం ఎలా చేయాలి. కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయటం లేదు. అమలు కోరుతూ మళ్లీ కోర్టుకు వెళ్లటం ఈ పరిణామానికి దారితీసింది. మేం కోరేది తప్పయితే బహిరంగ క్షమాపణ, విచారణకు సిద్ధంగా ఉన్నాం. – కొత్త శ్రీనివాసబాబు, నిమ్మరైతు, సంగంజాగర్లమూడి ఇదేమి న్యాయం.. నిమ్మ మార్కెట్లో తక్‌పట్టీ, తూకపు రశీదు ఇవ్వాలని, నాలుగు శాతం మాత్రమే కమీషను వసూలు చేయాలని 2005లో వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇప్పటికీ కమీషన్ ఏజెంట్లు, అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు బెదిరింపు ధోరణులకు దిగుతున్నారు. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమంటూ రైతుల సరుకు వేలంను వెలివేయటం ఏమిటీ? – కొత్త రమేష్‌బాబు, నిమ్మరైతు, సంగంజాగర్లమూడి -
పొదలకూరులో రైతుల ఆందోళన
పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వద్ద రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల తర్వాత కాయలతో మార్కెట్‌కు వస్తేనే కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చేసి గేట్లను మూసివేయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడున్న రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారుల ధోరణిపై మండిపడ్డారు. ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి రంగలోకి దిగి సర్దుబాటు చేశారు.