నిమ్మకాయల మార్కెట్‌లో వేలం (ఫైల్)
పట్టణ మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మకాయల మార్కెట్లో ఒక రైతుకు చెందిన సరుకును కొనుగోలు చేయకుండా పక్కన పెట్టేశారు. మార్కెట్ లావాదేవీల్లో అనుసరించాల్సిన విధానాలను పాటించేలా చేయాలని వినియోగదారుల ఫోరంకు వెళ్లటమే ఆ రైతు చేసిన తప్పు. అసోసియేషన్ తీర్మానించిందంటూ నిమ్మకాయల కొనుగోలు చేయకుండా తిరస్కరించటంతో ఖిన్నుడైన ఆ రైతుకు యార్డు అధికారులు కూడా అందుబాటులో లేకపోవటం గమనించాల్సిన అంశం.
తెనాలి: రూరల్ మండలం సంగంజాగర్లమూడికి చెందిన కొత్త శ్రీనివాసబాబు బుధవారం 4.5 టిక్కీల నిమ్మకాయలను తెనాలి నిమ్మ మార్కెట్‌కు పంపారు. వేలం పాటల సమయంలో ఈ లాటు సరుకు ఎవరిదని ప్రశ్నించిన కమీషన్ ఏజెంట్లు, శ్రీనివాసబాబు సరుకని చెప్పటంతో కోర్టుకు వెళ్లినందున అతడి సరుకు కొనొద్దని పక్కన బెట్టమని చెప్పేశారు. పైగా ఒక కమీషను ఏజెంటు నేరుగా శ్రీని వాసబాబుకు ఫోను చేసి ఇదే విషయం చెప్పారు. అదేమంటే ‘నీవు సమస్యలపై కోర్టుకు వెళ్లినందున, వేలంలో నీ సరుకు కొనేది లేదని, ఈ ప్రకారం తమ అసోసియేషన్ తీర్మానించిందని చెప్పారు. నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం ధరలు లేక దిగాలు పడుతున్న రైతుకు ఈ పరిణామం దిక్కతోచనీయలేదు. నిమ్మకాయలు పచ్చి సరుకైనందున వేలంపాటలో కొనుగోలు జరక్కపోతే కాయ దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 10 వేల నిమ్మకాయలు కోల్పోతే ఆ రైతుకు చాలా నష్టం కలుగుతుంది.
అందుబాటులో లేని అధికారి..
దీనితో యార్డు కార్యదర్శి షేక్ గౌస్‌బాషాను కలిసేందుకు చూడగా, ఆయన అందుబాటులో లేరు. ఫోనులో సంప్రదించగా, గుంటూరు కమిషనర్ కార్యాలయంలో ఉన్నట్టు చెప్పారని శ్రీనివాసబాబు తెలిపారు. నిమ్మకాయల కొనుగోలు చేయకపోవటం, కమీషన్ ఏజెంట్ల కక్ష సాధింపుపై వివరించగా, తాను వేలం పాడిస్తానని చెప్పారు. దయాదాక్షిణ్యాలపై కాకుండా అందరి రైతుల్లానే తమ సరుకును రోజూ కొనుగోలు చేసేలా చూడాలని లేకుంటే న్యాయం కోసం తదుపరి చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
కోర్టుకెళ్లటమే నేరమా..
హక్కుల కోసం కోర్టును ఆశ్రయించటం తప్పు ఎలా అవుతుంది. మేం చిన్న రైతులం. మా పొట్టకొడితే వ్యవసాయం ఎలా చేయాలి. కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయటం లేదు. అమలు కోరుతూ మళ్లీ కోర్టుకు వెళ్లటం ఈ పరిణామానికి దారితీసింది. మేం కోరేది తప్పయితే బహిరంగ క్షమాపణ, విచారణకు సిద్ధంగా ఉన్నాం. – కొత్త శ్రీనివాసబాబు, నిమ్మరైతు, సంగంజాగర్లమూడి
ఇదేమి న్యాయం..
నిమ్మ మార్కెట్‌లో తక్‌పట్టీ, తూకపు రశీదు ఇవ్వాలని, నాలుగు శాతం మాత్రమే కమీషను వసూలు చేయాలని 2005లో వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇప్పటికీ కమీషన్ ఏజెంట్లు, అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు బెదిరింపు ధోరణులకు దిగుతున్నారు. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమంటూ రైతుల సరుకు వేలంను వెలివేయటం ఏమిటీ?
– కొత్త రమేష్‌బాబు, నిమ్మరైతు, సంగంజాగర్లమూడి
Comments
Please login to add a commentAdd a comment