
సాక్షి, ఆదిలాబాద్: మార్కెట్‌లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. ఎండలు ముదరడంతోపాటు కరోనా ప్రభావంతో నిమ్మకాయల వాడకం పెరిగింది. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వేసవికాలంలో ప్రతిఒక్కరూ నిమ్మకాయలను వినియోగిస్తారు. అంతేకాకుండా నిమ్మకాయలలో “సి’ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వివిధ రకాల కషాయాలను సేవిస్తున్నారు. నిమ్మ, తేనె, పసుపు కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకంతో గతేడాది నుంచి నిమ్మకాయల వినియోగం పెరిగింది. మార్కెట్‌లో గతంలో ఒక్క నిమ్మకాయ రూ.2 ఉండగా ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.5 పలుకుతోంది. ధరలు పెరిగినా నిమ్మకాయలు మార్కెట్‌లో దొరకడం లేదని వినియోగదారులంటున్నారు.
జిల్లాలో నిమ్మతోటల విస్తీర్ణం చాలా తక్కువ
జిల్లాలో నిమ్మతోట విస్తీర్ణం అంతంత మాత్రంగా ఉంది. చెప్పుకునే విధంగా నిమ్మతోటల పెంపకం లేదని ఉద్యానవన శాఖ అధికారులంటున్నారు. నిమ్మకాయలు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా నిమ్మకాయలు దిగుమతి కాకపోవడంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్ మాసంలోనే నిమ్మకాయ రూ.5 ఉంటే రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులంటున్నారు. మే నెలలో వివాహాలు ఎక్కువగా ఉండడంతో నిమ్మకాయల ధరలు రెండింతలు పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు వ్యాపారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment